'కలవరమాయే..' పాటలు
స్వాతి, కమల్ కామరాజ్ జంటగా మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై మోహన్ వడ్లపట్ల నిర్మిస్తున్న చిత్రం 'కలవరమాయె మదిలో'. సతీష్ కాసెట్టి దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో ఆదివారం సాయంత్రం జరిగింది. శరత్ వాసుదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఆరు పాటలకు వనమాలి సాహిత్యం అందించగా, చిత్ర నేపథ్యగానం అందించారు. దిల్ రాజు ఆడియో సీడీని విడుదల చేసి తొలి ప్రతిని శ్యాంప్రసాద్ రెడ్డికి అందజేశారు. గాయని చిత్ర ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి సముద్రకు అందజేశారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
వనమాలి మాట్లాడుతూ, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ శిష్యుడే శరత్ వాసుదేవన్ అనీ, దర్శకుడు సతీష్ కాసెట్టి మంచి మ్యూజికల్ కథాంశంతో రావడంతో ఇందులోని అన్ని పాటలే తానే రాశాననీ చెప్పారు. ఇందులోని అన్ని పాటలూ చిత్ర పాడటం చాలా సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు తన కృతజ్ఞతలని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ, సతీష్ కాసెట్టి చెప్పిన రెండు స్క్రిప్టులు తాను విన్నాననీ, ఒక దానిని పెద్ద హీరోతో చేయాలని అనుకున్నాననీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించాలని కూడా ఆలోచన చేశాననీ చెప్పారు. ఒక సినిమాకి 'కలవరమాయే మదిలో' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి ఆ తర్వాత సతీష్ కోరిక మేరకు ఆయనకు టైటిల్ ఇచ్చానని చెప్పారు. తాజా చిత్రం విషయానికి వస్తే సంగీత నేపథ్యంలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుందనీ, గతంలో ఓ రెండు సినిమాల నిర్మించిన మోహన్ ఈ చిత్రంలో మంచి సక్సెస్ సాధిస్తారనే నమ్మకం తనకుందనీ అన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మూడు నెలల క్రితమే ఈ సినిమా కథ తాను విన్నాననీ, సుధాలయా స్టూడియోస్ లో పాటలు విన్నప్పుడు తనకు బాగా నచ్చాయనీ చెప్పారు. చిత్ర పాటలంటే తనకెంతో ఇష్టమనీ, ఈ చిత్రం ఆడియో పెద్ద సక్సెస్ అవుతుందని కచ్చితంగా చెప్పగలననీ అన్నారు. వరల్డ్ మ్యూజిక్ డేన ఈ చిత్రం ఆడియో రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉందనీ, సినిమాలోని పాటలన్నీ తానే పాడేననీ చిత్ర చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దిల్ రాజు, శ్యాంప్రసాద్ రెడ్డికి తన కృతజ్ఞతలని నిర్మాత మోహన్ వడ్లపట్ల అన్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన విజ్ఞప్తి మేరకు చిత్ర హైద్రాబాద్ విచ్చేశారని అన్నారు. ఈ సినిమాకి స్వాతే హీరో అనీ, చాలా బాగా నటించిందనీ తెలిపారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|