'అధినేత' ఆడియో రిలీజ్
జగపతిబాబు కథానాయకుడిగా వి.సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన రాజకీయ కథా చిత్రం 'అధినేత'. ఈనెల మూడోవారంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన బి.గోపాల్ ఆడియో క్యాసెట్లను, వి.వి.వినాయక్ ఆడియో సీడీలను రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
పరుచూరి సోదరులు మాట్లాడుతూ, హామీలు ఇచ్చే చేయి కన్నా కన్నీళ్లు తుడిచే చూపుడు వేలు గొప్పని చెప్పే సినిమా ఇదనీ, సామాజిక న్యాయం అంటే సిసలైన అర్ధమేమిటో ఇందులో చెబుతున్నామనీ అన్నారు. ఒక సామాన్య యువకుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తమని పేర్కొన్నారు. నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ, నిర్మాత సుంకు రమేష్ ఈ ప్రాజెక్ట్ ను తనకు రికమండ్ చేశారనీ, జనవరి 17 సినిమా ప్రారంభించి ఖర్చు, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా మూడు నెలల్లో పూర్తి చేశామనీ చెప్పారు. జగపతిబాబు తన సొంత సినిమాగా భావించి పనిచేశారని ప్రశంసించారు. ఈ చిత్రం తప్పనిసరిగా మ్యూజికల్ హిట్టవుతుందనీ, 'అమృతానికి' అనే పల్లవితో సాగే పాట చాలా బాగుంటుందనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి సదాశివుని పేర్కొన్నారు. సముద్ర మాట్లాడుతూ, జగపతిబాబుతో తన కాంబినేషన్ లో వచ్చిన 'శివరామరాజు' చిత్రానికి మించి ఈ చిత్రం మంచి హిట్ అవుతుందన్నారు. రాజకీయ ప్రస్తావన అంతర్లీనంగా ఉన్నా సకుటుంబతో చూడదగిన చిత్రమిదనీ, అర్ధవంతమైన సందేశం ఇందులో ఉంటుందని అన్నారు. జగపతిబాబు కెరీర్ లో బెస్ట్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|