
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| సావిత్రి-సత్యవంతుల ప్రేమ కథ
హిందూ పురాణేతిహాసాలలో సావిత్రి-సత్యవంతుల ప్రేమ వృతాంత్తానికి ప్రత్యేక స్థానం ఉన్నది. తరాలు మారినా, మానవజీవన శైలిలో విన్నూత్నపోకడలు చోటు చేసుకున్నప్పటికీ వారిరువురి మధ్య అనురాగం ఆచంద్రతారార్కం నిలిచి ఉంటుంది.
గొప్పవాడైన ఒక మహారాజు అందాల కుమార్తె సావిత్రి. ఆమె సౌందర్యం నలుదిశలా వ్యాపించడంతో ఇతర రాజ్యాల రాజులు తమకు సావిత్రితో వివాహం జరిపించవలసిందిగా కోరుతూ సావిత్రి తండ్రికి వర్తమానాలు పంపించడం ప్రారంభించారు. అయితే రాజుల పరిణయ ప్రతిపాదనలను సావిత్రి నిరాకరించింది. తనకు సరియైన వరుని ప్రపంచమంతా తిరిగి తానే ఎంచుకుంటానని సావిత్రి తండ్రికి తెలిపింది. తండ్రి నియమించిన అంగరక్షకులు తోడుగా వరుని వెదికేందుకు సావిత్రి దేశాటన ప్రారంభించింది.
ఒకరోజు దట్టమైన అడవిలోకి ప్రవేశించిన సావిత్రి రాజ్యం కోల్పోయి అరణ్యవాసం చేస్తున్న అంధులైన రాజదంపతులను చూసింది. ఒక చిన్న పూరిపాకలో నివసిస్తున్న రాజదంపతులకు సేవలు చేస్తున్న వారి కుమారుడైన సత్యవంతుని గమనించింది. తల్లిదండ్రులను పోషించే నిమిత్తం అడవిలో కట్టెలను కొట్టి సమీపంలోని గ్రామంలో సత్యవంతుడు విక్రయిస్తాడు. సత్యవంతుని సావిత్రి తొలిచూపులోనే ప్రేమిస్తుంది.
తన అన్వేషణకు ముగింపు పలుకుతుంది. సిరిసంపదలు లేకుండా అరణ్యంలో జీవిస్తున్నసత్యవంతునికి సావిత్రిని ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి నిరాకరిస్తాడు. అంతేకాక వివాహమైన సంవత్సరకాలానికే సత్యవంతుడు మరణిస్తాడని పండితులు చెప్పడంతో సావిత్రి తండ్రి ఆందోళన చెందుతాడు. అయినా సావిత్రి వినకపోవడంతో వారిరువురి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాడు.
భర్తతో కలిసి అరణ్యానికి వెళుతుంది సావిత్రి. చూస్తుండగానే సంవత్సరకాలం గడిచిపోతుంది. సత్యవంతునికి మరణం ఆసన్నం అవుతున్నదన్న సంగతిని గ్రహించిన సావిత్రి, భర్తతో కలిసి కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళుతుంది. మధ్యాహ్నానికి కట్టెలు కొట్టి అలసిపోయిన సత్యవంతుడు, సావిత్రి ఒడిలో విశ్రమిస్తాడు. హఠాత్తుగా చీకట్లు కమ్ముకున్నాయి.
చీకట్లను చీల్చుకుంటూ యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. చూస్తుండగానే సత్యవంతుని ఆత్మను యమధర్మరాజు కైవసం చేసుకున్నాడు. వచ్చిన పని పూర్తి చేసుకుని ముందుగా సాగుతున్న యమధర్మరాజు వెంటపడింది సావిత్రి. తన భర్తను తనకు ఇవ్వమని యమధర్మరాజును వేడుకుంది సావిత్రి. పతి ప్రాణాన్ని తప్ప మరేదైనా కోరుకోమని సావిత్రిని ఆదేశిస్తాడు
యమధర్మరాజు. సంతానాన్ని ప్రసాదించవలసిందిగా వరమడుగుతుంది సావిత్రి. తథాస్తు అన్నాడు యమధర్మరాజు. తనను వెంటాడుతున్న సావిత్రిని సంగతేమిటని అడుగుతాడు యమధర్మరాజు. పతి లేకుండా సంతానం ఏమిటని లోకం ప్రశ్నిస్తుందని బదులిస్తుంది సావిత్రి..
ఆమె వరంలోని ధర్మసూక్ష్మాన్ని గ్రహించిన యమధర్మరాజు సత్యవంతునికి జీవం పోసి వెడలిపోతాడు. ప్రేమమూర్తి అయిన సావిత్రి, భర్త ప్రాణాల కోసం యమధర్మరాజును వెంటాడిన వైనం లోక ప్రసిద్ధమై ప్రేమజీవులకు ఆదర్శంగా నిలిచింది.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:53:56 PM IST ప్రేమను చరిత్ర జ్ఞాపకం కానివ్వకండి
విఫలమైన ప్రేమ మాత్రమే చరిత్ర అవుతుంది అన్నాడో సినీ కవి. అలాగే విఫలమైన ప్రేమ మధురమైన జ్ఞాపకమని అందుకే విఫలమైన ప్రేమలన్నీ మధుర జ్ఞాపకాలేనని కొందరు చెబుతుంటారు. ఈ వాక్యం నిజమనిపించేలా ఏ చరిత్ర చూసినా విఫలమైన ప్రేమలు మాత్రమే కనిపిస్తాయి. రోమియో జూలియట్, దేవదాసు పార్వతీ ఇలా చరిత్రలో నిలిచిన ప్రేమ కథలన్నీ విఫలమైనవే.
బహుశా ఈ విషయం బలపడబట్టే కావచ్చు విఫలమైన ప్రేమికులంతా తాము చరిత్ర సృష్టించినట్టూ ఫీలైపోతుంటారు. కానీ ప్రేమ నిజంగా నిజమైతే దానిని విఫలం కాకుండా కాపాడుకున్న వారే నిజమైన ప్రేమికులు. ప్రేమ పరీక్షలో వారే అసలు సిసలు విజేతలు. విజేతలైన ప్రేమికులు చరిత్రలో నిలిచిపోక పోవచ్చు. కానీ వారు సాధించిన ప్రేమ విజయం ఓ సుఖవంతమైన జీవన పయనానికి తొలిమెట్టు అవుతుంది. ఆ మెట్టు మరెందరో ప్రేమికుల ప్రేమ విజయం సాధించడానికి పునాది అవుతుంది.
మరి ప్రేమంటే ఎందుకు వెగటు... ?
