క్రిష్ 'వేదం' ప్రారంభం
'గమ్యం'తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నిరూపించుకున్న జాగర్లమూడి రాథాకృష్ణ అలియాస్ క్రిష్ 'వేదం' అనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆర్కా మీడియా వర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై షోబు యార్లగడ్ల, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంలో అల్లు అర్జున్, మంచు మనోజ్ కుమార్, అనుష్క, మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని సినిమాక్స్ లో శుక్రవారం ఉదయం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. అల్లు అర్జున్, మంచు మనోజ్ లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ ఇవ్వగా, కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ, సంగీతం దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ, వెంకటేష్ కథానాయకుడుగా 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రానికి తాను స్క్రిప్టు రెడీ చేసినప్పటికీ మరికొంత వ్యవధి అనివార్యమైందనీ, ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలనుకుంటున్నట్టు వెంకటేష్ కు తెలియజేశాననీ అన్నారు. తొలుత 'వేదం' చిత్రాన్ని కొత్త తారలతో చేయాలని అనుకున్నాననీ, అల్లు అర్జున్ ఆసక్తి చూపించడంతో స్క్రిప్టు ఆయనకు వినిపించారనీ, అందులోని ఓ పాత్ర చేయడానికి ఆయన ముందుకు వచ్చారనీ తెలిపారు. దీంతో తనకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగి మరో పాత్ర కోసం అనుకుంటున్నప్పుడు మనోజ్ పేరును ఆయన సూచించారని తెలిపారు. ఇందులో స్లమ్ స్టార్ గా అర్జున్, రాక్ స్టార్ గా మనోజ్ కనిపిస్తారనీ, మరో మూడు కీలక పాత్రలు కూడా చిత్రంలో ఉన్నాయన్నారు. అనుష్క, మనోజ్ బాజ్ పేయితో పాటు ఓ వృద్ధ పాత్ర కూడా ఇందులో కీలకమవుతుందనీ చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఏ సినిమాకైనా స్క్రిప్టే హీరో అని తాను నమ్ముతాననీ, ఈ సినిమా ఒప్పుకోవడానికి స్క్రిప్టు మొదటి కారణమైతే, క్రిష్ మంచితనం మరో కారణమని అన్నారు. స్క్రిప్టు విన్న తర్వాత ఒక క్యారెక్టర్ ను తాను ఎంచుకున్నాననీ, మనోజ్, అనుష్క ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారనీ తెలిపారు. మల్టీస్టారర్ చేస్తున్నట్టు చెప్పినప్పుడు మామయ్య చిరంజీవి తన భుజం తట్టారని, ఈ చిత్రం తప్పని సరిగా ఘనవిజయం సాధించడంతో పాటు మల్టీస్టారర్ చిత్రాలకు సరికొత్త ట్రెండ్ తీసుకువస్తుందన్ని ధీమా వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|