నాగచైతన్య 'జోష్' ఆడియో
అక్కినేని నాగేశ్వరరావు మనువడు, నాగార్జున తనయుడు అయిన నాగచైతన్య ఆ ఇద్దర్నీ మించిన నటుడు కావాలని 'జోష్' ఆడియో వేడుకలో అతిథులంతా ఆకాంక్షించారు. నాగచైతన్య తొలి చిత్రం 'జోష్' ఆడియో వేడుక శిల్పకళా వేదికపై శనివారం రాత్రి సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానుల మధ్య ఉల్లాసభరితమైన వాతావరణంలో జరిగింది. నాగచైతన్యకు జంటగా ప్రముఖ కథానాయిక రాధ కుమార్తె కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడుకు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను కె.రాఘువేంద్రరావు ఆవిష్కరించి డాక్టర్ మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ తదితరులకు అందజేశారు. నాగార్జున, రాధ, కార్తిక, దిల్ రాజు, వాసువర్మ, శ్రీహరి, నితిన్, రామ్, వరుణ్ సందేష్, సుశాంత్, నిఖిల్, శ్రీనువైట్ల, వంశీ పైడిపల్లి, దశరథ్, బోయపాటి, శ్రీవాస్, రాజమౌళి, చంద్రబోస్, సమీర్ రెడ్డి, సంగీత దర్శకుడు సంతీప్ చౌతా, బ్రహ్మానందం, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
నాగచైతన్య కష్టాన్ని నమ్ముకున్న హీరోగా రాణించాలనీ, ఈ తరం అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు అభినందనీయుడనీ అక్కినేని నాగేశ్వరరావు పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ, నాగచైతన్య తాతలైన అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు లివింగ్ లెజెండ్స్ అనీ, నాన్నగారు చేరుకున్న శిఖరాలను తాను, తన జనరేషన్ హీరోలు అధిగమించలేకపోయారనీ, అయితే నాగచైతన్య ఆ స్థాయికి చేరుకోవాలని తాను కోరుకుంటున్నాననీ అన్నారు. నాగచైతన్యకు మొదట్లోనే దిల్ రాజు వంటి మంచి ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టమని అన్నారు. సినిమా మంచి హిట్టవుతుందని దిల్ రాజు చెప్పడం తనకు చాలా రిలీఫ్ కలిగించిందన్నారు. సినిమా ప్రథమార్థం తాను చూశాననీ, చాలా బాగుందనీ చెప్పారు. నాగచైతన్య తనకంటే తెలివైన వాడనీ, తాను ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాల్లోకి వచ్చాననీ, చైతన్య మాత్రం టెన్త్ పూర్తిచేయగానే నటించాలనుకుంటున్నట్టు తనతో చెప్పాడనీ, అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయమని తాను కోరారననీ అన్నారు. అలాగే డిగ్రీ పూర్తి చేసి ఏమాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా హీరో అయ్యాడని తెలిపారు. చైతన్యను తాను ఉండగానే హీరోగా చూడాలనుకుంటున్నట్టు తన తండ్రి నాగేశ్వరరావు కోరారనీ, చైతన్య 100వ సినిమాను కూడా నాన్నగారు చూస్తారనే నమ్మకం తనకుందనీ పేర్కొన్నారు. చెతన్య రెండో సినిమాను తాతగారైన రామానాయుడు గారు తీసి 'ప్రేమ్ నగర్' అంత పెద్ద హిట్ చేయాలని వేదికపై ఉన్న రామానాయుడును కోరారు. తాను నటించిన 'నిన్నే పెళ్లాడతా', 'సూపర్' చిత్రాలకు మంచి మ్యూజిక్ అందించిన సందీప్ చౌతా ఆ రెండింటి కంటే 'జోష్' చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారని ప్రశంసించారు. మూడు దశాబ్దాలుగా అక్కినేని ఫ్యామిలీని అభిమానిస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు చైతన్యను కూడా తమ భూజాలపై వేసుకుని ఆదరించాలని కోరారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|