మళ్లీ నటిస్తా : ఆర్తి అగర్వాల్
'నువ్వునాకు నచ్చావ్' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి 'నువ్వులేక నేనులేను', 'ఇంద్ర' వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆర్తి అగర్వాల్ చివరి సారిగా 'గోరింటాకు' చిత్రంలో కనిపించింది. ఆమధ్య పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిన ఆర్తీ సుమారు రెండేళ్ల గ్యాప్ అనంతరం మరో ఇన్నింగ్స్ కోసం తాజాగా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. మళ్లీ సినిమాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ, హీరోయిన్ గా మరిన్ని మంచి పాత్రలు చేసి గతంలో మాదిరిగానే ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలని కోరుకుంటున్నాననీ ఆర్తి తెలిపారు. తన రాక సందర్భంగా హైద్రాబాద్ లోని సూపర్ గుడ్ స్టూడియోస్ లో సోమవారంనాడు ఆమె పాత్రికేయులతో ముచ్చటించారు.
పరిశ్రమలో తన పునఃప్రవేశానికి కారణాలను ఆర్తి వివరిస్తూ, నటన అంటే తనకు మొదట్నించీ ఆసక్తి అనీ, తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు తననెంతగానో ప్రోత్సహించిందనీ తెలిపారు. 'నువ్వునాకు నచ్చావ్', 'నువ్వు లేక నేను లేను', 'నీ స్నేహం', 'వసంతం', 'ఇంద్ర', 'అందాల రాముడు' వంటి చిత్రాలు తనకెంతో పేరు తెచ్చిపెట్టాయనీ అన్నారు. వివాహం తర్వాత రెండేళ్లపాటు నటిగా తనకు గ్యాప్ వచ్చిందన్నారు. తన భర్త ఉజ్వల్ కుమార్ అమెరికాలోని మోర్గాన్ స్టాన్ లీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉంటున్నందున తాను అమెరికా వెళ్లి అక్కడే ఉన్నానని చెప్పారు. అయితే నటన పట్ల తనకున్న ఆసక్తిని గమనించి మళ్లీ నటించమని ఆయన ప్రోత్సహించారనీ, దాంతో తిరిగి సినిమాలు చేయదలచుకున్నాననీ వివరించారు. రెండ్రోజుల క్రితమే తాను హైదరాబాద్ వచ్చినట్టు చెప్పారు. ఇప్పుడిప్పుడే తాను సినిమాల్లో నటిస్తానని తెలుసుకున్న దర్శక నిర్మాతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారనీ, మంచి ప్రాజెక్ట్ లు అంగీకరిస్తాననీ చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|