
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| మనసుపడే మధురమైన బాధ... ప్రేమంటే
ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం... చేసినాను ప్రేమ క్షీరసాగర మధనం... మింగినాను హలాహలం... అంటూ ఓ సినీ రచయిత కలం నుండి జాలువారిన పాట పల్లవిని విన్నప్పుడు హృదయమున్న ఎవరికైనా అది బరువెక్కక మానదు. జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమించడం... అలా మనం ప్రేమించినవారు మనల్ని ప్రేమించకపోవడం అన్నది చాలామంది అనుభవంలో ఉన్నదే. అందుకే పైన పేర్కొన్న పాట పల్లవి విన్నప్పుడు గతం ఒక్కసారిగా గుర్తొచ్చి మనసుని కాసేపు మెలి పెట్టక మానదు.
అయితే రోజువారి పనులతో జీవితంలోని ప్రతి క్షణం బిజీ బిజీగా మారిపోయిన ప్రస్తుత రోజుల్లో కొద్దిసేపటికే మన మనసు మరో కార్యంపై లగ్నం కావడం దాంతో అందాకా అన్పించిన మనసు బరువు పక్షిలా ఎగిరిపోవడం మామూలే. అయితే ప్రేమ విఫలం అన్నది గతం కాకుండా వర్తమానంగా ఉన్న వ్యక్తి పై పాటలోని పల్లవి వింటే అతని మనసు పరిపరి విధాలుగా పోతుందనడంలో సందేహం లేదు
ఎందుకంటే ప్రేమకున్న శక్తి అలాంటిది. దూరంగా ఉండి చూస్తే చిన్నపిల్లల ఆటగాను, గతంగా మారితే చాదస్తంగాను అన్పిస్తుంది. కానీ అదే ప్రేమ వర్తమానంలో తన హృదయంలోనూ మొలకెత్తి చూస్తుండగానే మహా వృక్షంగా పెరిగిపోతే... మనం ప్రేమించినవారు మన గురించి అస్సలు పట్టించుకోకపోతే... మనసులోని ప్రతి అణువునా చొచ్చుకుపోయిన ప్రేమ వృక్షం తాలూకు వేళ్లు మనిషిని ఎంతగా వేధిస్తాయో, బాధిస్తాయో అది వారికి మాత్రమే తెలుస్తుంది.
"ప్రేమ విఫలం మానిపోని గాయం...
రెండు మనసులకు సంబంధించిన ప్రేమ ఏనాటికైనా ఆ రెండు మనుసుల మధ్య బంధాన్ని ముడివేయగల్గితే ఆ ప్రేమకథ సుఖాంతమైనట్టే. కానీ అదే ప్రేమ ఓ మనసులో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి మరో మనసులో అసలు తన ఉనికినే చాటకపోతే ఇక ఆ ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరుతుందో ఊహించడం కష్టమే. "
ఆ సమయంలో తాము ప్రేమిస్తున్నవారిని ప్రసన్నం చేసుకునే దిశగా మనిషి చేయని ప్రయత్నమంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఈ భూమి మీద పుట్టిన జీవరాశిలో మనసు, మమత అనే లక్షణాలను తాను మాత్రమే పుణికి పుచ్చుకున్న మనిషికి మాత్రమే ప్రేమ, దానివల్ల కలిగే బాధ సొంతం కావడం ఓ విధంగా అదృష్టం అనుకుంటే మరో విధంగా అది దురదృష్టం అని ఇలాంటి తరుణంలోనే మనిషికి అనిపిస్తుంది.
అందుకే ప్రేమ అనే బాధను అనుభవించలేక, ప్రేమించినవారి మనసును జయించలేక మనిషి తన జీవితాన్ని సైతం త్యజించడానికి సిద్ధమయ్యే సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. రెండు మనసులకు సంబంధించిన ప్రేమ ఏనాటికైనా ఆ రెండు మనుసుల మధ్య బంధాన్ని ముడివేయగల్గితే ఆ ప్రేమకథ సుఖాంతమైనట్టే.
కానీ అదే ప్రేమ ఓ మనసులో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి మరో మనసులో అసలు తన ఉనికినే చాటకపోతే ఇక ఆ ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరుతుందో ఊహించడం చాలా కష్టం. చుట్టూ ఉన్నవారిలో కొందరు జాలిగా మరికొందరు ఏదీ పట్టనట్టు చూస్తున్నా అవేమీ పట్టించుకోకుండా తన మనసు కోరేవారి కోసం మనిషి చేసే ప్రయత్నం వృధా అయితే ప్రేమ విఫలం అంటూ చూసే వారికి అది చిన్న విషయంగానే అనిపించవచ్చు
కానీ ఆ ప్రేమ విఫలాన్ని స్వయంగా అనుభవించేవారికి మాత్రం అది తిరిగి సాధించలేని ఓ పరిపూర్ణ అపజయం. ఎందుకంటే ప్రేమ అనే పరీక్ష జీవితంలో ఒక్కసారే ఎదురవుతుంది కాబట్టి. అలాంటి పరీక్షను ఎంతో నిజాయితీగా ఎదుర్కొన్నా ఫలితం మాత్రం ప్రతికూలంగా వస్తే ఆ వ్యక్తిలో చెలరేగే నిరాశ ప్రారంభంలో రాసిన పాట పల్లవిలా చివరకు విషాధంగానే ముగుస్తుంది.
ప్రేమ అయినా మరో బంధమైనా ఇద్దరి మధ్యా అంగీకార యోగ్యమైతేనే విజయవంతం అవుతుంది అనే విషయం మనిషికి తెలిసినా... ప్రేమ అనే విషయంలో మాత్రం ఆ విషయం గుర్తుకు రాకపోవడం విశేషం. అందుకే తనను కాదన్నవారి గురించే ఆలోచిస్తూ విరహ గీతాలు ఆలపించడం అన్నది ఒక్క ప్రేమ విషయంలోనే యుగాలుగా జరుగుతూనే వస్తోంది.
