దాసరి, తమ్మారెడ్డికి అవార్డులు
జాతీయ స్థాయిలో చలనచిత్ర పరిశ్రమకు విశేషంగా కృషిచేసిన చిత్ర ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందజేసే ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు 2007 సంవత్సరానికి గాను డాక్టర్ దాసరి నారాయణరావు ఎంపికయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి తమ వంతు కృషి చేసిన ప్రముఖులను గుర్తించుకునేందుకు తెలుగు సినీ పితాహుడు రఘుపతి వెంకయ్య పేరిట ఏర్పాటు చేసిన అవార్డును 2007 సంవత్సరానికి సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఎంపికయ్యారు. ఈ అవార్డులను పరిశీలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు బాలయ్య, అర్జున్ రాజు, గిరిబాబు తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించింది. అనంతరం దాసరికి ఎన్టీఆర్ జాతీయ అవార్డును, తమ్మారెడ్డి కృష్ణమూర్తికి రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేయనున్నట్టు ప్రభుత్వం బుధవారంనాడు ప్రకటించింది. ఈ నెల 14న హైద్రాబాద్ లోని లలిత కళా తోరణంలో జరుగనున్న 2007 చలన చిత్ర నంది బహుమతి ప్రధానోత్సవంలో ఈ అవార్డులను అందజేస్తారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు కింద దాసరికి 5 లక్షల రూపాయల నగదు. ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. రఘుపతి వెంకయ్య అవార్డు కింద తమ్మారెడ్డి కృష్ణమూర్తి 50 వేల రూపాయల నగదు, బంగారు పతకం, బంగారు నంది, ప్రశంసా పత్రం అందుకుంటారు.
దాసరి ప్రస్థానం...
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచి 148 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నెస్ రికార్డు సొంతం చేసుకున్నారు. తెలుగు పరిశ్రమ హైద్రాబాద్ లో వేళ్లూనుకోవడానికి ఆయన అవిరళ కృషి చేశారు. పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ముందుడే వ్యక్తిగా ఎందరికో ఆయన గురుతుల్యుడయ్యారు. ఎందరో కళాకారులు, దర్శకులను పరిశ్రకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. ఎంపిగా, కేంద్ర మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. నటుడుగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడుగా, పంపిణీదారుడుగా, ఎగ్జిబిటర్ గా బహుముఖ ప్రతిన చూపారు. 1970లో ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ 'తాతామనువడు' చిత్రంతో ఆయన దర్శకుడయ్యారు. అనంతరం అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించి, ఎన్నో సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తో ఆయనకు ఎంతో మంచి అనుబంధం ఉండేది. 'బొబ్బిలిపులి', 'సర్దార్ పాపారాయుడు' వంటి గ్రేటెస్ట్ హిట్ లు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. దాసరి పత్రికా రంగంలోకి అడుగుపెట్టి 'ఉదయం', 'శివరంజని' పత్రికల సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణం వైపే ఎక్కువ దృష్టి సారిస్తూ చాలాకాలం తర్వాత మళ్లీ 'మేస్త్రి' చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డును దాసరి ఎంపిక కావడం పట్ల పరిశ్రమలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. 1996లో ప్రారంభమైన ఈ అవార్డులను ఇంతవరకూ అక్కినేని నాగేశ్వరరావు, దిలీప్ కుమార్, శివాజీ గణషన్, లతా మంగేష్కర్, హృషికేష్ ముఖర్జీ, భానుమతి రామకృష్ణ, డాక్టర్ రాజ్ కుమార్, జి.కృష్ణ, ఇళయరాజా, అంబరీష్, వహిదా రెహమాన్ అందుకున్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|