దేవా కట్టా 'ప్రస్థానం' మొదలు
శర్వానంద్ కథానాయకుడుగా దేవ కట్టా ('వెన్నెల' ఫేమ్) దర్శకత్వంలో విఆర్ సి మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రవి వల్లభనేని నిర్మిస్తున్న చిత్రం 'ప్రస్థానం'. గచ్చీబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో బుధవారం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఎంఆర్ వి ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, దశరథ రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. శర్వానంద్ కు జోడిగా రూబీ, కీలక పాత్రల్లో సాయికుమార్, వెన్నెల కిషోర్, సందీప్ కిషన్ నటించనున్నారు.
దేవా కట్టా చిత్ర విశేషాలను తెలియజేస్తూ, 'వెన్నెల' చిత్రం తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల కొంత గ్యాప్ వచ్చిందనీ, 'ప్రస్థానం' ఓ చక్కటి హ్యూహన్ డ్రామా అనీ తెలిపారు. ఒక వ్యక్తి ఉత్ధానపతనాలను ఎంతో లోతుగా చర్చించే కథాంశమని అన్నారు. సాయికుమార్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నారు. రొటీన్ హీరో, విలన్ తరహా చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు. ఈరోజు నుంచి నైట్ ఎఫెక్ట్ లో ఓ పాట చిత్రీకరిస్తున్నామనీ, 16 నుంచి టాకీ ప్రారంభించి జూలై 31వరకూ తొలి షెడ్యూల్, ఆగస్టు 16 నుంచి 31 వరకూ రెండో షెడ్యూల్ జరుపుతామని చెప్పారు. హైద్రాబాద్, కర్నాటకలోని బదామి, విజయవాడలో సినిమా షూటింగ్ జరుపుతామనీ, దీపావళి కానుకగా సినిమా రిలీజ్ ఉంటుందనీ తెలిపారు. దేవా కట్టా ఎంతో అభిరుచి ఉన్న దర్శకుడని సాయికుమార్ పేర్కొన్నారు. మానవ సంబంధాలు, ఉద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించే కథా చిత్రమిదనీ, వాస్తవానికి దగ్గరగా ఉండే ఇలాంటి పాత్రల్లో నటించడం ఏనటుడికైనా సవాల్ అవుతుందనీ అన్నారు. 'పోలీస్ స్టోరీ', 'సామాన్యుడు' తర్వాత ఈ చిత్రంలో తాను చేస్తున్న పాత్ర మూడో బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|