ప్రేమ అన్న రెండక్షరాలు చరిత్రను సృష్టించగలదు. అలాగే చరిత్రను తిరగరాయనూగలదు. అందుకే ప్రపంచంలో దేనీకి లొంగనిదిగా ప్రేమను అభివర్ణిస్తుంటారు. ప్రేమ గొప్పదని అందరూ ఒప్పుకుంటుంటారు. కానీ అదేమీ దురదృష్టమో గానీ ప్రేమ అన్న విషయం తమ పిల్లల దాకా వస్తే మాత్రం అంతవరకు పొగిడిన వారి తల్లిదండ్రులు సైతం ప్రేమపై అంతెత్తున లేచి పడుతారు. ఆ ప్రేమికులను విడదీయడానికి వీలైన అన్ని ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
ప్రేమికులుగా మీరేమీ సాధించలేరని ప్రేమ ఆకర్షణ మాత్రమేనని అందుకే తమ మాట విని ప్రేమ గీమా అంటూ నాశనం కావద్దని గీతోపదేశం ప్రారంభిస్తారు. అలా కాదని వారి పిల్లలు ప్రేమ విషయంలో ముందుకెళితే దానిని నాశనం చేయడానికి క్రూరమైన ప్రయత్నాలు సైతం ప్రారంభిస్తారు.
ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం, ఆకర్షణనే ప్రేమనుకోవడం, ప్రేమ పేరుతో ముందుకెళ్లిన తర్వాత సాంఘిక అవసరాలు దృష్టికి రావడం లాంటి అంశాల వల్ల ప్రేమికులు సైతం తమ ప్రేమను విఫలం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పైన పేర్కొన్న అంశాలన్నీ కలిసి నిజమైన ప్రేమకున్న గొప్పతనాన్ని దెబ్బతీస్తుంటాయి.
ప్రేమ చరిత్ర జ్ఞాపకం కాకూడదంటే... ?
ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ నిజమైతే దాన్ని జీవితాంతం కాపాడుకోవడానికి వారిద్దరూ ప్రయత్నించాలి. ఆ విషయంలో వచ్చే సమస్యల్ని అధిగమించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. అందుకోసం విధిలేని పరిస్థితుల్లో పెద్దల్ని ఎదిరించడానికి సైతం సిద్ధం కావాలి. అయితే కేవలం ఆకర్షణనే ప్రేమనుకునే వారికి మాత్రం ఈ విషయాలు వర్తించవు.
అలాంటివారికున్నది ప్రేమ భావం కాదు. ఆ పేరుతో వారి మనసులో ఉన్న ఆకర్షణ మాత్రమే. అందుకే నిజమైన ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న వ్యాత్యాసాన్ని గుర్తించినవారు ప్రేమ విఫలం కావాలని ఎన్నటికీ కోరుకోరు. అలాగే వారు తమ ప్రేమ చరిత్రలో కాకుండా తమ గుండెల్లో కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటారు.
మీరూ ప్రేమికులైతే మీ ప్రేమను చరిత్ర చేసుకుంటారో లేక గుండెల్లో నిలుపుకుంటారో మీ ఇష్టం... ఆలోచించండి.
అయితే ప్రేమ గురించి అంతలా భయపడే పెద్దలు కేవలం తమ పెద్దరికాన్ని నిరూపించుకోవడానికి తప్ప మరే విధంగానూ పిల్లల ప్రేమను విడదీయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మర్చిపోతుంటారు. ఇదంతా నాణేనికి ఓ పక్కమాత్రమే కొన్నిసార్లు ప్రేమ విషయంలో ప్రేమికుల తప్పులు సైతం వారి ప్రేమ విఫలం కావడానికి దారితీస్తుంది.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:49:00 PM IST మనసు మందిరంలో ప్రేమ అడుగుపెట్టిన వేళ
ప్రేమ అనే అనీర్వచనీయమైన భావాన్ని వర్ణించడానికి వీలుకాదు. ప్రేమలో పడ్డామని ఎవరైనా అంటే అది విన్న మనకు ఏదో జోకు విన్ని ఫీలింగ్ కలగవచ్చు. కానీ ప్రేమభావం అన్నది తమదాకా వస్తేగానీ అందులో ఉన్న తీవ్రత అర్ధం కాదు. అందుకే ప్రేమ, పిచ్చి ఒకలాంటివే అని అంటుంటారు.
పిచ్చివారి గురించి లోకం పట్టించుకోదు. వాళ్లకంటూ ఉన్న లోకం గురించి తప్ప బాహ్య ప్రపంచం గురించి పిచ్చివాళ్లు పట్టించుకోరు. అంతలా కాకపోయినా ప్రేమలో పడ్డవారు కూడా ఒక్కోసారి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి మరీ తమ ప్రేమలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనే భావం మనసులో ప్రవేశించి ఆ ప్రేమ లోగిళ్లలోకి అడుగుపెట్టిన సమయంలో మనిషికి లోకమే సరికొత్తగా కనిపిస్తుంది.
""యవ్వనంలో అడుగుపెట్టిన వేళ మనిషి శరీరంలో జరిగే రసాయన చర్యల ఫలితమే ప్రేమంటే... అంతే తప్ప మరేమీ లేదని యవ్వనం దాటేసిన పెద్ద మనష్యులు తీర్మాణాలు చేసేస్తుంటారు.""
ప్రేమభావంతో మనసు నిండిపోయిన వేళ ఎండిపోయిన మొక్కలో లేత చిగుళ్లు కనిపిస్తాయి. గుచ్చుకునే ముళ్లు సైతం మెత్తటి తివాచీలా అనిపిస్తుంది. ఇంతలా మనిషిని ప్రభావితం చేసే సమ్మోహన శక్తి ప్రేమకు మాత్రమే ఎందుకు ఉంది అన్నది యుగాలుగా, తరాలుగా మనిషినికి అంతు చిక్కకుండానే పోతోంది.
మనిషిని మార్చేటంతటి గొప్పశక్తి ప్రేమకు ఉందని నవీన శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకుంటున్నా దాని అంతేమిటో మాత్రం ఎప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రేమ పేరుతో మోసాలు, వంచనలు జరుగుతున్నా ప్రేమ వలలో చిక్కుకుని జీవితాలే బలైపోతున్నా ప్రపంచంలో ప్రేమకు ఉన్న సమ్మోహన శక్తి ఏమాత్రం తగ్గడం లేదు.
కాలం ఎంత వేగంగా పరిగెడుతున్నా, ఎన్నీ నవీన పోకడలు మనిషి దరిచేరుతున్నా రెండు మనసుల్లో అకస్మాత్తుగా పుట్టే ప్రేమభావం మాత్రం యుగాలుగా కొనసాగుతూనే ఉంది. నిజమైన ప్రేమ మనిషి గుండె తలుపు తట్టిన వేళ దానికోసం మనిషి ఏం చేయడానికైనా సిద్ధమైపోతుంటాడు.
యవ్వనంలో అడుగుపెట్టిన వేళ మనిషి శరీరంలో జరిగే రసాయన చర్యల ఫలితమే ప్రేమంటే... అంతే తప్ప మరేమీ లేదని యవ్వనం దాటేసిన పెద్ద మనష్యులు తీర్మాణాలు చేసేస్తుంటారు. ప్రేమంటే యవ్వనంలో కలిగే ఓ వ్యామోహం అని దానివల్ల జీవితాన్ని వ్యర్ధం చేసుకోవడం తప్ప మరో ఉపయోగం లేదని ఏనాడూ స్పందించని రాతి హృదయానికి ప్రతినిధులు నొక్కి వక్కాణిస్తుంటారు.
