
|
|

General Forum: Literature | తెలుగింటి సత్యభామ | |
| satyabhAmaku AlayamA?!....kotta sangati cheppAru SrInivAs gArU!
Posted by: Mr. SATYANARAYANA PISKA At: 29, Aug 2008 2:17:06 PM IST kaadaMDi.maharaashtraalO uMdi.
Posted by: Mrs. shaloo At: 25, Aug 2008 9:55:15 PM IST dhanyavAdAlanDI ShAlUgArU!
vidarbha madhyapradES lO vundanukunTAnanDI!
Posted by: Mr. SATYANARAYANA PISKA At: 25, Aug 2008 5:36:30 PM IST
vidharbha raaja kumaartE rukmiNi.vidharbha mahaaraashtra lo uMdi.
satraajittuDu yaadavakulamu raaju.dwaaraka jurisdiction lO oka raajyaaniki raaju.
chivaridaaka chadivaanaMDi.chaalaabaagaa vivariMchaaru.
telugiMTi aaDapaDuchulu--satyabhaamalannamaaTa!
Posted by: Mrs. shaloo At: 24, Aug 2008 2:42:35 PM IST andarikI kshamApaNalatO,
"teluginTi satyabhAma" nu mI munduku tEvAlanE tondaralO, ArTikil gA pOsT chEyavalasinadAnini TApik gA pOsT chEyaDam jarigindi. dayachEsi, Srama anukOkunDA yI vyAsamunu chadivi, tappaka mI kAmenTs vrAyAlani manavi chEstunnAnu.
Posted by: Mr. SATYANARAYANA PISKA At: 24, Aug 2008 10:33:02 AM IST " శ్రీకృష్ణాష్టమి " పర్వదిన సందర్భంగా ఆ నల్లనయ్య చల్లని దీవనలు అందరికీ లభించాలని ఆకాంక్షిస్తున్నాను.
మరి, ఈ గోకులాష్టమినాడు ఆ గోవిందుని ప్రియాతిప్రియమైన సతీమణి సత్యభామ గురించి కాసేపు ముచ్చటించుకుందామా?
సుమారు పాతికేళ్ళ క్రితం శ్రీ ఎస్వీ భుజంగరాయశర్మగారు ఆకాశవాణిలో కొన్ని సాహితీప్రసంగాలు చేశారు. అవి శ్రోతలను బాగా అలరించాయట! ఆ ప్రసంగవ్యాసాలను ఆలకించే అదృష్టం నాకు కలగలేదుకాని, ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసంగాలు "దీపమాలిక" అనే పేరుతో పుస్తకరూపములో వచ్చినప్పుడు పఠించే భాగ్యం కలిగింది. వాటిల్లో ఆయన మన ప్రభంధనాయికల గురించి చాలా చక్కగా వ్రాశారు. ముఖ్యంగా "తెలుగింటి సత్యభామ" అనే వ్యాసం నన్ను బాగా ఆకట్టుకున్నది. దానిని మీ అందరి దృష్టికి తేవాలని ఈ ప్రయత్నం.
ఇక చదవండి...
*** *** *** ***
నిద్రలో వుండగా నన్ను తట్టిలేపి "మన ప్రబంధనాయికల్లో తెలుగువారింటి ఆడపడుచులున్నారా?" అని యెవరైనా అడిగితే, స్పృహ వచ్చీరాకముందే "ఉన్నది. ఒక్కతే ఒక్కతె. సత్యభామ. నందితిమ్మనగారి పారిజాతాపహరణం లో" అని చాలా ఖచ్చితంగా చెప్పేసి మరుక్షణం లో నిద్రలోకి జారిపోగలను.
అంత ఖచ్చితంగా యెలా చెప్పగలనంటారా? వినండి.
తెలుగు సాహిత్యములో సత్యభామను చదివి చదివీ, కూచిపూడివారి రంగవేదికలపై సత్యభామను చూచి చూచీ, తెలుగువారి సృజనాభిరతినీ, రసికాభిరుచినీ సత్యభామ యెంతగా కదిలించిందో తలచుకుని తలచుకునీ పరవశించిపోయేవారిలో నేనొకణ్ణి.