"ప్రేమ అయినా మరో బంధమైనా ఇద్దరి మధ్యా అంగీకార యోగ్యమైతేనే విజయవంతం అవుతుంది అనే విషయం మనిషికి తెలిసినా... ప్రేమ అనే విషయంలో మాత్రం ఆ విషయం గుర్తుకు రాకపోవడం విశేషం. "
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:10:30 PM IST అమూల్యమైన ప్రేమ
చాలాకాలం క్రితం, ఒకానొక దీవిలో సంతోషం, విచారం, జ్ఞానం వంటి అనుభూతులతో పాటు ప్రేమ కూడా కలిసి జీవిస్తుండేవి. ఒకరోజు ఈ దీవి మునిగిపోనుందని వార్త వచ్చింది. అంతే, అందరూ ఎవరి పాటికి వారు పడవలు సిద్ధం చేసుకుని దీవినుంచి వెళ్లిపోయారు. కాని ప్రేమ ఒక్కటే దీవిలో మిగిలిపోయింది.
దీవిలో ప్రేమ ఒంటరిగా ఉండిపోయింది. చిట్టచివరి క్షణం వరకూ వేచి చూడాలని అది నిశ్చయించుకుంది.
దీవి పూర్తిగా మునిగిపోతున్న క్షణాల్లో ప్రేమ ఎవరినైనా సహాయాన్ని అడగాలని అనుకుంది.
అంతలో సంపద ఎదురుగుండా పెద్ద బోటులో ప్రేమను దాటి పోనారంభించింది.
భాగ్యం, భాగ్యం నన్ను కూడా నీతో తీసుకునిపోవా? అడిగింది ప్రేమ
'లేదు లేదు నా బోటులో చాలా బంగారం, వెండి ఉన్నాయి, నీకు ఏమాత్రం చోటు లేదు' అని చెప్పి ముందుకు పోయింది భాగ్యం,
దిగులుపడిపోయింది ప్రేమ. ఎదురుగా పెద్ద బోటులో సంతోషం పోతుండగా నిలేసింది. సంతోషమా నీతో నన్నూ తీసుకుపోవా అంటూ ఆశగా అడిగింది.
లేదు మిత్రమా నువ్వు చాలా తడిగా ఉన్నావు.. నా బోటు దెబ్బతినిపోతుంది అని కొట్టి పారేసింది.
మరి కాస్సేపటికి విచారం కూడా ప్రేమకు దగ్గరయింది. విచారాన్ని కూడా అదేవిధంగా సాయం అడిగింది ప్రేమ.
క్షమించు మిత్రమా నేను చాలా విచారంగా ఉన్నాను. అందుకనే ఒంటరిగా పోవాలనుకుంటున్నాను అని చెప్పి విచారం బోటులో వెళ్లిపోయింది.
సంతోషం కూడా ప్రేమను దాటిపోయింది. అయితే అది ఎంత సంతోషంగా ఉందంటే ప్రేమ తనను పిలిచినప్పుడు అది కనీసం వినిపించుకోలేదు.
ఉన్నట్లుండి ఒక స్వరం వినిపించింది. "ప్రేమా.. రా, నిన్ను నేను తీసుకుపోతాను" అంటూ ముసలితనం ప్రేమను పిలిచింది. పట్టలేని సంతోషంతో ప్రేమ మనం ఎక్కడికి పోతున్నామని కూడా అడగలేదు.
పోగా పోగా.. వారు భూమిని చేరారు. ముసలితనం తన దారిన తాను పోయింది.
ప్రేమ అక్కడే ఉన్న జ్ఞానాన్ని అడిగింది. 'నాకు ఎవరు సహాయం చేశారు'?
"కాలమే నీకు సహాయం చేసింది" అని చెప్పింది జ్ఞానం.
"కాలమా? నాకెందుకు సహాయం చేసింది" అనడిగింది ప్రేమ.
జ్ఞానం నవ్వి ఇలా జవాబిచ్చింది. "ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు మరి"
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:04:14 PM IST జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే
ప్రేమ అనే రెండక్షరాల మాటకు యువత మధ్య ఎంతటి మద్దతు ఉందో పెద్దవారి వద్ద అంతటి వ్యతిరేకత ఉంది. ప్రేమ పేరుతో తమ పిల్లలు ఎక్కడ జీవితంలో ఎదగకుండా పోతారో, ఎలాంటి వారిని భాగస్వామిగా ఎంచుకుని ఏ కష్టాలు కొని తెచ్చుకుంటారో అని పెద్దవారు మదనపడిపోతుంటారు.
అదే సమయంలో యువత సైతం ప్రేమ విషయానికి వచ్చేసరికి తమను కనిపెంచిన వాళ్ల మాటకన్నా తమ ప్రేమే ముఖ్యం అన్న రీతిలో ప్రవర్తిస్తుంటారు. దీంతో ప్రేమ అనే రెండక్షరాలు అటు కన్నవాళ్లకి ఇటు వారి పిల్లలకు మధ్య పెద్ద అగాధాన్నే సృష్టిస్తుంటుంది.
చదువుకునే వయసులో ప్రేమ పేరుతో ఎక్కడ తమ బిడ్డ పతనమై పోతాడో అని భయపడే పెద్దవాళ్ల మనస్తత్వం, కొత్తగా ఏర్పడిన ప్రేమ బంధం తమ కన్నవాళ్ల వల్ల ఎక్కడ దూరమై పోతుందో అన్న పిల్లల అభిప్రాయం రెండూ ఆలోచించదగ్గ విషయాలే. ఎటొచ్చీ ఎవరి కోణంలో వారు తప్ప మరొకరి కోణంలో ప్రేమ గురించి ఆలోచించకపోవడమే దురదృష్టకరం.
