పారిశ్రామిక దేశాలు చేస్తున్న ఈ వాదనలో పస ఉండదని అందరికీ తెలుసు. ఒక పశువు తేన్పులో ఎంత మీథేన్ విడుదలవుతుంది! అది ఒకవేళ విడుదలైనా గాలిలో కలిసిపోయి గాఢత తగ్గిపోటానికి ఎంత సమయం తీసుకుంటుంది! పరిశ్రమలు, వాహనాలు దాదాపుగా ఒకేచోట వదిలే గాఢ వాయువులను పశువుల తేన్పుల వాయువులతో పోల్చవచ్చా! ఇది తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న వితండవాదం కాదా?!
అయితే అంతర్జాతీయ వేదికల మీద మన వాదనను గట్టిగా వినిపిస్తారా! లేక కమీషన్లు అందుకునేందుకు అలవాటుపడిన మన కేంద్ర వ్యవసాయ మంత్రి, ఆయన శిష్టగణం విదేశీయుల వాదనను మన్నించి వారు కొత్తగా తయారుచేసే కొత్తరకపు పశువులను కొనుగోలు చేస్తారా? మనవారికి విదేశీ ఉత్పత్తులన్నా, విదేశీ సంస్థల కమీషన్లు అన్నా మహా మోజు. మనం విదేశీ పశు జాతులను దిగుమతి చేసుకుని, పాల ఉత్పత్తులు పెంచాం అనుకుంటున్నామే గాని, మనం కోల్పోయిన స్వజాతి పశు జీవన వైవిధ్యం గురించి ఆలోచించటం లేదు. ఇప్పుడు మరోసారి మన పశుజాతి వైవిధ్యం మీద దాడి జరిపే యత్నం జరుగుతోంది.
పర్యావరణం పరిరక్షణ అంశంలో ఒక స్వజాతి ఉద్యమం మొదలవ్వాల్సిన అవసరముంది. విదేశీ ఆలోచనలను, విదేశీ శాస్త్రవేత్తల సిద్ధాంతాలను సవాలు చేసే శక్తివంతమైన శాస్త్రవేత్తల బృందం అవసరం. అటువంటి జాతీయభావ ఉద్యమం లోపించినపుడు దాని అంశం మీద విదేశీయుల వాదనదే పై చేయి అవుతుంది. పర్యావరణ పరిరక్షణ అంశం ఒక సమష్టి బాధ్యతగా మనమంతా భావించినపుడే ఇది సాధ్యమవుతుంది.
|