మిగిలిన భారతీయులందరూ కృష్ణునికి రాధను ప్రియురాలిని చేసి, వారి ప్రణయానికి జీవేశ్వరసంబంధాన్ని భావిస్తొంటే తెలుగువారు మాత్రం తమ అంతరంగాల్లో కృష్ణుని సరసన సత్యభామనే నిలుపుకున్నారు. సత్యాకృష్ణుల ప్రణయాన్ని పచ్చని తెలుగుకాపురాల మూతిముడుపులూ, ఊరడింపులూ, ఆకుమడుపులూగానే వూహించుకుని ముచ్చటపడ్డారు.
తెలుగువారికి రుక్మిణంటే గౌరవం. సత్యంటే యిష్టం.
రుక్మిణి మప్పితంగా వుంటుంది. సత్య విసురుగా వుంటుంది.
రుక్మిణి కృష్ణుణ్ణి పూజిస్తుంది. సత్య కృష్ణుణ్ణి కలవరిస్తుంది.
రుక్మిణి అప్పుడే స్నానం చేసి మడి కట్టుకున్నట్లుంటుంది. సత్య కృష్ణుని పడకగదిలోంచి అప్పుడే బైటికి వచ్చినట్టుంటుంది.
రుక్మిణికి కోపం వచ్చినా కనబడదు. ఏడుపూ అంతే! సత్యకు కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా కట్టలు తెంచుకుంటుంది.
రుక్మిణీ సత్యలకూ, కృష్ణునకూ మధ్య వున్న అనుబంధాల వైచిత్రికి భావబంధురమైన రూపకల్పన చేస్తూ, నందితిమ్మనగారు
"భోజకన్యా సరిద్రాజహంసము,
సత్యభామా శుకీ కేళిపంజరంబు" అని కృష్ణుణ్ణి అభివర్ణించారు.
రుక్మిణి అనే నదిలో విహరించే రాజహంసట కృష్ణుడు! నదికి శోభ హంస. కాని, హంస లేకపోయినా నది ప్రవహిస్తూనే వుంటుంది. ఆగిపోదు. కాని, హంసే నీళ్ళను వదిలి వెళ్ళదు. అందులో తిరగటమే దానికి సుఖం , సహజం. రుక్మిణి యింట కృష్ణుడుంటే రుక్మిణికి శోభ.
అతడు తన యింటికి రాకున్నా తాను పెద్దగా పట్టించుకోదు. తన లోకం తనకుంది. అయినా, కృష్ణుడే తరచు తనింటికి వస్తాడు. అతడు కోరి తెచ్చుకున్న స్త్రీ తాను. అతడికి తనతోనే, తనలోనే వుండటం యిష్టం.
సత్యభామ అనే ఆడుచిలుక ఆడుకునే పంజరమట కృష్ణుడు! చిలుకకు విశాలమైన ఆకాశం వుంది. ఆకుపచ్చని వనాలున్నాయి. హాయిగా వీచే అడవిగాలు లున్నాయి. అయినా దానికి ఆ స్వేచ్ఛ అక్కర్లేదు. దానికి పంజరమే యిష్టం. తన్ను చుట్టివున్న హద్దే తనకు ప్రియం. ఆ ఇరుకే తనకు ప్రాణం. కాని, తరచుగా ఆ పంజరం అదృశ్యమైపోతుంది. సత్యభామకు కృష్ణుడు తప్ప వేరే లోకం లేదు. ఉన్నా వద్దు. ఎప్పుడూ కృష్ణుడు తనను చుట్టుకుని వుండాలి. అతడి కౌగిట్లో తాను యెల్లవేళలా ఒదిగివుండాలి. ఆ కౌగిలిబిగి ఓ క్షణమైనా సడలటం తాను భరించలేదు. సడలని చేతుల్లో అస్తమానం తాను ఉక్కిరిబిక్కిరి కావాలి. కృష్ణుని ఊర్పుల వెచ్చటి సుగంధం తన ముఖానికెప్పుడూ తగులుతూ వుండాలి. అతడి చెరలో తాను ఆనందపు అవధులు ముట్టాలి. ఇదీ సత్య దాహం. అది ఎప్పటికీ ఆరదు, తీరదు. అందుకే ఆమె కంత అసూయ, అసహనం , రోషం.
రుక్మిణీ సత్యభామల పరస్పర మాత్సర్యములో దాపరికమేమీ లేదు. అది అంద రెరిగినదే!