తమ బిడ్డల బాగు కోరుకోవడం పెద్దవాళ్లుగా వారి బాధ్యత. బాధ్యత తీసుకున్నప్పుడు హక్కులు సైతం ఉండాలనుకోవడం సహజం. అందుకే తమ బిడ్డ బాగు కోరి ప్రేమ వద్దని మొదట్లో నచ్చజెప్పే పెద్దవాళ్లు చివరకు బెదిరింపులకు దిగుతుంటారు. అలాగే పిల్లలు సైతం పెద్దవాళ్లపై ఎంతటి ప్రేమ, అభిమానాలున్నా యవ్వనప్రాయంలో తమ మనసు దోచిన వారిని తాము అభిమానించే తల్లితండ్రులే వద్దని చెబుతుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో వారిని ఎదిరించడానికి సైతం సిద్ధమౌతుంటారు.
ఈ రెండు రకాల ధోరణులు కూడా చివరకు విపరీతానికి దారితీసేవే. ఇదేరకమైన స్పర్థలు తల్లితండ్రులు, పిల్లల మధ్య తలెత్తితే చివరకు ఎవరో ఒకరే గెలుస్తారు. అయితే ఈ గెలుపు తాత్కాలికమే. ఎందుకంటే ఈ గెలుపు వెనుక అనేక ఒటములు కాచుకుని కూర్చుని ఉంటాయి.
పిల్లలను ప్రేమలోంచి బలవంతంగా బయటకు లాగి పెద్దవాళ్లు తాత్కాలికంగా గెలుపు సాధించినా అటుపై తన ప్రేమను మర్చిపోలేక, ఇటు తల్లితండ్రుల మాటను జవదాటలేక పిల్లలు పడే మానసిక వేదన చూచి తల్లడిల్లేది తల్లితండ్రులే. అలాగే తల్లితండ్రులను ఎదిరించి ఇంటినుంచి పారిపోయి ప్రేమ విషయంలో ఆ క్షణం విజయం సాధించినా అటుపై వచ్చే కష్టాలు తట్టుకోలేక జీవితమే వ్యర్థం అన్న స్థాయికి పతనమై అనుక్షణం ఓడిపోయేది ప్రేమికులే.
అందుకే ప్రేమ విషయంలో అటు పెద్దవారు, ఇటు యువత ఇద్దరూ నష్టపోకుండా ఉండాలంటే ఒకరివద్ద మరొకరు మనసు విప్పి మాట్లాడగలగాలి. పిల్లల అభిరుచుల్ని పెద్దలు గౌరవించాలి. అలాగే పెద్దల అభిప్రాయాల్ని పిల్లలు అర్థం చేసుకోగలగాలి. అలా చేయగల్గితే పిల్లల ప్రేమను పెద్దలు ఆశ్వీరదించగల్గుతారు.
పిల్లలు సైతం పెద్దల ఆశల్ని, ఆశయాల్ని నెరవేరూస్తూనే తమ ప్రేమ విషయంలో సైతం విజయం సాధించగల్గుతారు. పైన పేర్కొన్న విధంగా చేయగల్గితే ప్రేమ అన్న విషయం ఏ తల్లితండ్రుల వద్ద నుంచి పిల్లల్ని దూరం చేయదు. అలాగే ఏ పిల్లలు కూడా ప్రేమ కోసం పెద్దల్ని ఎదిరించాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే జీవితాన్ని గెలిపించేదే అసలు సిసలు ప్రేమంటే. జీవితంలో ప్రేమను మనం గెలిపించుకోవాలి. గెలిచిన ప్రేమ వల్ల జీవితం సైతం గెలుపొందాలి. అప్పుడే నిజమైన ప్రేమ సార్ధకమౌతుంది. అలాంటి ప్రేమే మరెందరికో మార్గదర్శకమవుతుంది.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 1:02:20 PM IST ప్రేమికులూ ప్రేమను కాపాడుకోండి
మనసులో ప్రేమ మైకం కల్గించినవారిని ప్రేమలో పడేయడం ఎంత కష్టమో వారు మన ప్రేమను ఒప్పుకున్న తర్వాత ఆ ప్రేమను నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే పెళ్లైన కొత్తల్లో భార్యా, భర్తలు చాలా అన్యోన్యంగా ఉండి కొన్ని రోజులు పోయాక ఎలా దెబ్బలాడుకుంటుంటారో ప్రేమికులు సైతం ప్రేమలో పడ్డ కొన్నాళ్లకు దెబ్బలాడుకోవడం మామూలే.
అయితే ఈ దెబ్బలాట చిన్న చిన్న కోపాలకు, అలకలకు మాత్రమే పరిమితమైతే ఫర్వాలేదు గానీ విడిపోతే బాగున్ను అనిపిస్తే మాత్రం ప్రమాదమే. పెళ్లి బంధం ఎంత గొప్పదో ప్రేమ బంధం సైతం అంతే గొప్పది. పదిమంది సాక్షిగా ఒకటైన పెళ్లి బంధానికి భార్యాభర్తలు విలువ ఇచ్చినట్టే రెండు మనసుల సాక్షిగా చిగురించిన ప్రేమ బంధానికి ప్రేమికులు అంతే విలువ ఇవ్వాలి.
అయితే పెళ్లి బంధం చిక్కుల్లో పడ్డప్పుడు ఇరు తరపులవారు రంగంలో దిగి భార్యాభర్తల బంధాన్ని నిలబెట్టడానికి తమ వంతు సాయం చేస్తారు. కానీ ప్రేమబంధంలో అది వీలుకాదు. అందుకే ప్రేమబంధానికి సమస్యలు ఎదురైతే ప్రేమికులే దాన్ని కాపాడుకోడానికి కృషి చేయాలి.
