-బెస్ట్ స్టూడియో అధినేతగా డి.రామానాయుడుకు రామ్ చరణ్ చేతుల మీదుగా అవార్డు ఇవ్వమని నిర్వాహకులు కోరినప్పుడు..ఆయన చాలా పెద్దవారనీ, తాను చిన్నవాడిననీ రామ్ చరణ్ తన వినయం చాటుకున్నారు. రామానాయుడు సందర్భోచితంగా 'రాజా...నువ్వుకూడా రా' అంటూ చిరంజీవిని వేదిక మీదకు పిలిచి తండ్రీకొడుకుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
-ఇటీవలే కన్నుమూసిన పాప్ సంగీత సామ్రాట్ మైఖేల్ జాక్సన్ కు ట్రిబ్యూట్ గా ఆయనే పాడిన ఓ పాటను సంగీత దర్శకుడు విశ్వ
వినిపించి ఆయన మధుర స్మృతులను మరోసారి కళ్లముందు నిలిపారు.
-నందమూరి హీరోల ఆశీర్వాదంతో 'బాణం' చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరచయమమవుతున్న నారా రోహిత్ 'సంతోషం' అవార్డుల వేదికపై తళుక్కుమని మెరిశారు. తనను ఆశీర్వందించాల్సిందిగా కోరారు.
-'మగధీర' సినిమాలో షేర్ ఖాన్ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీహరి ఇదే వేదికపై ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ('కింగ్' చిత్రానికి) అవార్డును అందుకుంటూ...మగధీర సినిమా 50 రోజుల వేడుక తర్వాత ఏదో కలుపుతామని అల్లు అరవింద్ గారు చెప్పారు అంటూ నవ్వుతూ ఓ ఫీలర్ వదిలారు. శ్రీహరి నటించిన సల్మాన్ రాజు పాత్రను సినిమాలో కుదించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సన్నివేశాలే మళ్లీ చేర్చేందుకు అరవింద్ సార్ భరోసా ఇచ్చారన్నమాట.
-'అష్టాచమ్మ' చిత్రంలో నటనకు గాను ఉత్తమ హాస్యనటి అవార్డును అందుకున్న హేమ 'బాగానే నటిస్తున్నాను కదా. ఇంతవరకూ అవార్డులు రాలేదేమిటా అనుకున్నే దాన్ని. నంది అవార్డు కూడా తీసుకోవాలనుకుంటున్నాను' అంటూనే ఓ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చింది. వేదికపై నుంచే అన్నయ్యా...పూరీ (జగన్నాధ్) పైకి రా...అంటూ ఆయనను పిలిపించుకుని మరీ అవార్డు అందుకుంది. అప్పటికే హేమకు అవార్డు ఇచ్చేందుకు నిలబడిన నందమూరి తారకరత్న పూరీతో కలిసి హేమ కు అవార్డు ఇవ్వాల్సి వచ్చింది.