కులమును రూపమున్ మగని కూరిమియుం గలదాన నంచు నీ
వల నల రుక్మిణీరమణి వానిఁ బెనంగగ, సత్యభామయున్
గులమును రూపమున్ మగని కూరిమియుం గలదాన నంచు నా
వలఁ బచరింపగా రవరవల్ వొడమెన్ మది వారి కెంతయున్
అన్నారు నందితిమ్మనగారు.
గొప్పింటిదాన్ననీ, అందమైనదాన్ననీ, మగనికి అందరికన్నా యిష్టమైనదాన్ననీ అతిశయం రుక్మిణికీ వుండేది, సత్యకూ వుండేది. అందుకే వారిద్దరి మధ్య ఆ రవరవలూ, సెగపొగలూ!
ఇలాటి నేపథ్యములో, ఓనాడు సత్య కృష్ణుని కోసం ఎదురుచూస్తోంది. కబురు తెస్తానని వెళ్ళిన చెలి యింకా రాలేదు. బారెడు ప్రొద్దెక్కింది. మనస్సు గుబులుగుబులుగా వుంది.
ఉన్నట్టుండి సత్యకు కుడికన్ను అదిరింది. పట్టించుకోలేదు. కుడిభుజం అదిరింది. అనుమానపడింది. కుడిచనుమొన కూడా అదరటముతో భయపడి లేచింది. ఇంతలో చెలికత్తె పరిగెత్తుకు రానేవచ్చింది.
రొప్పుతూనే కృష్ణుడు రుక్మిణింట వుండటం చెప్పింది. నారదుడు రావటం చెప్పింది. పారిజాతాన్ని కృష్ణుని కివ్వటం చెప్పింది. దీనిని నీకు ప్రియమైన దేవేరికి కానుకగా యివ్వమని కోరటం చెప్పింది. కృష్ణుడు ఆ పూవును రుక్మిణి వాల్జడలో ముడిచి, మురిసిపోవటం చెప్పింది. అందరూ వినేట్లు నారదుడు సత్యభామను చులకనచేసి మాట్టాడటం చెప్పింది. ఆ మాటలు విని కృష్ణుడు హర్షించటం చెప్పింది. సిగ్గులేక సవతులందరూ వచ్చి రుక్మిణిని సేవించటం చెప్పింది. అన్నీ చెప్పి, యింకా చెప్పాల్సినవి యెన్నో వున్నట్లు అలసిపోయి చెప్పటం ఆపేసింది.
సత్యభామ రోషం తో నిలువెల్లా వణికిపోయింది. దెబ్బతిన్న ఆడుత్రాచులా బుసలు కొట్టింది. భయంకరమైన అగ్నిజ్వాలలా భగ్గుమంది. ఎంత ఆపుకున్నా ఆగకుండా ఏడుపొచ్చింది. ఏడుస్తూనే జరిగిందంతా చెలికత్తె చేత మళ్ళీ చెప్పించుకుంది.
కృష్ణుడు పారిజాతాన్ని రుక్మిణి కిచ్చినందుకు కాదు, నలుగురిలో ఆ నారదుడు తన పేరెత్తి అంతలేసి మాటలంటుంటే వింటూ వూరుకున్న కృష్ణుణ్ణి యిక మన్నించేది లేదంది. రుక్మిణిమీద వున్న యింత మమకారమూ కడుపులో దాచుకుని, తన దగ్గర యింతకాలంగా యిన్ని నాటకాలాడిన కృష్ణుని ధూర్తత్వాన్ని తలచుకుని అబ్బురపడింది. సహజంగా తన జడలోకి నడచిరావలసిన దివ్యకుసుమాన్ని తన ప్రియుడే దారి మళ్ళించాడని వినికూడా నిలిచివున్న ప్రాణాన్ని చీదరించుకుంది. పోనీలే, రుక్మిణింట వుండటం మూలాన ఆమె కిచ్చివుంటాడులే అని సరిపెట్టుకున్నవారు అలాగే పడివుండక, ఆమెగారిని సేవించటానికి వెళ్ళిన సవతుల సిగ్గుమాలినతనాన్ని దుయ్యబట్టింది.
ఏ అరమరికలూ లేకుండా కృష్ణుడు తనతో కలిసి పంచుకున్న మరపురాని అనుభవాలు ఒక్కొక్కటే గుర్తుకువచ్చి, అవన్నీ నిజాలని నమ్మరాకా, నిజాలు కావని నమ్మలేకా విలవిల్లాడిపోయింది.