ఎవరెన్ని చెప్పినా, ఎవరేమి అనుకున్నా తనకేమీ పట్టనట్టు, తానేమీ విననట్టు మనసున్న మనిషి మనసులో చోటు సంపాదించుకోవడానికి ప్రేమ నిరంతరం ఎదురు చూస్తేనే ఉంటుంది. అదేమరి ప్రేమకున్న బలమంటే...
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:46:19 PM IST రెండు హృదయాల ప్రమాణం
ప్రేమ అనే పేరుతో ఇద్దరు ఒకే గూటికి చేరినపుడు అంతవరకూ వారి మధ్య లేని ఏదో భావం వారిని మరింతగా దగ్గర చేస్తుంది. దీంతో ప్రపంచంలో తాము తప్ప మరెవరూ లేరు అన్న ధ్యాసతో వారు గడిపేస్తుంటారు. అందుకే ప్రేమలో ఉన్నవారు బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టు ప్రవర్తిస్తుంటారు.
కానీ ఇదంతా ప్రేమ మొగ్గ తొడిగిన తొలినాళ్లలో మాత్రమే. కొన్నాళ్లకు ప్రేమ పాతబడిందంటే ప్రేమికులు సైతం ఒక్కోసారి శత్రువుల్లా పొట్లాటకు సిద్ధమైపోతుంటారు. అందుకే ప్రేమ అంటే యువతరంలో కలిగే ఓ వ్యామోహమని అది కాస్తా తీరిపోతే ప్రేమంటేనే చికాకు పుడుతుందని కొందరు అంటుంటారు.
ప్రేమ పేరుతో పార్కుల వెంట కొన్నాళ్లు తిరిగి అటుపై విడిపోయే ప్రేమికుల్ని చూస్తే ఆ మాట నిజమే కాబోలు అన్పిస్తుంది. కానీ కొన్నిసార్లు ప్రేమ అనేది వ్యామోహంలోంచి పుట్టినా ముందు ముందు అదో బలీయమైన బంధంగా మారే సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ప్రేమ అనేది బలీయమైన బంధంగా మారాలంటే ప్రేమలో పడ్డ ప్రేమికుల హృదయాలు స్పందించగలగాలి.
అలా స్పందించిన హృదయాలు ప్రేమ విషయంలో తామెన్నటికీ విడిపోమని ప్రమాణం చేయగలగాలి. అలా చేయగలిగిన హృదయం కలిగిన ప్రేమికుల విషయంలో ప్రేమ ఓ వ్యామోహంగా మిగిలిపోయే ఆస్కారం ఉండదని చెప్పవచ్చు. హృదయాలు ప్రమాణం చేయడం ఏంటనే సందేహం రావచ్చు.
ఎలాగైతే ఓ ఆడా, మగ పెళ్లి సందర్భంగా తాము ఎన్నటికీ కలిసే ఉంటాం విడిపోమని ప్రమాణాలు చేస్తుంటారో ప్రేమ విషయంలోనూ అలాంటి ప్రమాణాలే చేయగలగాలి. తమలోని ప్రేమ మైకం క్షణికం కాదని, నీతో జీవితాంతం కలిసి ఉండడం కోసమే నాలోని ప్రేమను వ్యక్తం చేశానని ప్రేమికులు తమ ప్రేయసి లేదా ప్రియునితో చెప్పగలగాలి.
ఆ చెప్పడం కూడా మనస్పూర్తిగా చెప్పగలగాలి. అలా చెప్పి తమ హృదయంలో పుట్టిన ప్రేమ సాక్షిగా ప్రమాణం చేయగల్గినపుడు ఇక వారి ప్రేమ ఎలాంటి సమస్య వచ్చినా చెదిరిపోకుండా నిలవగల్గుతుంది.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:43:30 PM IST ప్రేమను త్యాగం చేస్తున్నారా... ?
త్యాగం కన్నా ఈ లోకంలో గొప్పదేమీ లేదని పెద్దలు చెబుతుంటారు. ఎందరెందరో ఎన్నెన్నో త్యాగాలు చేశారు కాబట్టే ఈలోకం ఇంకా నిలిచి ఉంది అంటూ మరికొందరు చెబుతుంటారు. అందుకే త్యాగం కన్నా గొప్పదేదీ లేదని ఛాన్స్ వస్తే నువ్వు కూడా ఏదో ఓ త్యాగం చేసేసి చరిత్రలో మిగిలిపో అంటూ లెక్చర్లు దంచేస్తుంటారు.
మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా ప్రేమ విషయానికి సంబంధించి ఈ త్యాగం అనే మాట చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఫలానావారి కోసం నేను నా ప్రేమనే త్యాగం చేశాను అని కొందరంటే నా ప్రేయసి లేదా ప్రియుడి సుఖం కోరి నా ప్రేమను త్యాగం చేశానని మరికొందరు చెబుతుంటారు.
అందుకేనేమో మన సినిమాల్లో సైతం దాదాపు చివరి సీను వరకు ప్రేమించుకుని చివరకు అమ్మ ఒప్పుకోలేదనో, నాన్న మరోకరికి మాటచ్చాడనో చెప్పి ప్రేమను త్యాగం చేసేసి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి హీరో లేదా హీరోయిన్ రెడీ అయిపోతుంటారు. ఇందులో ఆశ్చర్యమేమంటే సదరు హీరో లేదా హీరోయిన్ చేసిన త్యాగాన్ని వాళ్ల ప్రేయసి లేదా ప్రియుడు కూడా అశ్రు నయనాలతో సంతోషంగా అంగీకరిస్తుంటారు.
"" ప్రేమ అనేది జీవితాంతం కలిసి జీవించడం కోసం ఏర్పడిన ఓ బంధమే గానీ త్యాగం పేరుతో దాన్ని మధ్యలో తుంచేసే అవసరం కాదు. ""
అయితే ఇద్దరు మనస్పూర్తిగా ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నది నిజమైతే వేరెవరికో నచ్చలేదనో ప్రేమను త్యాగం చేసేసి, అప్పటివరకు జరిగిందంతా మర్చిపోయి ముందు ముందు సంతోషంగా జీవించడం అంత సులభమా అంటే నిజంగా ప్రేమించినవారెవరూ కాదనే అంటారు.
ఎవరో ఒప్పుకోలేదనో, వెరవరికో ఇష్టం లేదనో ప్రేమను త్యాగం చేసి మరొకరితో జీవితాన్ని ప్రారంభించి అటువారితో సుఖంగా జీవించలేక ఇటు మనసుకు నచ్చినవారితో కలిసి జీవించలేక సతమతమయ్యే క్షణంలో అసలు మనం ఎవరికోసం ఆనాడు మన ప్రేమను త్యాగం చేశామా అని అనుకోకమానరు.
