|
|
Articles: TP Features | ఆది కవికి వెయ్యేళ్ళు - Site Administrator
| |
నన్నయ్య తర్వాత ఈ వెయ్యేళ్ళలో కావ్య రచన చేసిన కవులంతా ఆయనను ప్రస్తుతించారు. సుమారు నూరుగురు కవులైనా ఆయన మహనీయతను పూర్వకవి స్తుతిలో ప్రసక్తం చేశారు. నన్నయ్య గొప్పతనం ఎంతటిదో విశ్వనాథవారి 'నన్నయ్య ప్రసన్నకథా కవితార్థత' అనే వ్యాఖ్యానం చదివితే తెలుస్తుంది. తన రచనలో ప్రసన్న కథాకవితార్థత, అక్షర రమ్యత, నానా రుచిరార్ధ సూక్తినిధిత్వమూ ఆవిష్కరించానని చెప్పుకున్నాడు. అది ఆత్మప్రశంస కాదు. ఆత్మవిశ్వాసం. అక్షరసత్యం.
నన్నయ్యకు ముందు తెలుగులో పద్య రచన ఉండి ఉండవచ్చు. కావ్య రచన కూడా జరిగి ఉండవచ్చు. సాహిత్య సృష్టి కూడా ఉండవచ్చు. లేకపోతే అంత పరిపుష్టమైన పరిపక్వమైన, సర్వాంగ పరిపూర్ణమైన, రీతి, శయ్య, ధారాళత, శబ్దార్ధ రమణీయత, సౌష్టవం ఎట్లా సాధ్యమని వారి వాదం. స్వయంభువుగా అటువంటి రచన ప్రభవించగలదా? అని వారి ప్రశ్న. అది నన్నయ్య అమేయ ప్రతిభ అనుకోవచ్చుకదా! ఆయన ప్రజ్ఞ అని భావించవచ్చుకదా! ఆ శైలీ పారమ్యత మరి ఇప్పుడు వెయ్యేళ్ళ తర్వాత కూడా ఎవరూ సాధించలేదే. వెయ్యేళ్ళ నిరంతర పద్యరచన సాగుతున్నా ఎవరినైనా నన్నయ్యతో పోల్చగలమా? కాబట్టి నన్నయ్య తన ప్రజ్ఞాశీలతతోనే అటువంటి రీతి సృష్టించి ఉండవచ్చు.
నన్నయ్యకు పూర్వమే తెలుగులో పద్యరచన శాసనాలలో కనబడుతుంది. కావ్యరచన కూడా ఎవరైనా చేసి ఉండవచ్చు. తూర్పు చాళుక్యుల పరిపాలనకు పూర్వం కొన్ని శతాబ్దులు ఆంధ్రదేశంలో బౌద్ధమూ, జైనమూ వ్యాప్తి చెందినట్లు చారిత్రకాధారాలున్నాయి. చాళుక్యులలోనే కొందరు జైనమతాభిమానులున్నారు. తమిళ దేశంలో జైనానికీ, శైవానికీ స్పర్ధలు కూడా తలెత్తినట్లు శైవభక్తి ప్రాశస్త్య రచనలు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, అంతకు పూర్వమే తమిళంలో ఉన్న పెరియపురాణం చెబుతున్నాయి. పండితారాధ్య చరిత్రలో మల్లికార్జున పండితుడు చందవోలులో ఒక బౌద్ధమతాచార్యుడితో వాదించినట్లూ ఆ బౌద్ధమతాచార్యుడి దుష్ట ప్రేరణ వల్ల రాజు పండితుని కళ్ళు పీకించినట్లు ఐతిహ్యం ఉంది. కాబట్టి మతోద్రేకాల వల్ల కలహాల వల్ల అప్పటికే వచ్చిన గ్రంథాలు కొన్ని నాశనమై ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకా మారుమూల గ్రామాలలో, పూర్వకాలపు మత ప్రచార కేంద్రాలలో, తాటాకు పుస్తకాలు తరతరాలుగా భద్రపరచిన వారి వద్ద నన్నయ్యకు పూర్వం రచితమైన గ్రంథాలు దొరికే అవకాశం లేకపోలేదు అని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు శివతత్త్వసార పీఠికలో చెప్పారు.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|