ప్రేమలో పడ్డ కొత్తల్లో అంతా బాగానే అనిపిస్తుంది. కానీ రోజులు గడిచేకొద్దీ ఎదుటివారిలోని బలహీనతలు, ఎదుటివారికి నచ్చని కొన్ని (అవ)లక్షణాలు గోచరిస్తాయి. అంతమాత్రం చేత ప్రేమ విషయంలో మన ఎంపిక తప్పేమో అన్న నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనసులో ఎంతటి ప్రేమభావం ఉన్నా మనష్యులుగా ప్రేమికులిద్దరికీ కొన్ని పరిమితులుంటాయి.
ఈ విషయాన్ని ప్రేమికులిద్దరూ గుర్తించుకోగలగాలి. ప్రేమంటే సినిమాల్లో, కథల్లో చెప్పినట్టూ ప్రేమికులిద్దరూ చెట్టూ, పుట్టా పట్టుకు తిరుగుతూ కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ గడిపేయడం అన్నిసార్లూ వీలుకాదు. ప్రేమలో పడ్డవారికి సైతం రోజువారీ చేయాల్సిన అన్ని పనులూ ఉంటాయి.
ఎలాగైతే ఇంట్లో మనకు అమ్మ, నాన్న, ఇతరబంధువులు ఇలా ఎన్ని బంధాలున్నా వారితో మన సానిహిత్యాన్ని ప్రదర్శిస్తూనే మిగిలిన పనులకు సైతం సమయాన్ని కేటాయిస్తున్నామో అలాగే ప్రేమను కూడా భావించగలగాలి. అలా చేయగలిగినవారు మాత్రమే ప్రేమను పదికాలాలపాటు కాపాడుకోగలరు.
ప్రేమికులుగా మారిన వెంటనే ఇక అదేలోకంగా, అది తప్ప మరో ప్రపంచం లేనట్టు ప్రవర్తిస్తే అలాంటి ప్రేమ ఎక్కువకాలం నిలబడే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ప్రేమికులిద్దరూ తమలోని అన్ని రకాల భావాలను పంచుకుంటూనే ఒకరినొకరు అర్ధం చేసుకోగలగాలి. అప్పుడే వారి ప్రేమబంధం జీవితబంధానికి దారితీస్తుంది.
చెప్పిన సమయానికి ప్రియుడు రాలేదని ప్రేయసి అలగడం, ప్రేమలో పడ్డ కొత్తల్లోలా ప్రేయసి తన అలంకరణ విషయంలో శ్రద్ధ చూపలేదని ప్రేమికుడు చిర్రుబుర్రులాడడం లాంటివి చేస్తే వారి ప్రేమకథ కంచికి వెళ్లే సమయం ఆసన్నమైనట్టే. ప్రేయసి లేదా ప్రేమికుడు తమకు ఇష్టం లేని పనులు చేస్తుంటేనో, లేదా ఇష్టమైన పనులు చేయడానికి సమయం లేదని అంటుంటేనో అందుకు గల కారణాలు తెలుసుకోవాలి.
ఆ కారణాల్లో నిజముంటే అందుకు ఎదుటివారు సైతం ఒప్పుకోగలగాలి. అలాకాక వారు చెబుతున్న కారణాల్లో నిజం లేనట్టైతే ఆ విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పగలగాలి. అలా చేయగల్గితే ప్రేమబంధం సైతం ఎలాంటి అరమరికలు లేకుండా కలకాలం నిలుస్తుంది.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 12:59:54 PM IST నిరీక్షణే ప్రేమకు పెట్టుబడి
ప్రతివారి మదిలోనూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ జనించి తీరుతుంది. అంతమాత్రానా అందరూ ప్రేమికులైపోరు. వారంతా ప్రేమలో విజయం సాధించనూలేరు. ఎందుకంటే ప్రేమను పొందాలంటే నిరీక్షణ అనే పెట్టుబడి పెట్టి తీరాల్సిందే. నిరీక్షించలేని వారు ప్రేమను అంత సులువుగా సొంతం చేసుకోలేరు.
నిరీక్షణ అనే సాగరాన్ని దాటిన వారు మాత్రమే ప్రేమ దీవిని చేరుకోగలరు. నిరీక్షణను జయించి ప్రేమ దీవిని ఒక్కసారి చేరుకోగల్గితే ఇక వారి జీవితమంతా నిత్య ఆనందమే. ఎదుటివారిని చూసిన వెంటనే మనసులో ప్రేమ భావం పుట్టడం కొత్తేమీ కాదు. ఎందుకంటే తమకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలి అనే విషయంలో ప్రతివారికీ కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు, ఊహలు ఉంటాయి. అందులో ఏ ఒక్క అంశం కలిగిన వారు మన కళ్లలో పడ్డా మన హృదయం స్పందిస్తుంది.
ఆడవారైనా, మగవారైనా ఈ సూత్రం వర్తిస్తుంది. అయితే హృదయంలో కలిగే ప్రతి స్పందన ప్రేమకు దారి తీయాలని లేదు. కాబట్టి హృదయాన్ని స్పందింపజేసిన వారినంతా మనం ప్రేమిస్తున్నామేమో అనుకోవడం పొరబాటే అవుతుంది. ఎందుకంటే కొందర్ని తొలిసారి చూచినపుడు ఎలాంటి స్పందన కలగకపోవచ్చు. వారితో సానిహిత్యం పెరిగే కొద్దీ మనసులో వారంటే ఉన్న భావం ప్రేమగా రూపుదిద్దుకోవచ్చు.
