|
|
Articles: TP Features | తెలుగుజాతి కోసం... - Site Administrator
| |
(డాక్టర్ సామల రమేష్ బాబు)
పేగుబంధం ఎట్లాంటిదో భాషాబంధం కూడా అట్లాంటిదే. తల్లిభాష అట్లాగే ఏర్పడుతుంది. తమ తల్లిభాష ఏదో అదే భాషను తల్లిభాషగా కలిగిన తోటివారితో సహజమైన ఆత్మీయతను కలిగి ఉంటారు గనుక వారంతా ఒకే భాషాజాతీయులవుతారు. అలాంటి భాషా జాతీయులకు సహజమైన ఒక భౌగోళిక ప్రాంతం కూడా ఏర్పడితే అది వాళ్ళ రాజ్యమవుతుంది. ఆ రాజ్యాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు వికసిస్తారు. ఇందుకోసం తగిన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ వ్యవస్థలు కుటుంబం నుండి రాజ్యాధికారం వరకు ఏర్పడతాయి. జీవనానికి సంబంధించిన అన్ని రంగాల్లో ఇవి ఏర్పడతాయి. ఈ అన్నిటికీ ఊపిరి వాళ్ళందరికీ ప్రాణమైన తల్లిభాషే. లేకపోతే చలనం ఉండనట్లే భాషా జాతీయత లేకపోతే ఆ మానవ సమూహాల మనుగడే ఉండదు.
తమదంటూ ప్రత్యేకించి భౌగోళిక ప్రాంతం లేని మానవ సమూహాలకు కూడా తమదైన భాష ఉంటుంది. గనుక అదే వాళ్లను కలిపి ఉంచే జాతీయతా సూత్రం అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న భాషా సమూహాలు, పెద్ద సమూహాలతో కలిసి జీవించే క్రమంలో అవి తమ భాషను కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. వాటిని ఎంతవరకు అధిగమించగలిగితే అంతవరకే వాటి భాషాజాతీయత ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో అతి పెద్ద భాషాసమాజంతో కలిసి ఉన్నప్పుడు అవి పరస్పరం పెనవేసుకుపోయి, మరింత బలమైన భాషాసమాజంగా, జాతిగా ఏర్పడతాయి. ఇలాంటి పరిణామాలు మన దేశంలో తరతరాలుగా ఎన్నో కలిగాయి. ఫలితంగానే పెద్ద భాషాజాతులు మనలోంచి ఏర్పడ్డాయి. మన తెలుగుజాతి కూడా ఇట్లా ఏర్పడిందే.
ప్రజల్లోంచి, వాళ్ల బ్రతుకులోంచి భాషా వికాసం జరుగుతుంది. అన్ని వ్యవస్థలపైనా వాళ్లకున్న భాగస్వామ్యాన్ని బట్టి వాళ్ల క్రియాశీలత ఉంటుంది. కొన్నివేల సంవత్సరాల క్రమానుగత వికాసం తర్వాత కూడా తెలుగు సమాజంలో తెలుగు ఎందుకు పెత్తనం చెయ్యలేకపోతోంది? మనిషి పుట్టిన దగ్గర్నుండి చనిపోయేవరకూ జరిగే ఆచార వ్యవహారాల్లో సాంప్రదాయక కర్మకాండల్లో, గుడిలో, బడిలో అతని భాష గౌరవప్రదమైన స్థానాన్నెందుకు పొందలేకపోతున్నది? ఏ కుల, మత, అధికార శక్తులు ఇందుకు ప్రతిబంధకాలవుతున్నాయి? ఈ సమస్యలు పరిష్కారం కాకుండా తెలుగుభాషా వికాసం జరగదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|