మిత్రుడుకు ఆదరణ: బాలయ్య
యువరత్న నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం 'మిత్రుడు' విజయపథంలో నడుస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రం ప్రమోషన్ లోనూ చురుకుగా, ఎంతో ఉత్సాహంగా ఆయన పాల్గొంటున్నారు. బంజారాహిల్స్ లోని సినీమాక్స్ లో సోమవారం రాత్రి సందడిగా జరిగిన 'మిత్రుడు' సక్సెస్ మీట్ లో బాలకృష్ణ, చిత్ర కథానాయిక ప్రియమణి, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకుడు మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.
మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఈ చిత్రంతో మరోసారి రుజువైందనీ, ప్రేక్షకులతో పాటు తన అభిమానులు కూడా ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారనీ బాలకృష్ణ తెలిపారు. సినిమా ఫస్టాఫ్ లో కథాపరంగా తాను మౌనంగా నటించాల్సి వచ్చిందనీ, అయితే మౌనంగా నటించడం కష్టమేననీ ఆయన చమత్కరించారు. మహాదేవ్ కొత్త దర్శకుడైనా ఎక్కడా తడబడకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఛాయాగ్రాహకుడు బాలమురుగన్ తనను మరింత అందంగా చూపించారని ప్రేక్షకాభిమానులు అంటున్నారని చెప్పారు. ప్రియమణి, సినిమాలోని జంబో ఫ్యామిలీ అంతా తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారని చెప్పారు. అలాగే నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గతంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై తీసిన నాలుగు చిత్రాలలోనూ తాను నటించాననీ, తనకు ఇది మాతృసంస్థ వంటిందని పేర్కొన్నారు. కథానుసారం 25 రోజుల పాటు కౌలాలంపూర్ లో షూటింగ్ జరిపారంటే నిర్మాత అభిరుచి ఏమిటో అర్ధమవుతుందనీ, సమష్టి కృషి వల్లే ఈ చిత్రం ఇంత మంచి విజయాన్ని సాధించిందని అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|