అలాగే కొందర్ని చూచిన తొలిచూపులోనే మన మనసు లయ తప్పవచ్చు. ఈ రెండింటిలో ఏ రకంగా హృదయం స్పందించినా మొదట ఆ స్పందన తీవ్రత ఎంత అన్న విషయాన్ని మనం అంచనా వేసి తీరాలి. అది మనసులోంచి పుట్టిన స్పందనా లేక మెదడులోంచి పుట్టినా స్పందనా అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా అంచనా వేయాలి.
అలా అంచనా వేస్తున్న సందర్భంలో జీవితాంతం ఎదుటివారి తోడు అవసరం అని మన హృదయం చెప్పిందంటే మరిక దేని గురించి ఆలోచించకుండా కార్యరంగంలోకి దూకేయవచ్చు. అయితే ఇలా దూకిన మీదట ఎదుటివారిని మనవైపుకు ఆకర్షించి వారిలో సైతం ప్రేమను పుట్టించి ఇరువురు కలిసి జీవనపయనంలోకి అడుగుపెట్టాలంటే మాత్రం ప్రారంభంలో చెప్పినట్టు తప్పకుండా నిరీక్షించాల్సి ఉంటుంది.
సినిమాల్లో చూపించినట్టు అమ్మాయి నచ్చగానే వెళ్లి ఐలవ్య్యూ చెప్పేసి అటుపై ఓ రెండు సీన్లలో అదీ ఇదీ చేసేసి మూడో సీన్ నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరగాలంటే నిజజీవితంలో అస్సలు కుదరకపోవచ్చు. ఒకవేళ కుదిరినా సినిమా ప్రేమలాగానే మన ప్రేమ కూడా మూనాళ్ల ముచ్చటగానే మిగిలిపోవచ్చు.
అందుకే కాస్త ఆలస్యమైనా సరే ఇద్దరిలోనూ ప్రేమ భావన ఒకేతీరుగా స్పందన కల్గించేవరకు నిరీక్షించ గల్గితేనే వారి ప్రేమ కలకాలం నిలిచి ఉంటుంది. నిరీక్షించడం అంటే ఏమిటి అన్న విషయంలోనూ సదేహం కల్గవచ్చు. నువ్వు నాకు నచ్చావు అని ఎదుటివారికి చెప్పినపుడు వారిలోనూ దాదాపు అలాంటి భావనే కలిగి త్వరలోనే వారు మనకు ఐలవ్యూ అని చెప్పేస్తే ఇక దేని గురించి నిరీక్షించాలి
ఇక్కడ నిరీక్షించడం అంటే ఎదుటివారి నుంచి ఐలవ్యూ అనే మాట కోసం ఎదురు చూడడమే కాదు. ఐలవ్యూ అన్న మాట ఎదుటివారినుంచి వినబడ్డ తర్వాత కూడా కొన్ని విషయాల్లో నిరీక్షణ అవసరం. ఇద్దరిలోనూ పుట్టిన ప్రేమావేశం నిజమైనదేనా, అది కలకాలం ఇలాగే ఉంటుందా అన్న విషయాలు స్వయంగా అనుభవానికి రావాలంటే ప్రేమికులు నిరీక్షించి తీరాల్సిందే.
అలాగే ప్రేమించుకుంటున్నాం అన్న పేరుతో చెట్టూ పుట్టా పట్టుకు తిరిగేసి ఆ తర్వాత చేసిన తప్పులు తలచుకుని చితించడం కంటే మనలోని ప్రేమ ఎంత మేరకు బలమైనది అని తెలిసేవరకు ప్రేమికులిద్దరూ సమాజ కట్టుబాట్లు మేరకు కొంతకాలం నిరీక్షించి తీరాలి. ఇన్ని రకాలుగా నిరీక్షించ గల్గితేనే నిజమైన ప్రేమ మనకు సొంతమవుతుంది. అందుకే ప్రేమకు నిరీక్షణే పెద్ద పెట్టుబడి. ఆ పెట్టుబడి పెడితే మీ ప్రేమ మీకు ఆనందాల లాభాన్ని తెచ్చిపెడుతుంది.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 12:57:10 PM IST తొలిచూపు ప్రేమ మాధుర్యం
ఎంత చెప్పినా ఎంతగా మాట్లాడినా ఎంతగా నివేదించినా మాధుర్యం తగ్గని ఓ ప్రత్యేకమైన భావమే ప్రేమంటే. ప్రేమ గురించి రాజ్యాలనే త్యాగం చేసినవారున్నారు. ప్రేమకోసం చచ్చిపోయిన వాళ్లున్నారు. తమ ప్రేమకోసం మరొకరిని చంపేసినవారున్నారు. రెండూ చేతగాక తమలోని ప్రేమనే చంపేసుకున్నవారూ ఉన్నారు.
ఇలా ప్రేమ కోసం లోకంలో ఎన్నెన్నో చేసినవారున్నారు. ఆ ప్రేమకోసం ఏం చేయడానికైనా సిద్ధమనేవారూ ఉన్నారు. ప్రేమలో ఎవరికీ తెలియని మహత్తర శక్తి ఏదో దాగుందని అందుకే ప్రేమకోసం ఏం చేయడానికైన సిద్ధపడుతుంటాడని అందరూ చెబుతుంటారు.
ఇవన్నీ విన్నప్పుడు మనసు పొరల్లో ప్రేమచేసే ఆ అలజడి అంత గొప్పదా...? దానికి అంత శక్తి ఉందా...? అని అనిపిస్తుంటుంది. అయితే ఇంతలా మనిషిని మార్చే శక్తిగల ప్రేమ ఒక్కోసారి హటాత్తుగా మనిషి గుండె తలుపు తడుతుంది. దాని పేరే తొలిచూపు ప్రేమ. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని అందరూ చెప్పేస్తుంటారు
అప్పటివరకు కలలో కూడా చూచి ఎరగని వారిని చూడగానే మనసులో పొరల్లో ఎక్కడో ఓ చిన్నపాటి అలజడి ప్రారంభమవుతుంది. ఆ అలజడి క్రమేపీ పెద్దదై వారు లేనిదే తాను ఉండనేమో అన్న స్థితిని కల్పిస్తుంది. అప్పటివరకూ ఏమీకాని, అసలేమీ తెలియనివారిపై ఈ భావం ఏంటని మనసు ప్రశ్నిస్తే దాని దగ్గర సమాధానం దొరకదు.