అందుకే ప్రేమికుల మధ్య ఉన్నది నిజమైన ప్రేమ అయిన పక్షంలో ఆ ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిన సందర్భంలో వారు ఓసారి ఆలోచించడం మంచిది. అలా ఆలోచించే సమయంలో అసలు నాలోని ప్రేమను నేనెందుకు త్యాగం చేయాలి. త్యాగం చేయడం ద్వారా నేను నిజంగానే సుఖపడగలనా నా ప్రేమను త్యాగం చేయమని చెబుతున్న వారంతా నా కోసమే చెబుతున్నారా ఇందులో వారి స్వార్థం లేక పట్టుదలలు ఏమీ లేవా అనే ప్రశ్నలను తమపై తామే సంధించుకోవాల్సిన అవసరం ఉంది.
"మన ప్రేమను త్యాగం చేసేద్ధాం అని ఎవరైనా తమ ప్రేయసి లేదా ప్రియుడి వద్ద మాట్లాడడం ప్రారంభించారంటే మీతో అప్పటివరకు సాగించిన ప్రేమ వ్యవహారం ముగింపుకు త్యాగం అనే అందమైన ముసుగు వేస్తున్నారని అర్థం."
అలా ప్రశ్నలు వేసుకున్నప్పుడు ప్రేమను త్యాగం చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్న సమాధానమే వారికి ఎదురవుతుంది. ఎందుకంటే ప్రేమ అనేది జీవితాంతం కలిసి జీవించడం కోసం ఏర్పడిన ఓ బంధమే గానీ త్యాగం పేరుతో దాన్ని మధ్యలో తుంచేసే అవసరం కాదు.
నిజమైన ప్రేమికులెపుడూ ప్రేమించుకునే సమయంలోనే తమకు ఎదురయ్యే సమస్యల గురించి కాస్తో కూస్తో మాట్లాడుకునే ఉంటారు. ఆ సందర్భంలో తమ ప్రేమకు ఏ రూపంలో అవాంతరాలు ఏర్పడే అవకాశముంది అని కూడా ఊహించగల్గుతారు. దాంతో ఆ సమస్యలను ఎదుర్కోవడానికి కూడా కాస్త సిద్ధంగానే ఉంటారు.
కానీ ఈ సందర్భంలో మరో విషయం గురించి కూడా మనం చర్చించుకోక తప్పదు. కొన్నిసార్లు ప్రేమికులు తమ ప్రేమ విషయంలో ఎంత పట్టుదలగా వ్యవహరించినా పెద్దవారు వారిని విడదీయవచ్చు. అలాంటి సమయంలో తప్ప మరే సమయంలోనూ ప్రేమికులకు తెలియకుండా వారి ప్రేమను వేరెవరో తుంచేయలేరు.
అందువల్ల ఫలానా విషయంలో మనకు ఇబ్బంది ఎదురవుతోంది. ఆ విషయాన్ని ఎదిరించి మనం ముందుకు వెళ్లలేం కాబట్టి మన ప్రేమను త్యాగం చేసేద్ధాం అని ఎవరైనా తమ ప్రేయసి లేదా ప్రియుడి వద్ద మాట్లాడడం ప్రారంభించారంటే మీతో అప్పటివరకు సాగించిన ప్రేమ వ్యవహారం ముగింపుకు త్యాగం అనే అందమైన ముసుగు వేస్తున్నారని అర్థం.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:40:38 PM IST పెదవి దాటని ప్రేమ : ఏమిటి లాభం
ప్రేమ అనేది మనసులోకి ఒక్కసారి అడుగుపెట్టిందంటే ఇక ఆ క్షణం నుంచి మనిషి మరోలోకంలో ప్రతినిధి అవుతాడు. ప్రేమ అనే ఆలోకంలో అతనికే తెలియనంత కొత్తగా అతను మారిపోతుంటాడు. మనసుకు నచ్చినవారు జీవితంలో తొలిసారిగా ఎదురై గుండెల్లో చిచ్చు రేగిన ఆ క్షణం నుంచి ఇక అతను తన గురించి పూర్తిగా మర్చిపోతాడు.
నిరంతరం ప్రేమ నామాన్ని జపిస్తూ దానికోసం తపిస్తూ గడిపేస్తుంటాడు. ప్రేమ అనేది గుండెల్లో అడుగుపెట్టిన తర్వాత కూడా మనిషి తన స్వకార్యాలు నిర్వహిస్తున్నా ఎందుకో ప్రేమ మాత్రమే అతని శ్వాసలాగా అనిపిస్తుంది. ముందు ముందు ఆ ప్రేమ కోసమే తాను బ్రతకాలని దాని ముందు మరేమీ అక్కర్లేదని మనసులో పదే పదే అనిపిస్తుంటుంది.
అందుకే మనసు ముంగిట్లో ప్రేమ అడుగు పెట్టిన క్షణం నుంచి తన చుట్టూ ఉన్న ప్రపంచం వెక్కిరిస్తున్నట్టు తనలో ప్రేమను నింపిన వారితో ఉండే ప్రేమ ప్రపంచం మాత్రమే తనపై అభిమానాన్ని చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ప్రేమ అనే భావం మనసులో అడుగుపెట్టినప్పటి నుంచి మనిషి తన ప్రేమికుడు లేదా ప్రేయసికి చెందిన లోకంలో జీవించడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు.
ఈ కారణంగానే ప్రేమలో పడ్డవారు భౌతికంగా అందరి మధ్యా ఉన్నా కూడా మానసికంగా మాత్రం తన మనసు దోచినవారి సానిహిత్యంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. అయితే ఇంతటి గొప్ప లక్షణమున్న ప్రేమ భావాన్ని కల్గినవారిలో మరో రకం కూడా ఉంటారు.
వారిలో ప్రేమ తీవ్ర స్థాయిలో ఉంటుంది. కానీ ఆ ప్రేమభావం జీవితంలో ఒక్కసారి కూడా తమ ప్రేయసి ముందు ఆవిష్కరించబడదు. కానీ తమలో మాత్రం ప్రేమ తీవ్రత సముద్రం కంటే మరింత లోతుగా ఉన్నట్టు వీరు ఫీలైపోతుంటారు. అలాంటి వారిని మనం ఎరక్కపోయి కదిలించామంటే తనలో గుడి కట్టుకున్న ప్రేమ భావాన్ని మన ముందు పరిచే సాహసం చేస్తారు. తన ప్రేమ సామాజ్రంలో తానెంత సుఖంగా ఉంటోంది, అక్కడ ఉండే ఆనందాలు, అద్భుతాలు అన్నీ వివరించే ప్రయత్నం చేస్తారు.
