|
|
Articles: TP Features | సామాజిక మార్గ నిర్మాత ఫూలే - Site Administrator
| |
(ఎ.రామలింగేశ్వరరావు)
సామాజిక న్యాయమంటే తెలియని రోజుల్లో, మనకు రాజకీయ స్వాతంత్ర్యం కన్నా వందేళ్ళు ముందు, సమాజంలో బ్రాహ్మణేతరులకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి, చలించి, సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టిన మహాత్ముడు జోతిరావు గోవిందరావు ఫూలే. చరిత్రకారులు విస్మరించి, పాఠ్యాంశాలకు దూరమై, ఈ మధ్య ప్రజల్లోకి (ఈ మధ్యే వచ్చిన రాజకీయ పార్టీ పుణ్యమా అని) వచ్చిన మహోన్నత వ్యక్తిని గురించి తెలుసుకోవడం తక్షణ కర్తవ్యం. మనకున్న `నలుగురు మహాత్ముల్లో' ఆయన మొదటివాడన్న విషయం చాలామందికి తెలియదు. ఫూలే కార్యదీక్షకు ఆనందపడి, ఆయనను బుద్ధుడు, కబీరు సరసన చేర్చాడు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్.
పీష్వా వంశానికి చెందిన బ్రాహ్మణ రాజైన బాజీరావ్ (రెండవ) రాజ్యం పోయిన రోజుల్లో, బ్రాహ్మణులకు బ్రాహ్మణేతరులకు మధ్య తీవ్రమైన వివక్ష ఉన్న నేపథ్యంలో, బ్రాహ్మణులకు పట్టుకొమ్మైన పూనాలో 1827 ఏప్రిల్ 11న తన తల్లితండ్రులకు చిన్న కొడుకుగా పుట్టాడు. తాతలు పూల వ్యాపారంలో ఉండబట్టి వాళ్ళ ఇంటి పేరైన `గోర్హే' మారిపోయి `ఫూలే' అయింది. `మాలి' కులంలో పుట్టాడు. తను పుట్టక ముందు బ్రాహ్మణేతరులకు చెప్పుకోదగ్గ చదువు ఉండేది కాదు. ఆ రోజుల్లో సిరా అంటరాని వస్తువు. తోలుతో బైండు చేసిన పుస్తకాలు కూడా ముట్టదగినవి కావు. స్త్రీలు చదవకూడదు. దానికి తోడు జోతిరావు తండ్రి దగ్గర పనిచేసే బ్రాహ్మణ గుమాస్తా - చదివిస్తే జోతిరావు వ్యవసాయానికి పనికిరాడని, మత వ్యతిరేకిగా మారడమే కాకుండా తిరుగుబాటు భావాలతో ఉంటాడని నూరిపోయడంతో చదువుతున్న చదువును తండ్రి మధ్యలోనే ఆపించాడు. వ్యవసాయ పనుల్లో ముంచాడు. పదమూడేళ్ళకే పెళ్ళి చేశాడు. వధువు (సావిత్రిబాయి) వయస్సు ఎనిమిది సంవత్సరాలు. చదువు మీద జోతిరావుకున్న శ్రద్ధ చూసి ఒక ముస్లిం మిత్రుడు, మరొక క్రిస్టియన్ మిత్రుడు చెప్పడంతో 14 ఏళ్ళ వయస్సులో తండ్రి మరలా జోతిరావును మిషన్ స్కూలుకు పంపాడు. అప్పుడే సదాశివ్ అనే బ్రాహ్మణ మిత్రుడు పరిచయమయ్యాడు. ఇంటి దగ్గర ఆటకి ముస్లిం స్నేహితులుండేవారు. తన బ్రాహ్మణ మిత్రుడితో శివాజీ వీరగాథలు, జార్జి వాషింగ్టన్ చరిత్ర, థామస్ పైనే రాసిన `రైట్స్ ఆఫ్ మేన్' చదివి ఉత్తేజితుడయ్యాడు. అమెరికా స్వాతంత్ర్య చరిత్ర ఎంతో ఆకర్షించింది. దానికి తోడు బ్రాహ్మణ రాజ్యం అంతమవ్వటం వల్ల బ్రిటిష్ వారిపై బ్రాహ్మణ మిత్రులకు కోపంగా ఉండేది. బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమేయాలన్న భావనతో ఉండేవారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|