స్వర్ణోత్సవ నటుడు కమల్
విలక్షణ నటులు చాలా మందే ఉండొచ్చు. భారతీయ నటుడని సగర్వంగా అంతా అంగీకరించే నటులు అరుదు. అలాంటి అరుదైన నట'లోక నాయకుడే' పద్మశ్రీ కమల్ హాసన్. నేటితో ఆయన స్వర్ణోత్సవ నటుడుగా కొత్త టర్న్ తీసుకున్నారు. 50 ఏళ్ల నట ప్రస్థానికి చేరుకున్నారు. సరిగ్గా 1959 ఆగస్టు 12న ఆరేళ్ల ప్రాయంలో బాలనటుడిగా 'కళత్తూర్ కణ్ణమ్మ'తో పరిశ్రమలోకి అడుగుపెట్టి అదే చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.
నట ప్రస్థానం
మధురై సమీపంలోని పరమకుడి పట్టణంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో కమల్ 1954 నవంబర్ 7న జన్మించారు. కులకర్ణి మాస్టర్ వద్ద భరతనాట్యం, కథక్, రామమూర్తి వద్ద కూచిపూడి నృత్యం అభ్యసించారు. బాలనటుడి నుంచి యవ్వన దశలోకి అడుగుపెట్టి 19వ ఏట 'ఉణరిచ్చిగళ్' అనే చిత్రంలో నటించారు. అందులో ఆయన నటన ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో కమల్ కెరీర్ మలుపు తిరిగింది. కమల్-బాలచందర్ కాంబినేషన్ లో వచ్చిన 'మరోచరిత్ర' రికార్డులు సృష్టించింది. అదే చిత్రం హిందీలో 'ఏక్ దుజేకేలియో' పేరుతో పునర్మిర్మితమై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత కూడా కమల్ కొన్ని హిందీ చిత్రాల్లో నటించారు. 'వయసు పిలించింది', 'అందమైన అనుభవం', 'ఇది కథ కాదు', 'సాగరసంగమం', 'స్వాతిముత్యం', 'సొమ్మొకడిది సోకొకడిది', 'ఒకరాధ ఇద్దరు కృష్ణులు' వంటి దాదాపు 15 స్ట్రయిట్ చిత్రాల్లో కమల్ నటించారు. అవన్నీ దాదాపు హిట్లే. కె.విశ్వనాథ్ 'శుభసంకల్పం' తర్వాత మళ్లీ ఆయన స్ట్రయిట్ తెలుగు చిత్రంలో నటించలేదు. అయితే తమిళ, తెలుగు ద్విభాషా చిత్రాల్లో చేశారు. ఆయన తమిళంలో నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగులోనూ అనువాదమై ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రపంచ సినీ చరిత్రలోనే ఒకనటుడు 10 పాత్రలు పోషించిన రికార్డు కమల్ దే. ఆ చిత్రం ఇటీవలే 'దశావతారం'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ నటజీవిత స్వర్ణోత్సవ కానుకగా ద్విభాషా చిత్రం 'ఈనాడు' సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది.
నాలుగు సార్లు జాతీయం...
బాలనటుడిగా 'కళత్తూర్ కణ్ణమ్మ' తర్వాత, మూండ్ర పిరై (వసంత కోకిల), నాయకన్ (నాయకుడు), ఇండియన్ (భారతీయుడు) చిత్రాలకు ఆయన జాతీయ అవార్డులు పొందారు. 18 సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక దక్షిణాది నటుడు కూడా ఆయనే. తెలుగులో మూడు సార్లు 'సాగరసంగమం', 'స్వాతిముత్యం', 'ఇంద్రుడు చంద్రుడు' చిత్రాలకు ఉత్తమనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ఆయన నటించిన ఆరు చిత్రాలు ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ అయ్యాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 162 చిత్రాల్లో నటించిన కమల్ కు భారత ప్రభుత్వం 1990లో 'పద్మశ్రీ'తో గౌరవించింది. చెన్నైలోని సత్యభామ డీమ్డ్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సన్మానించింది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|