అలా తన ప్రేమలోకం గురించి ఎంత చెప్పినా వారిలో ఇంకా ఎదో ఒక అంశం మిగిలే ఉంటుంది. అందుకే తమ ప్రేమ గురించి చెప్పడం మొదలు పెట్టినవారిని భరించడం ఎవరికైనా కష్టమే. ఇలాంటివారి చూసే కాబోలు ప్రేమ పిచ్చోళ్లు అనే నానుడి ప్రచారంలోకి వచ్చుంటుంది. ఇలా సమాజం(లోని కొందరి) చేత ప్రేమ పిచ్చోళ్ల గా పిలవబడే వీరి గురించి అసలు విషయం చెప్పుకోవాలి.
వీళ్లు ప్రేమలో పడ్డ విషయం వీరి చుట్టూ ఉన్న అందరికీ తెలిసిపోతుంది. కానీ ఒక్కరికి తప్ప. ఆ ఒక్కరు వేరెవరో కాదు వీరిలో ప్రేమ కలగడానికి కారణమైనవారు కావడం గమనార్హం. ఎందుకంటే చూచిన తొలిచూపులోనే వీరు ఎదుటివారిని ప్రేమించేసి వారి మీద కల్గిన ప్రేమ భావంతో ఆ క్షణం నుంచి ప్రేమ బాధితులుగా తిరిగేస్తుంటారు.
కానీ ఒక్కసారి కూడా తమ ప్రేమ గురించి తమ ప్రేయసి దగ్గర చెప్పరు. వాళ్లు ఎదురుపడ్డా, పలకరించినా పళ్లు కన్పించేలా నవ్వుతారే తప్ప మరేమీ మాట్లాడరు. అలా వీరిలో పుట్టిన ప్రేమ భావానికి వయసు నిండిపోతూ ఉంటుంది. ఇలా గడిచిపోతోన్న వీరి ప్రేమ పయనంలో ఓ శుభ దినాన వీరి ప్రేయసి? తన పెళ్లి శుభలేకను తెచ్చి వీరి చేతిలో పెట్టేస్తుంది. అప్పుడు కూడా మరోసారి పళ్లు బైట పెట్టి నవ్వడం తప్ప మరేమీ చేయరు.
అటుపై ఆ అమ్మాయి పెళ్లికి వెళ్లి నూతన వధూవరులను చూసి మనసులోనే ఓ విరక్తి నవ్వు నవ్వేసుకుని పెళ్లి విందును కడుపారా భోంచేసేసి ఓ నిటూర్పు విడిచి ఇంటికి వచ్చేస్తారు. అలా తమ జీవితంలో ఓసారి ప్రేమలో ఓడిపోయినట్టుగా సందర్భమెచ్చినపుడు ఇతరులకు వివరించేస్తూ ఉంటారు.
ఇలాంటి ప్రేమలు ఎప్పటికీ పిచ్చివే. ఎందుకంటే ప్రేమంటే ఒకరిని గురించి మనసులో మాత్రమే అనుకోవడం కాదు. ప్రేమ అనే భావం మనసులో అడుగుపెట్టినపుడు అందుకు కారణమైన వారికి దాని గురించి చెప్పగలగాలి. వారి ప్రేమను పొందేందుకు ప్రయత్నించగలగాలి. అలా ప్రయత్నించీ కోరుకున్నవారు దక్కకపోతే ప్రేమ ఓడినట్టు? తప్ప మనసులోనే పుట్టి మనసులోనే ఉండిపోతే అది ఖచ్చితంగా ప్రేమకాదు. అలాంటి ప్రేమను పిచ్చి ప్రేమ అనడంలో బహుశా తప్పు లేదేమో.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:36:11 PM IST ప్రేమంటే అంత భయమెందుకు... ?
ప్రేమ అనగానే యువతలో ఆనందం పొంగుతుంది. కానీ పెద్దవారిలో ఆందోళన పెరుగుతుంది. ప్రేమ లేని జీవితం వ్యర్ధం అంటుంది ఉరకలేసే యవ్వనం. జీవితంలో వ్యర్థమైంది ప్రేమే అంటుంది యవ్వనం దాటిసిన పెద్దరికం. ప్రేమ విషయంలో యువత అంతలా ఆనందిస్తుంటే మరి పెద్దవాళ్లు మాత్రం ఎందుకలా భయపడుతారు... అని ఆలోచిస్తే సమాధానం దొరక్కపోదు.
ప్రేమ అన్నది మనసులోకి అడుగుపెట్టేది వయసు పొంగు ఆరని యవ్వనంలోనే. మనిషిలో యవ్వనం ఉరకలేస్తున్న వేళ అతనికి లోకమే వింతగా కన్పిస్తుంది. తన వయసువారు చేసేదే గొప్పగా తమకంటే పెద్దవారు చేసేది, చెప్పేది చాదస్తంగా అన్పిస్తుంది. అందుకే యువత తమలా ఎందుకు ఆలోచించరని పెద్దవాళ్లు బాధపడుతుంటే, పెద్దవారు తమలా ఎందుకు ఉండలేక పోతున్నారని యువత జాలి పడుతుంటుంది.
అందుకే ప్రేమంటే పెద్దవారికి భయం
"తెలిసీ తెలియని వయసులో మనసులో కలిగిన ఆకర్షణనే ప్రేమ అనుకుని దానికోసం జీవితాన్ని పాడుచేసుకున్న ఎంతోమంది యువత మన కళ్లకు కన్పిస్తూనే ఉన్నారు. అలాంటి వారిని చూచిన పెద్దవారు ప్రేమ గురించి భయపడడంలో తప్పేముంది. "
ఇలా జీవితం గురించి రెండు వేర్వేరు కోణాల్లో ఆలోచించే పెద్దవారు, యువత ప్రేమ విషయంలో సైతం అలాగే ఆలోచిస్తుంది. అందుకే యవ్వనంలోని లేత మనసుకు ప్రేమ అమృతంలా అనిపిస్తే గాయాలతో రాటుదేలిన పెద్దవారి మనసుకు ప్రేమ ఓ విషంలా అన్పిస్తుంది. అలా ప్రేమను విషంగా భావించే పెద్దవారు తమ పిల్లలు ప్రేమ పేరు చెబితే ఎందుకు భయపడకుండా ఉంటారు.
అయితే ఇక్కడ మనం ఓ విషయం ఆలోచించక తప్పదు. ప్రేమ గురించి పెద్దవారు ఎందుకు అంతలా భయపడుతారు అంటే... అందుకు కూడా కొన్ని కారణాలుంటాయి. జీవితంలో బాగా కష్టపడి ఉన్నతస్థాయికి చేరాల్సిన యవ్వన ప్రాయంలో ప్రేమ పేరుతో తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారో అన్నదే పెద్దవారి ప్రధాన భయం.
ఈ భయంలో సైతం కొంత నిజం లేకపోలేదు. తెలిసీ తెలియని వయసులో మనసులో కలిగిన ఆకర్షణనే ప్రేమ అనుకుని దానికోసం జీవితాన్ని పాడుచేసుకున్న ఎంతోమంది యువత మన కళ్లకు కన్పిస్తూనే ఉన్నారు. అలాంటి వారిని చూచిన పెద్దవారు ప్రేమ గురించి భయపడడంలో తప్పేముంది.