ఒక క్షణం ఏడుపు దిగమ్రింగుకుని యేదో ఆలోచిస్తున్నట్లు మౌనంగా వుండిపోయింది. మరుక్షణం చరచరా కోపగృహానికి వెళ్ళింది. నగలన్నీ తీసి విసిరికొట్టింది. కట్టుకున్న పట్టుచీర విప్పిపారేసింది. వెదికి వెదికి ఒక మాసినచీర తెచ్చి చుట్టుకుంది. ద్వారాలూ, గవాక్షాలూ మూసేసింది. వెళ్ళి మంచం మీద వాలింది. చెమట పట్టి, వణుకు పుట్టి మంచం మీద పొర్లిపొర్లి, పొర్లుకువచ్చే శోకముతో తలగడ పూర్తిగా తడిపేసింది.
ఇలాటి సమయాల్లో చెలికత్తెలు సత్యను పలకరించరు. చేసే పనికి అడ్డం రారు. కంటబడకుండా ఒదిగిఒదిగి ప్రాణాలుగ్గబట్టి, దగ్గర్లో కనిపెట్టుకుని వుంటారు.
ఒక చెలికత్తె ధైర్యం చేసి మెల్లగా లోపలికి పోయి, గాలి తగిలీ తగలనట్లుగా వెనకనించి సత్యకు విసరడం మొదలెట్టింది. మొదలెట్టిన కొన్ని క్షణాలకే చేతిలోని వీవన యెవరో మృదువుగా లాగినట్లై వెనక్కి తిరిగిచూసింది. కృష్ణుడు!
వీవన చేతులుమారడం సత్య పసిగట్టింది. చెలికత్తెలు వెళ్ళిపోతున్న నిశ్శబ్దపు సందడి కూడా ఆమె గమనించింది. అయినా వులకలేదు, పలకలేదు.
కొన్ని నిమిషాల తర్వాత మెల్లగా మొదలై ఓ ఘడియదాకా సాగిన శ్రీవారి ఊరడింపులూ, బుజ్జగింపులూ, లాలింపులూ సత్య విన్నది. అయినా కదల్లేదు, మెదల్లేదు. మరో ఘడియసేపు కృష్ణుడు బతిమాలాడు. ప్రార్థించాడు. ప్రాధేయపడ్డాడు.
ఇక, ఏమిచేయటానికి తోచక సత్య కాళ్ళవైపు వెళ్ళి, తల ఆనించి మొక్కాడు. ఆమె తన ఎడమకాలితో అతని తలను ప్రక్కకు నెట్టేసింది. ఆ స్పర్శకు కృష్ణుడు నిలువెల్లా పులకించిపోయాడు.
నను, భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా
చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!
"నేను నీ దాసుణ్ణి. నీవు ప్రణయకోపముతో తన్నటం కన్నా, నేను కోరుకోదగిన భాగ్యం యేముంటుంది చెప్పు? ఇదిగో గగుర్పొడిచి నా శరీరం యెలా ముళ్ళపొదలా వుందో చూడు. ఈ ముళ్ళు గుచ్చుకుంటే అమ్మయ్యో! ఇంకేమైనా వుందా! మెత్తని నీ పాదాలు గాయపడవూ! అందుకే యింతసేపటినించీ బతిమాలుకుంటున్నాను. అలకమాను" అన్నాడు.
సత్యభామ భోరున యేడ్చింది. ఏడుస్తూనే నిటారుగా లేచికూర్చుంది. వెంట్రుకలు వెనక్కి తోసుకు ముడివేసుకుంది. పైటచెరగు రెండవభుజం మీదుగా ముందుకు తీసుకు సర్దుకుంది. ఒళ్ళంతా మళ్ళీ చెమటలు క్రమ్మాయి. పెదవులు వణుకుతున్నాయి. ఏదో అనబోయి, గొంతు పూడుకుపోవడంవల్ల మాటరాక వూరుకుంది. కాసేపటికి కొంచెం సంబాళించుకుని వెక్కివెక్కి, తెరలుతెరలుగా మాట్టాడడం మొదలుపెట్టింది.
కృష్ణుడు వచ్చి మంచం పట్టెమీద ఆమెవైపు తిరిగి కూర్చున్నాదు.
సత్య యీ నయగారాలూ, ఇచ్చకాలూ యిక భరించలేనంది. కల్లలూ, మాయలూ అతడికి వెన్నతో పెట్టిన విద్యలంది. నారదుడు చేసిన రుక్మిణీస్తవాన్ని విన్న చెవులకు తన మాటలు యెలా రుచిస్తాయంది.
