'బిల్లా'లో ప్రభాస్ 8-ప్యాక్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు 8 ప్యాక్ హీరోగా 'బిల్లా' చిత్రంలో కనిపించబోతున్నారు. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై యు.కృష్ణంరాజు సమర్పణలో నరేంద్ర, ప్రబోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహర్ రమేష్ ('కంత్రీ' ఫేమ్ ) దర్శకత్వం వహిస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. వచ్చే వారంలో ఆడియో, నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
'బిల్లా' మాఫియా డాన్ సినిమా అయినా బాండ్ సినిమాలా చాలా స్టయిలిష్ గా ఉంటుందని దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు. కన్నడంలో రాజ్ కుమార్ వారసుడు పునీత్ తో తొలి సినిమా, తెలుగులో నటరత్న ఎన్టీఆర్ మూడోతరం వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ తో (కంత్రీ) రెండో సినిమా చేశాననీ, ఇప్పుడు కృష్ణంరాసు నటవారసుడైన ప్రభాస్ తో ఇంత మంచి బ్యానర్ లో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానీ చెప్పారు. ప్రభాస్ ఎలా ఉండో ప్రేక్షకులకు నచ్చుతుందో అలాంటి స్టయిల్, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్ ఇందులో ఉంటాయనీ, 8 ప్యాక్స్ తో ఆయన ఇందులో కనిపిస్తారనీ, ఇందుకోసం ఏడు నెలల పాటు ఆయన శ్రమించారనీ చెప్పారు. అనుష్క తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందనీ, అలాగా నమిత పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుందనీ తెలిపారు. హన్సిక స్పెషల్ సాంగ్ సినిమాకి ఓ హైలైట్ అవుతుందన్నారు. మొత్తం 6 పాటలు ఉన్నట్టు తెలిపారు. పోలీస్ కమిషనర్ గా కృష్ణంరాజు పాత్ర చాలా ప్రత్యేకత కలిగి ఉంటుందని అన్నారు. సూపర్ 35 ఎంఎం కెమెరాతో పాటు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఈ సినిమాకి ఉపయోగించామనీ, మలేసియాలోని అత్యుద్భుతమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించామని చెప్పారు. నిర్మాణ పరంగా కృష్ణంరాజు ఇచ్చిన సహకారం మరువలేనిదనీ, ఓ యాక్షన్ ఎపిసోడ్ కు రెండు హెలికాఫ్టర్లు అవసరమైతే, నాలుగు హెలికాఫ్టర్లు ఉపయోగిస్తే బాగుంటుందని ఆయన సూచించారనీ చెప్పారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|