అలాగే ప్రేమ పేరుతో తమ సామాజిక హోదాకు, తమ విశ్వాసాలకు సరితూగని వ్యక్తిని తమ పిల్లలు జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే దానివల్ల సమాజంలో తమ గౌరవం ఎక్కడ పాడవుతోందో అన్నది పెద్దవారిలో కలిగే మరో భయం. ఇందులోనూ కొంత నిజం లేకపోలేదు.
"ప్రేమ పరీక్షలో విజయం సాధించండి
ప్రేమలో పడ్డవారు, ప్రేమిస్తున్న వారు సైతం జీవితం పట్ల సరైన దృష్టితోనే ఉన్నారన్న విషయాన్ని రుఢీ చేయగల్గితే అట్టివారి ప్రేమ పెద్దల అంగీకారం పొందడం ఈ రోజుల్లో అంతగా కష్టం కాకపోవచ్చు. "
ఇక్కడ చుట్టూ ఉన్న సమాజం గురించి ఒక్కొక్కరు ఒక్కోలా భయపడుతుంటారు. బాగా డబ్బున్న వారు హోదా గురించి ఆలోచిస్తే, మధ్య తరగతివారు గౌరవం గురించి దిగులుపడుతుంటారు. అందుకే తమ హోదాకు లేదా గౌరవానికి పిల్లల ప్రేమ వల్ల ఎక్కడ భంగం కల్గుతుందో అన్నదే పెద్దవారి భయం.
ఇక చివరగా తమ పిల్లలు జీవితంలో ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అటుపై తామే ఓ మంచి సంబంధం చూచి పిల్లలకు పెళ్లి చేయాలి అని కలలుకనే పెద్దవారికి తమ పిల్లల ప్రేమ ఓ శత్రువులా కన్పించవచ్చు. తమ ఇష్టం, తమ అభిప్రాయంతో సంబంధం లేకుండా పిల్లలే వారి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం పెద్దవారిలో కోపంతో ప్రారంభమై చివరకు అది అసహ్యంగా మారుతుంది.
స్థూలంగా ఇన్ని రకాలుగా పెద్దవారిలో ప్రేమ అనేది భయాన్ని కల్గిస్తూ ఉంటుంది. అందుకే చాలా వరకు ప్రేమలకు పెద్దల అంగీకారం లభించదనే చెప్పవచ్చు. మరి తమ ప్రేమ పెద్దల అంగీకారం పొందాలంటే యువత ఏం చేయాలి. తాము ప్రేమ పేరుతో జీవితంలో ఏదీ కోల్పోవడం లేదని పెద్దలకు అర్థం అయ్యేలా చెప్పాలి.
పెద్దవారి ఇష్టాలకు, అభిప్రాయాలకు తమలాగే తమ ప్రేమ కూడా విలువ ఇస్తుందని నిరూపించగలగాలి. ముఖ్యంగా ప్రేమ పేరుతో కొందరు చేసే పనికిమాలిన పనుల్ని తాము ఎన్నడూ చేయమనే నమ్మకాన్ని పెద్దలకు కల్గించాలి. ప్రేమ అనేది తమకే కాక తమ బాగు గురించి ఆలోచించే పెద్దవారి గౌరవానికి, హోదాకు ఏమాత్రం భంగం కల్గించదని నిరూపించాలి.
ఇవన్నీ చెప్పినంత సులభం కాకపోవచ్చు. అయితే కష్టం మాత్రం కాదు. ప్రేమలో పడ్డవారు, ప్రేమిస్తున్న వారు సైతం జీవితం పట్ల సరైన దృష్టితోనే ఉన్నారన్న విషయాన్ని రుఢీ చేయగల్గితే అట్టివారి ప్రేమ పెద్దల అంగీకారం పొందడం ఈ రోజుల్లో అంతగా కష్టం కాకపోవచ్చు.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:31:20 PM IST నిజమైన ప్రేమకు అనుబంధం పునాది
ప్రేమ అని చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే అంశాలు కొన్ని ఉంటాయి. వయసులో ఉన్న ఇద్దరు ఆడా మగా కలిసి చెట్టూ పుట్టా తిరుగేస్తుంటారు. అలాగే ఒకరి కళ్లలో ఒకరు కళ్లు పెట్టి చూసుకుంటూ బాహ్య ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. ఇవేవీకాకపోతే శూన్యంలో పిచ్చి చూపులు చూస్తూ తన ప్రేయసి లేదా ప్రియుడి గురించే నిత్యం తపిస్తూ ఉంటారు.
ఇలాగే కాకున్నా ప్రేమ అంటే చాలామందికి టక్కున గుర్తొచ్చే అంశాలు ఇవే. అయితే ప్రేమ ప్రారంభంలో ప్రతి ఒక్కరిలో ఇలాంటి లక్షణాలే ఉన్నా ఓ ఆడా మగ మధ్య పుట్టిన ప్రేమ భవిష్యత్‌లో కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉండాలంటే మాత్రం వారి మధ్య అనుబంధం అనేది ఏర్పడాలి. అలా అనుబంధం అనే పునాది ఏర్పడితే ప్రేమ అనే బంధం చెక్కు చెదరకుండా జీవిత పర్యంతం కొనసాగుతుంది.
ఎన్నిరోజులు గడిచినా తొలిరోజు కలిగిన ఆకర్షణ అలాగే కొనసాగగల్గితే అలాంటివారిలో ప్రేమభావం ప్రవేశించిందన్నమాటే. అలాకాక కొన్నాళ్ల తర్వాత వారిని చూచినపుడు కల్గినంత వ్యామోహం వాళ్లు ఎదురుగా లేనపుడు కలగకపోతే అది ఖచ్చితంగా ప్రేమకాదు.
ప్రేమలో పడ్డ కొత్తల్లో ఎదుటివారిపై కలిగేది వ్యామోహమో, ప్రేమో ఖచ్చితంగా గుర్తించడానికి వీలుకాదు. వారినే పదే పదే చూడాలనుకోవడం, వారు కనబడగానే దేహంలో ఏదో కొత్త ఉత్తేజం అడుగు పెట్టడం, మనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చిగురించడం లాంటి లక్షణాలన్నీ ప్రేమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అందరిలోనూ కన్పించేవే.
అయితే ఎదుటివారిపై ఉన్నది ప్రేమ కాకుండా వ్యామోహమైనా కూడా దాదాపు ఇలాంటి లక్షణాలే ఉంటాయి. అయితే కొద్దిరోజులు నిదానించగల్గితే ఎదుటివారిపై కలిగిన ఆకర్షణలో కొంత ఖచ్చితత్వం వస్తుంది. ఎలాగంటే ఎన్నిరోజులు గడిచినా తొలిరోజు కలిగిన ఆకర్షణ అలాగే కొనసాగగల్గితే అలాంటివారిలో ప్రేమభావం ప్రవేశించిందన్నమాటే. అలాకాక కొన్నాళ్ల తర్వాత వారిని చూచినపుడు కల్గినంత వ్యామోహం వాళ్లు ఎదురుగా లేనపుడు కలగకపోతే అది ఖచ్చితంగా ప్రేమకాదు.