అయితే వారు మాత్రం తనకు కావల్సిందే అంటూ చిన్న పిల్లల్లా మారాం చేయడం మాత్రం ఆ క్షణం నుంచి ప్రారంభించేస్తుంది మనిషి మనసు. అలా మనసు చేసే మారాంని తట్టుకోలేక పడే అవస్థ సైతం ఎందుకో మనిషికి తియ్యగానే అనిపిస్తుంది. అందుకే అన్నారేమో ప్రేమంటే తియ్యని బాధ అని.
బాధలోనూ తియ్యదనాన్ని రుచి చూపిస్తుంది కాబట్టే ప్రేమ అంటే మనిషిలో ఎప్పటికీ తరగని మక్కువ ఉంటోంది కాబోలు. అయితే మిగిలి ప్రేమలతో పోలిస్తే తొలిచూపు ప్రేమకు ఈ బాధ కాస్త ఎక్కువనే చెప్పవచ్చు. కనీసం పేరూ ఊరు అసలెవరో కూడా తెలియని వారికోసం మనసు మారం చేస్తుంటే వారి కోసం అన్వేషించి వారిలోనూ ప్రేమభావాన్ని రగిలించి చివరకు సొంతం చేసుకోవడం అంటే ఎంతటి ఓర్పు, సహనం కావాల్సి ఉంటుంది.
ఇదంతా జరగాలంటే తొలిచూపు ప్రేమలో ఎవరికీ అర్థంకాని, పడ్డవారికి సైతం తెలియనంత గాఢత ఉండాలి. తొలిచూపు ప్రేమలో అంతటి గాఢత ఉంటేనే అది ముందు ముందు ఇరు హృదయాల ప్రేమగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. అలా లేకుంటే కళ్ల ముందు మెరిసిన మెరుపులా, బస్సు ప్రయాణంలో వెనక్కి వెళ్లిపోయే ప్రకృతిలా తొలిచూపు ప్రేమభావం సైతం కొంత కాలానికి మనిషి నుంచి దూరం అయిపోతుంది
కాలం వేగాన్ని సంతరించుకున్న ప్రస్తుత తరుణంలో ప్రేమ సైతం వేగంగా మారిపోయింది. అప్పటివరకూ తమకు బాగా పరిచయం ఉన్నవారిలోనో లేక తమకు అందుబాటులో ఉన్న వారిలోనో తమకు నచ్చిన అంశాలు కన్పిస్తే వారికే ఐలవ్యూ చెప్పేసి వారు కూడా ఒప్పుకుంటే అటుపై జీవితంలో ఒకటవడానికి ప్రయత్నించడం ఎక్కువై పోయింది
అయితే తొలిచూపు ప్రేమలో ఈ తరహా ప్రయత్నాలు అస్సలు పనిచేయవు. ఎందుకంటే తళుక్కున కళ్లముందు మెరిసి మనసు పొరల్లో చొచ్చుకుపోయే వారిలో తమకు నచ్చిన లక్షణాలే ఉండాల్సిన అవసరం లేదు. అలాగే వారు సైతం మనల్నే మెచ్చాలన్న రూలూ లేదు. అలాగే తొలిచూపు ప్రేమలో ఇరువైపులా ప్రేమ పుట్టడం అన్నది బహు స్వల్పం.
అందుకే తొలిచూపు ప్రేమను సొంతం చేసుకోవాలంటే అంతులేని నీరీక్షణ, చేపలేనంత ఓర్పు, వీటన్నింటికీ మించి తొలిచూపులోనే ఆకర్షించిన వారిపై వల్లమాలిన ప్రేమ ఉంటేనే తొలిచూపు ప్రేమ మాధుర్యం మనిషి చివరిచూపు వరకు కొనసాగుతుంది.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 12:53:20 PM IST ప్రేమలో నిజాయితీ అవసరం
యువతీ యువకుల మధ్య చిగురించే ప్రేమకు అన్ని రకాల ప్రేమల కన్నా బలం చాలా ఎక్కువ. ఎందుకంటే యవ్యనం తొలి సంధ్యలో ఎదుటివారిపై కలిగే ప్రేమ అనే ఆకర్షణ యువతలో పెనుమార్పులకు దారితీస్తుంది. తొలిసారి చూపుకే ఎద తలుపులు తట్టి లోపలికి ప్రవేశించే ఈ ప్రేమభావం యువతను ఆకాశంలో తేలిపోయేలా చేస్తుంది.
