ఏడిదకు 'లైఫ్ టైమ్' ప్రదానం
మూడు దశాబ్దాలుగా ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను నిర్మించి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికిచేర్చి న ఘనత పూర్ణోదయ సంస్థకూ, ఆ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావుకూ దక్కుతుందని ప్రముఖ నటుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. సంగమ్ అకాడమీ ఆధ్వర్వంలో మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన పూర్ణోదయ మూడు దశాబ్దాల వేడుకలో పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏడిద నాగేశ్వరరావుకు కె.విశ్వనాథ్, చిరంజీవి, ఎస్.పి.బాలసుబ్రమణ్యం చేతుల మీదుగా జీవన సాఫల పురస్కారాన్ని అందజేశారు. సీనియర్ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ రచించిన 'సినీపూర్ణోదయం' పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు.
ఏడిద నాగేశ్వరరావు, పూర్ణోదయ సంస్థతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి ప్రస్తావిస్తూ, ఏడాది నాగేశ్వరరావు నిర్మించిన తొలిచిత్రం 'తాయారమ్మ బంగారయ్య' చిత్రంలో తాను ఓ చిన్న పాత్ర పోషించాననీ, ఆ తర్వాత అదే బ్యానర్ లో 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు'
చిత్రాల్లో నటించి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు కూడా అందుకున్నానని అన్నారు. వ్యక్తిగతంగా కూడా తన పెళ్లి కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందనీ, తెలుగు పరిశ్రమ గర్వించదగిన నిర్మాత ఆయననీ కొనియాడారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ మాట్లాడుతూ, ఏడిద నాగేశ్వరరావుతో తనకు 30 ఏళ్లుగా సుదీర్ఘ అనుబంధం ఉందనీ, తమ ఇద్దరి కలయికలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తుండిపోయే పలు సినిమాలు వచ్చాయనీ అన్నారు. జీవన సాఫల్య పురస్కారానికి అన్నివిధాలా ఏడిద అర్హులని పేర్కొన్నారు. కళాత్మక చిత్రాలతో ఉత్తమాభిరుచి చాటుకున్న నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అని సి.నా.రె. అభివర్ణించారు. సినీ వ్యాపారానికి సంస్కారం, ధైర్యం జోడించి కళాత్మక చిత్రాలకు కూడా డబ్బులొస్తాయని నిరూపించిన నిర్మాత ఏడిద అని ఎస్.పి.బాలసుబ్రమణ్యం కొనియాడారు. మూడు దశాబ్దాలుగా ఎన్నో ఉత్తమోత్తమ చిత్రాలను నిర్మించిన పూర్ణోదయ సంస్థ అధినేత ఏడిదకు లైఫ్ టీమ్ అచీవ్ మెంట్ అందజేసి సత్కరించాలనుకోవడం సముచితంగా తాము భావించినట్టు సంగం ఆర్ట్స్ తరఫున సంజయ్ కిషోర్ పేర్కొన్నారు. ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారని నటులు సుమన్, శరత్ బాబు, ఆలీ, నటి మంజుభార్గవి తదితరులు ప్రశంసించారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|