ఎందుకంటే మనసులో ఆకర్షణతో పాటు ప్రేమ కూడా ఉంటే మీ మనసుదోచినవారు ఎదురుగా లేకున్నా ఊహల్లో మాత్రం మీరు వారితోనే విహరిస్తుంటారు. ఇలాంటి స్థితిలో ఎదుటివారికీ ఇదే పరిస్థితి ఉండి వారూ మీ ప్రేమకు పచ్చ జెండా ఊపారంటే మీ ప్రేమ కావ్యంలో రెండో దశ ప్రారంభమవుతుంది.
ఈ స్థితిలో మీలో ఉన్న భావాలు, ఆవేశాలు, ఆలోచనలు, కోర్కెలు ఇలా ప్రతి ఒక్కదాన్ని మీ ప్రేమికుడు లేదా ప్రేయసితో పంచుకుంటారు. సామాజికంగా మీ మధ్య ఉన్న తారతమ్యాలు, వ్యత్యాసాలు ఈ స్థితిలో మీకు గుర్తుకురావు. మీరిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా అందుకోసమే బ్రతుకుతున్నట్టుగా జీవిస్తుంటారు.
అయితే ఈ దశ తర్వాత కూడా మీ ప్రేమ కొనసాగాలంటే ప్రారంభంలో చెప్పినట్టు మీ మధ్య అనుబంధం అనే స్థితి ఏర్పడాలి. ఈ స్థితిలో మీరు దాదాపుగా ప్రేమికులుగా కాక జీవిత సహచరులుగా, పెళ్లికాని భార్యాభర్తలుగా భావించేసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వీరు మాత్రమే నా జీవిత భాగస్వామి అనే దశకు చేరుకుంటారు.
ఇలాంటి స్థితి ఏర్పడితే వారి మధ్య ఏర్పడిన ప్రేమ ఖచ్చితంగా జీవితాంతం ఉండే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి స్థితికి చేరుకోగల్గినపుడే ప్రేమ పరిపూర్ణత సాధిస్తుంది. అలాగే ఓ సంపూర్ణమైన జీవితానికి పునాదిగా మారుతుంది. అలాంటి ప్రేమ మాత్రమే సమాజంలోని వారికి ఆదర్శప్రాయమవుతుంది.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:26:55 PM IST ప్రణయ జీవిత మాధుర్యానికి ప్రేమ పునాది
జీవితంలో యవ్వనం అనేది ప్రతి మనిషికీ ఓ ముఖ్యమైన కాలం. జీవితంలోని మిగిలిన అన్ని వయస్సులో ఒక్కోరకమైన భావం మనిషిని ఆవహిస్తే యవ్వనంలో మాత్రం అన్ని రకాల భావాలు మనిషిలో అడుగుపెడుతాయి. కేవలం భావాలకే కాదు ప్రణయభావానికి సైతం యవ్వనం ఓ కీలకమైన దశగా చెప్పవచ్చు.
మిగిలిన వయసుల్లో ఇతరత్రా అంశాలు మనిషిని ఆక్రమిస్తే యవ్వనంలో అన్ని అంశాలతో పాటు ప్రణయభావం కూడా ఓ ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. అందుకే యవ్వనంలో అడుగుపెట్టే ప్రణయ భావాల తీవ్రత ఎంతలా ఉంటుందంటే దానికోసం మనిషి ఇతర అంశాలను పక్కనబెట్టేంతగా అది మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
ఇంతలా యవ్వనంలో మనిషిపై ప్రభావాన్ని చూపే ప్రణయ భావం తనకు సరిజోడైన వారిని చూచినపుడు అది ప్రేమగా మారి తనవారిని చేరుకోమంటూ మనిషిని తొందర చేస్తుంది. ప్రణయభావానికి సంకేతంగా ప్రేమ ఉదయిస్తుంది కాబట్టే యవ్వన ప్రాయంలో మనిషిలో చిగురించిన ప్రేమభావం మనిషిని అంతలా ప్రభావితం చేయగల్గుతుంది.
అయితే ప్రణయభావంలోంచి పుట్టుకొచ్చినా ప్రేమ మాత్రం కేవలం ప్రణయ భావానికే పరిమితమవదు. తనకు నచ్చినవారిలో ప్రణయభావంతో పాటు మరెన్నో అంశాలతో అది సానిహిత్యాన్ని సంబంధాన్ని కోరుకుంటుంది. అందుకే ప్రణయభావం నుంచి ప్రేమ పుట్టినా అది నిజమైన బంధంగా మారాలని ఎప్పుడు ప్రయత్నిస్తోందో అప్పుడే మనిషిలోని ప్రేమ సంపూర్ణత్వాన్ని సాధిస్తుంది.
" మనిషిలోని ప్రణయభావం మనసులోని ప్రేమభావంతో ముడిపడగల్గితే ఇక ఆ మనిషి ప్రణయ జీవితం ఆనందాల అంచులను తాకగల్గుతుంది. "
ఎందుకంటే యవ్వనంలో ప్రణయభావం అనేది దేహ అవసరాలకు సంబంధించిందే అయినా అది ప్రేమగా మారినపుడు దేహంతో పాటు మనసునీ సొంతం చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తుంది. అలా మనిషిలోని ప్రణయభావం మనసులోని ప్రేమభావంతో ముడిపడగల్గితే ఇక ఆ మనిషి ప్రణయ జీవితం ఆనందాల అంచులను తాకగల్గుతుంది
అలా ప్రేమతో కూడిన ప్రణయ సంబంధాన్ని నిలుపుకోగల్గితే దేహంలో ప్రణయభావం అస్తమించినా మనసులో మిగిలిన ప్రేమభావం మాత్రం ఆ దేహాలను ఎన్నటికీ కలిపి ఉంచగల్గుతుంది. అయితే ప్రేమ లేని కామం ఉంటుంది గానీ కామం లేని ప్రేమ మాత్రం ఉండదు... అనే వాక్యాలు మనం అప్పుడప్పుడూ మన చెవిలో పడుతుంటాయి.
మనిషి యవ్వన ప్రాయంలో కలిగే కామవాంఛల్లో ప్రేమ కూడా ఓ భాగమని అంతే తప్ప ప్రేమ కావ్యాల్లో చెప్పినట్టు ప్రేమ మరీ అంతగా మనిషిని ప్రభావితం చేయలేందు అనేది కొందరి వాదన. అలాంటి వారు చెప్పినట్టు కామం లేని ప్రేమ ఉండదు అన్న వాక్యాలు నిజమే అయినా ఆ కామంలోనూ మనిషికి అనిర్వచనీయమైన సంతృప్తిని సొంతం చేసేదే ప్రేమంటే.
