'యు అండ్ ఐ' ఆడియో
నూతన తారలు రోహన్, అదితి చౌదరి హీరోహీరోయిన్లుగా శ్రీమతి యశోదాదేవి సమర్పణలో జెఎస్ఎంఎన్ సినిమా పతాకంపై రవీందర్ కుమార్ తోట నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'యు అండ్ ఐ'. రంజిత్ బెల్లూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఎం.పి. మధుయాస్కి, తరుణ్, సంగీత దర్శకుడు చక్రి, రవీందర్ తోట, రంజిత్ బెల్లూరి, చిత్ర సంగీత దర్శకుడు కార్తిక్, రోహన్, అదితి తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీని మధుయాస్కి ఆవిష్కరించి తొలి ప్రతిని చక్రికి అందజేశారు. ఆడియో క్యాసెట్ ను తరుణ్ విడుదల చేసి రవీందర్ తోటకు అందజేశారు. సోనీ బిఎంజి ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది.
మధుయాస్కి మాట్లాడుతూ, నిర్మాత రవీందర్ తోట తనకు మంచి మిత్రుడనీ, ఆయన నిర్మించిన తొలి చిత్రం పాటలు చూశాననీ, యూత్ ను తప్పనిసరిగా ఆకట్టుకుంటాయనీ చెప్పారు. ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయం సాధించి యూనిట్ అందరికీ పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. చక్రి మాట్లాడుతూ, ఇటీవల తాను అమెరికా వెళ్లినప్పుడు ఈ సినిమా పాటలు వినమని రవీందర్ అన్నారనీ, పాటలు చాలా బాగున్నాయని చెప్పాననీ అన్నారు. రవీందర్ తనకు దూరపు బంధువనీ, ఈ సినిమా ఆఫర్ తనకే వస్తుందని ఆశించినప్పటికీ సంగీత దర్శకుడుగా కార్తీక్ ను ముందుగానే ఎంచుకున్నారనీ, కార్తీక్ కు మంచి భవిష్యత్తు ఉందనీ అన్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇది తన జీవితంలో మరపురాని రోజని రవీందర్ తోట అభివర్ణించారు. 1984లో తాను ఒక థియేటర్ లో రాజేంద్రప్రసాద్ సినిమా చూశాననీ, అప్పుడే తాను నిర్మాత కావాలని నిశ్చయించుకున్నాననీ, అయితే అప్పుడు తన జేబులో పది రూపాయలు కూడా లేవని అన్నారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన 'స్వయంకృషి' చిత్రం తనకెంతో స్ఫూర్తినిచ్చిందనీ, ఉన్నత విద్యాభ్యాసం చేయాలని నిశ్చయించుకున్నాననీ, ఆ తర్వాత ఆచార్య రంగా యూనివర్శిటీలో పి.హెచ్.డి. చేశాననీ చెప్పారు. కొంత సొమ్ము కూడబెట్టి యుఎస్ఎ వెళ్లానని చెప్పుకొచ్చారు. ఇటీవల మెక్సికో వెళ్లినప్పుడు తనను కొందరు తెలుగు కుర్రాళ్లు కలిసారనీ, మాటల సందర్భంలో రంజిత్ అనే యువకుడు మంచి నిర్మాత కోసం ఎదురుచూస్తున్నట్టు తనకు చెప్పారనీ, రంజిత్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాననీ చెప్పారు. ఒకరోజు రంజిత్ తనకు కలుసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ అతనికి అప్పగించాననీ చెప్పారు. ఈ సినిమా హిట్టయితే డి.రామానాయుడు తరహాలో 150 సినిమాల వరకూ తీస్తాననీ, లేకుంటే సినిమాలు చేయకపోవచ్చనీ స్పష్టం చేశారు. ఆడియో రైట్స్ అమ్మకం ద్వారా వచ్చిన లక్ష రూపాయలను తన మిత్రుడు ప్రారంభించిన అనాథాశ్రమానికి ఇస్తున్నట్టు ప్రకటించారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|