ఒక్కసారి ప్రేమభావం తనలోకి అడుగు పెట్టిందంటే చాలు అప్పటివరకు మామూలుగా ఉన్న వారు సైతం సప్త వర్ణాలు తమలో ఉదయించినట్టుగా అదో వింతలోకంలో విహరిస్తూ ఉంటారు. ఈ విషయంలో అబ్బాయిల పరిస్థితి మరీ వింతగా ఉంటుంది. తనచుట్టూ ఉన్నవారు తన గురించి ఏమనుకుంటున్నారో అన్న విషయాన్ని పక్కనబెట్టి తానూ తన ప్రేయసి మాత్రమే ఉండే ఆ అద్భుత లోకాన్ని గురించి ఆలోచిస్తూ అలా రోజులు, నెలలు గడిపేస్తుంటారు
అబ్బాయిలోని ఈ ప్రేమ భావానికి అటు పక్కనుంచి అమ్మాయి ఆమోదం కూడా లభించిందంటే ఇక అబ్బాయి ఆనందానికి పట్ట పగ్గాలుండవు. రోజు మొత్తం అదే ధ్యాసతో గడిపేస్తూ ఒక్కోసారి జీవితాన్ని సైతం విస్మరిస్తుంటారు
టీనేజ్ వయసులో అడుగుపెట్టే ప్రేమలు జీవితాంతం కలిసి కొనసాగే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే టీనేజ్ వయసులోనే ప్రేమలో పడ్డా కూడా కొందరు తమ జీవిత గమనానికి ప్రేమ అడ్డంకిగా మారకుండా చూసుకోగల్గుతారు. ఇలాంటివారు మనసులో ప్రేమభావం ఉన్నా దానికోసం విలువైన కాలాన్ని వృధా చేయకుండా ముందు జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తారు.
అటుపై తమ ప్రేమను సైతం జీవితాంతం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే జీవితంలోని ఏ వయసులో ప్రేమ చిగురించినా దాన్ని జీవితాంతం కాపాడుకోవాలంటే మాత్రం ప్రేమలో ఖచ్చితంగా నిజాయితీ ఉండాలి. ప్రేమలో నిజాయితీగా వ్యవహరించగల్గినవారు మాత్రమే జీవితాంతం తమ ప్రేమ బంధాన్ని కాపాడుకోగలరు
ఇలాంటివారు మనసుకు నచ్చినవారి కోసం అవసరమైంది చేస్తూనే జీవితంలో వృద్ధిలోకి రావడానికి అవసరమైన అన్ని పనులను వాయిదా వేయకుండా చేస్తుంటారు. దీనివల్ల ప్రేమ అనేది వారికి జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగపడే ఓ ఆయుధంగానే పనికి వస్తుంది. ఎందుకంటే చాలామంది ప్రేమ పేరుతో కొన్నాళ్లపాటు ఏలాంటి లక్ష్యం లేకుండా తిరిగేసి చివరకు పరిస్థితి చేయి దాటాక కళ్లు తెరచి ప్రేమలో పడడం వల్లే తన జీవితం ఇలా అయిపోయిందని వాపోతుంటారు.
ఇలాంటివారిని చూచినవారు సైతం ప్రేమలో పడితే ఇక జీవితం నాశనమే అన్న నిర్ణయానికి వచ్చేస్తుంటారు. తమ అవగాహనా రాహిత్యానికి ప్రేమ అనే కారణాన్ని సాకుగా చూపి జీవితంలో నష్టపోయే వీళ్లు ఒకవేళ ప్రేమ అనే కారణం లేకున్నా జీవితంలో ఖచ్చితంగా పైకి రాలేరు.
అయితే ప్రేమ అనేది జీవితంలో భాగమని, దానికోసం ఎలాంటి పనులూ వాయిదా వేయరాదని, ప్రేమను దక్కించుకోవాలంటే జీవితంలో సైతం మంచి స్థితికి ఎదగాలని ఎవరైతే నిజాయితీగా ఆలోచిస్తారో వారుమాత్రం ప్రేమ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోరు. అంతేకాకుండా ప్రేమ అనే బంధం వారి మనసులో అడుగుపెట్టడం వల్ల దాన్ని కాపాడుకోవడం కోసం జీవితంలో త్వరగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ప్రేమలో సైతం నిజాయితీ ఉంటే జీవితంలో ఎప్పడు కూడా ప్రేమ ప్రతిబంధకంగా మారదు.
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 12:49:44 PM IST నీవు లేని నేను లేను
అనుకున్నాను ఆ రోజు
ఆ రోజు ఎగిరిపోయింది ఎక్కడికో
రెక్కలార్చిన పక్షి అయి
నీకు దూరం అయిన
నేను ఉన్నాను ఈ రోజు
రెక్కలు విరిగిన పక్షినయి
రక్తసిక్తమయిన దేహం తో
ఏ నాటికయిన వస్తుందా
మరి ఆ రోజు
మన ఇద్దరికలయికలో
ఆగిపోయేకాలంలో
ఆ ఒక్క క్షణం కోసం
వేచి ఉన్నా
నా రెప్పల మాటున
నీ చిత్రాన్ని చిత్రించుకొని ....
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 12:44:52 PM IST నిజమైన ప్రేమ విఫలమైతే... ?
ప్రేమ అనే రెండు అక్షరాలు మనిషి మదిలో ఎంతటి అలజడిని సృష్టిస్తాయో తెలియంది కాదు. పుస్తకాల్లో చదివిన లైలా, మజ్ను, దేవదాసు, పార్వతీ కథలు సజీవమై నేడు అందరి నోటిలో నానుతున్నాయంటే కారణం అది ఖచ్చితంగా ప్రేమకున్న బలం. లైలా, మజ్ను, పార్వతీ, దేవదాసుల కథ నిజం కాదని అది ఓ రచయిత ఊహ మాత్రమే అని తెలిసినా ప్రేమ అనగానే ఆ రెండు ప్రేమలు మాత్రమే ఉదాహరణలుగా మన నోటి నుంచి వెలువడుతాయి.
అయితే ఈ కథలకు మరో గొప్పతనం కూడా ఉంది. ఈ రెండూ కూడా విఫలమైన ప్రేమ కథలే. కారణాలేవైనా ఆ కథల్లోని ప్రేమికులు జీవితంలో ఒకటి కాలేకపోయారు. అయినా సరే ఎందుకే ప్రేమ అనగానే అందరికీ ఆ రెండు కథలే గుర్తుకు వస్తాయి. అసలు ఆ కథల్లో ప్రేమ విఫలమైంది కాబట్టే అవి అంత గొప్ప కావ్యాలుగా ప్రజల గుండెల్లో నిలిచి పోయాయి అనేది విమర్శకుల భావన.