ఎందుకంటే ప్రేమను కూడా కలిగిన ఇరు దేహాలు కామంతో ఏకమైనపుడు అవి జీవితాతం అదే బంధానికి కట్టుబడుతాయి. కానీ అదే దేహాలు ప్రేమ లేకుండా కేవలం కామంతోనే ఏకమైతే ఆ ముచ్చట కాస్తా తీరాక వ్యతిరేక దృవాల్లా చెరో దిక్కుకు సాగిపోతాయి. అందుకే ప్రణయ జీవితంలో సంపూర్ణమైన మాధుర్యాన్ని సొంతం చేసుకోవాలంటే అది ప్రేమ అనే పునాదిపై మాత్రమే సాధ్యమవుతుంది.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:23:49 PM IST పెద్దవారిని ఎదిరిస్తేనే... ప్రేమ ఉన్నట్టా... ?
లోకంలోని దేనినైనా వదలుకుంటానుగానీ, ఎవరినైనా ఎదిరిస్తానుగానీ నా ప్రేమను మాత్రం నేను వదులుకోను అంటూ ప్రేమికులు చెబుతుంటారు. నిజమే ప్రేమ చాలా గొప్పది. దానిని సాధించడం కోసం, జీవితాంతం నిలబెట్టుకోవడం కోసం కొన్నింటిని వదులుకున్నా, మరి కొందరిని ఎదిరించినా తప్పుకాకపోవచ్చు.
ఎందుకంటే ప్రేమ పేరుతో లోకంలో ఎన్నో వికృతాలకు పాల్పడుతున్నవారి మధ్య ప్రేమను కాపాడుకునేందుకు చొరవ, ధైర్యం చేసేవారిని సైతం కొన్నిసార్లు సమాజం, ఇంటిలోని వ్యక్తులు నిర్భందించేందుకు ప్రయత్నిస్తుంటారు. మేం చెబుతున్నాం కాబట్టి మీరు మీ ప్రేమను వదులుకోవాల్సిందే అంటూ తమ పంతం నెగ్గించుకోవాలనుకునే అలాంటి వారికోసం ప్రేమను బలిచేయడం ఏమాత్రం వివేకం అనిపించుకోదు.
"ప్రయత్నం విజయానికి పునాది
తమ మనసులోని ప్రేమ గురించి దానివల్ల తామేమీ నష్టపోవడం లేదని తల్లితండ్రులుగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ... పెద్దవాళ్ల మనసుని హత్తుకునేలా చెప్పగల్గితే నిజంగానే పెద్దవారి మనసు కరిగే అవకాశం ఉండవచ్చు. "
ప్రేమికుల మధ్య ఉన్నది నిజమైన ప్రేమే అయితే తమ ప్రేమను ఎదుటివారు ఏకారణం లేకుండానే నాశనం చేయాలని చూస్తుంటే ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అలాంటివారిని ఎదిరించైనా సరే ప్రేమికులు తమ ప్రేమను దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటివరకు చెప్పిందంతా ప్రేమలో ఎదురయ్యే సమస్యకు ఓ పార్శ్వం మాత్రమే.
ఎందుకంటే ఇక్కడిదాకా చెప్పిందంతా ప్రేమికుల కోణం నుంచి మాత్రమే. ఎంత ప్రేమలో పడ్డా... ఆ ప్రేమ నిజంగానే స్వచ్ఛమైనదే అయినా దానికోసం తల్లితండ్రులను ఎదిరించాల్సిన అవసరం లేదు. ప్రేమకోసం చూపించిన చొరవ, ధైర్యం, తెలివితేటల్లో కాస్త మొత్తాన్ని ఖర్చుచేసి తమ తల్లితండ్రులను ఒప్పించేందుకు ప్రేమికులు ప్రయత్నిస్తే ఫలితం మరోలా ఉండవచ్చు.
తమ మనసులోని ప్రేమ గురించి దానివల్ల తామేమీ నష్టపోవడం లేదని తల్లితండ్రులుగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ... పెద్దవాళ్ల మనసుని హత్తుకునేలా చెప్పగల్గితే నిజంగానే పెద్దవారి మనసు కరిగే అవకాశం ఉండవచ్చు. అదేసమయంలో తమ పిల్లల ప్రేమ విషయాన్ని అర్థం చేసుకుని అన్నాళ్లు ఎదిరించిన తల్లితండ్రులే దగ్గరుండి మరీ ఆ ప్రేమికులు జీవిత భాగస్వాములు అయ్యేందుకు అవకాశం కూడా కల్గవచ్చు.
ఇప్పటివరకు చెప్పినట్టు ప్రయత్నించినంత మాత్రాన తల్లితండ్రులు ఒప్పేసుకుంటారా... ? తమ పెళ్లికి అంగీకరిస్తారా... ? అంటూ ప్రేమికులకు అనుమానం రావడం సహజమే. అయితే ఇదే విషయాన్ని తాము ప్రేమలో పడ్డ కొత్తల్లో జరిగిన సంఘటనలతో పోల్చి చూడండి. అప్పుడు తెలుస్తుంది ప్రయత్నం వల్ల ఉన్న లాభమేమిటో.
ప్రేమ సైతం ప్రేమికులిద్దర్లో ఒకేసారి ఒకే క్షణంలో కలగదన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకర్ని చూచినపుడు తమలో కలిగిన ప్రేమ భావాన్ని ఎదుటివారిలోనూ కల్గించి చివరకూ వారు తమను ప్రేమించేలా చేసుకోవడమే చాలా ప్రేమల్లో జరుగుతున్నదే. అలా ప్రేమ కోసం ఎదుటివారిని ఒప్పించేందుకు ప్రేమికులు ఎన్ని ప్రయత్నాలు చెస్తారో చెప్పాల్సిన అవసరం లేదు
ఆ విధంగా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తేనే కదా... చివరకు ప్రేమ జయించి ఎదుటివారు తమ ప్రేయసి లేదా ప్రియుడు అయ్యింది. ఆ విధంగా ప్రేమకోసం ఎన్నో ప్రయత్నాలు చేసే ప్రేమికులు తల్లితండ్రులను లేదా పెద్దలను ఒప్పించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేయడంలో తప్పేముంది. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం వృధా పోదు.
ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లితండ్రులు ఒప్పుకోకపోతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారిని ఎదిరించి ప్రేమికులు ఒకటికావడంలో తప్పులేదు. అయితే అలా పెద్దవారిని ఎదిరించడానికి ముందు వారిని ఒప్పించేందుకు ప్రేమికులు చేసిన ప్రయత్నంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా అది భవిష్యత్‌లో అయినా పెద్దవారి మనసు మార్చవచ్చు.
అలా మనసు మారిన వారు మళ్లీ తమ పిల్లలకు దగ్గరకావచ్చు. అలా జరిగితే "ప్రేమ కోసం పెద్దవారిని ఒప్పించేందుకు అంతకుముందు ప్రేమికులు నిజాయితీగా చేసిన ప్రయత్నమే దానికి కారణం అవుతుంది. అందుకే ఎదిరిస్తేనే ప్రేమ అవుతుంది... అనుకోవడం పొరబాటు. "
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:17:18 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|