అతడిప్పుడు రావడం పారిజాతపరిమళం తనకు అంటించి యేడిపించడానికేనంది. అత్తగారికి తన ముఖం యిక చూపెట్టలేనంది. శమంతకమణితో, రైవతక రమణీయ సానువులతో, వారిధిదృశ్యాలతో, వసంతారామాలతో తన కిక రుణం తీరిపోయిందంది. అంటూనే 'బాలపల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీస్వనముతో' యెలుగెత్తి యేడ్చింది.
కృష్ణుడు సత్యను తన చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. ఆమె పసిపిల్లలా అతనిమీద వాలి అంటుకుపోయింది. అతడు ఆమె ముఖాన్ని పైకెత్తి ముద్దాడబోయాడు. ఆమె తలెత్తలేదు. అతడు ఆమె తల నిమురుతూ వెంట్రుకలను పెదవులతో తాకాడు. ఆ ఉదయాన్నే తలంటిపోసుకుంది కాబోలు, జుట్టు వదులుగా, నిండుగా, ఒత్తుగా, ఇంద్రనీలమణులరాశిలా మిలమిలలాడుతోంది.
"ఓ లలితేంద్రనీల శకలోపమకైశిక!" అని కుడిచేతి వ్రేళ్ళతో జుట్టు సవరిస్తూ, చెవిలో గుసగుసలాడినట్లు కృష్ణుడు.
ఇంత వంత నీకేల లతాంతమాత్రమునకే కలుగన్ ?
విను! నీకు దేవతా కేళివనంబు సొచ్చి,
అనికిన్ బలసూదను డెత్తివచ్చినన్ దీలుపడంగఁ దోలి
యిట తెచ్చెద, నిచ్చెద పారిజాతమున్
అంటూ, పైకెత్తిన ఆమె తడిముఖాన్ని ముద్దులలో ముంచాడు. మూసుకునివున్న సత్య కళ్ళల్లో కదలాడిన తృప్తి, కాంక్ష, ఆనందం కృష్ణుని పెదవులకు సొకుతూనే వున్నాయి.
ఆనాటినుంచి కొన్ని నెలలపాటు కృష్ణుడు ఆమెను వదల్లేదు. ఆమెను చుట్టుకునే వున్నాడు. అన్ని నెలలూ సత్య అతడితోనే తిరిగింది. అతడిలోపలే కరిగింది. అతడి మైకం లోనే బ్రతికింది.
ఆ మైకములో, నారదుడు తనకు చేసిన అవమానం గుర్తుకు రాలేదు. ఇంద్రుణ్ణి జయించి పారిజాతాన్ని పెకలించుకురావడం కోసం చేసిన ప్రయాణం అలసట అనిపించలేదు. నారదుడు ఉపదేశించిన పుణ్యకవ్రతం పట్టి, పేరంటానికి రమ్మని స్వయంగా రుక్మిణింటికి వెళ్ళి పిలవడం సిగ్గనుకోలేదు.
సత్య వట్టి వెర్రిబాగులది.
వ్రతాలకూ, నోములకూ లొంగి మగడిక తన కొంగుపట్టుకు తిరుగుతాడనుకుందేగాని, నారదుడూ, కృష్ణుడూ, సవతులూ తానంత వైభవంగా జరుపుకున్న పుణ్యకవ్రతములో వినోదంగా తనతో ఆడుకున్నారని తెలుసుకోలేకపోయింది.
ఇదొక గొప్ప ప్రహసనమని యెరిగిన రుక్మిణి గడుసుగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి వాయనం పుచ్చుకు హాయిగా వెళ్ళిపోయింది.
హంస నీళ్ళను వదిలి వెళ్ళదని నదికి తెలీదా!
పాపం , సత్యభామ!
అంత ఉద్వేగమూ, అంతటి అమాయికతా వున్న ఆడది తెలుగుపడుచు కాక మరెవరై వుంటారు చెప్పండి!
ఆమె సత్రాజిత్తు కూతురనుకునేరు! అది పురాణపు చాదస్తం. ఆమె అక్షరాల నందితిమ్మనగారింట పుట్టింది! నిజం !
Posted by: Mr. SATYANARAYANA PISKA At: 24, Aug 2008 10:25:57 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|