ప్రేమ విఫలం అంటే... ?
ప్రేమ అనే బంధంతో జీవితాంతం ఒక్కటిగా ఉండిపోవాలని కలలుగన్న ప్రేమికుల విషయంలో ఒకానొక సమయంలో ఇక ఎప్పటికీ జీవితంలో కలిసి జీవించలేము అన్న పరిస్థితి తలెత్తితే... దాన్నే ప్రేమ విఫలమైంది అంటాం.
ప్రేమ అనేది విఫలమైతేనే అది చరిత్రగా నిలుస్తుందని లేకుంటే ప్రేమ అనేది పెళ్లితో ముగిసి అటుపై అందరిలా సాధారణంగా మారిపోతుంది అనేది మరో వాదన. ఈ వాదనల్లో నిజం ఎంత ఉంది అనే విషయాన్ని పక్కనబెడుతాం. అసలు ప్రేమ విఫలమైతే ఆ ప్రేమికుల మనోస్థితి ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే... ఆ విషయాన్ని సైతం ఆ కథల్లో చర్చించడం జరిగింది.
పార్వతికి పెళ్లై వెళ్లిపోతే తన ప్రేమ విఫలమైన దేవదాసు మందు గ్లాసు చేతబట్టి ఎంతలా కృశించిపోయాడో మనం సినిమాలో చూశాం. అది సినిమా అని తెలిసినా సరే మన మనసు అదో రకమైన ఉద్వేగంతో నిండిపోయింది. కానీ ఇదే పరిస్థితి నిజ జీవితంలో సంభవిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి.
ప్రేమ విఫలం అంటే ఎమిటి??
ప్రేమ అనే బంధంతో జీవితాంతం ఒక్కటిగా ఉండిపోవాలని కలలుగన్న ప్రేమికుల విషయంలో ఒకానొక సమయంలో ఇక ఎప్పటికీ జీవితంలో కలిసి జీవించలేము అన్న పరిస్థితి తలెత్తితే... దాన్నే ప్రేమ విఫలమైంది అంటాం. ప్రేమ విఫలం అంటే ఎమిటి? ప్రేమికులు జీవితాంతం విడిగా బ్రతకాల్సిన ఓ పరిస్థితి. ఆ పరిస్థితి తలెత్తినప్పుడు ఏం చేయాలి... అందుకు చాలా మార్గాలున్నాయి.
ముందుగా ప్రేమ విఫలమవడానికి గల కారణాలను ఒక్కసారి భేరీజు వేసుకోవాలి. అసలెందుకు ప్రేమ విఫలం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ ప్రేమ విఫలమవడంతో ఎవరి పాత్ర ఎంత అనే విషయాల్ని మనసులోనే చర్చించుకోండి. ఈ సమయంలో గతించిపోయిన జ్ఞాపకాలను త్రవ్వుకోవడం కాకుండా మీ ప్రేమలో మీరు చూచిన ఆనంద క్షణాలను మాత్రమే గుర్తుకుతెచ్చుకోండి.
అలా మీకు గుర్తుకు వచ్చిన మీ ప్రేమ మధుర జ్ఞాపకాల్ని మీ మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోండి. ఆ ఆనంద క్షణాలే పెట్టుబడిగా ఇకముందు జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు నిజంగా ప్రేమించారు. ఎంతలా అంటే ఒకర్ని ఒకరు విడిచిపోకూడదు అని స్థిరంగా నిశ్చయించుకునేంతగా ప్రేమించారు. కానీ విధి వంచించిందో లేదా మీ ప్రేమను కాపాడుకోవడం మీ శక్తికి మించిన పనైందో తెలియదు కానీ మీ ప్రేమ విఫలమైంది.
అందుకు మీరు బాధ్యులు కారు. కాబట్టి మీ ప్రేమ నిజంగా విఫలం కాలేదు. కాకుంటే ఈ జన్మకు మీ ప్రేయసి లేదా మీ ప్రియుడ్ని మీరు మరోసారి కలవలేరు అంతే... అంతకు మించి ఏం కాలేదు. కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని భధ్రంగా మీ గుండె పొరల్లో దాచేసి భవిష్యత్ జీవితానికి అవసరమైన కార్యకలాపాలను సాగించడం మొదలుపెట్టండి.
అంతే తప్ప జరిగినదానికి చింతిస్తూ మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకునే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే మీకు ప్రేమపై గౌరవం లేనట్టే. ఎందుకంటే ప్రేమికులు నాశనం కావాలని ప్రేమ కోరుకోదు. అందుకే ప్రేమ విఫలమైంది అని భావించి బాధపడేకన్నా మీ ప్రేమలో ఓ జన్మపాటు ఎడబాటు ఎదురైంది అని భావించండి. మరో జన్మలో మీ ప్రేమ తప్పకుండా విజయం సాధిస్తుంది.
"ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు
ప్రేమ విఫలమైంది అని భావించి బాధపడేకన్నా మీ ప్రేమలో ఓ జన్మపాటు ఎడబాటు ఎదురైంది అని భావించండి. మరో జన్మలో మీ ప్రేమ తప్పకుండా విజయం సాధిస్తుంది. "
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 12:38:58 PM IST
FireFox-telugu font help
If you are using Firefox Browser or above, then follow these steps:
1)Download TeluguFont from our site
http://www.telugupeople.com/telugupeople/fonthelp.asp
Llogin as administrator
2)Copy font file in fonts folder in your system.
Eg: C:/windows/fonts
==========
Also addon for firefox
https://addons.mozilla.org/en-US/firefox/addon/873
Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 11:12:37 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|