రజతోత్సవ నటుడు నాగ్
పాతికేళ్ల నట ప్రస్థానం...75 సినిమాలు. మన్మథుడుగా, అన్నమయ్యగా, భక్తరామదాసుగా, కింగ్ గా ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రలో ఒదిగిపోతూ అప్పుడే ఆయన 51వ వసంతోలోకి అడుగుపెట్టారంటే నమ్మశక్యం కాదు. యువసామ్రాట్ గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన నాగార్జున బర్త్ డే నేడు. ఈసారి ఆయన పుట్టినరోజుకు మరింత ప్రత్యేకత ఉంది. ఇది నాగార్జున రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరుణం. దీనికి తోడు నాగార్జున నటవాసుడుగా నాగచైతన్య 'జోష్' చిత్రం ద్వారా సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తండ్రి పేరు నాగార్జున నిలబెడితే ఇప్పుడు ఆయన పేరు నాగచైతన్య నిలబెట్టేందుకు పరిశ్రమలోకి అడుగుపెట్టడం నాగ్ కు పుత్రోత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.
అక్కినేని నాగేశ్వరరావు తన 17వ ఏట (1941)లో సినీనటుడుగా రంగ ప్రవేశం చేస్తే, 1985లో ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 20న 'విక్రమ్' సినిమాతో కెమెరా ముందుకు వచ్చారు. అప్పుడు నాగార్జున వయసు 27. ఈ రెంటింటికీ మధ్యస్తంగా 23వ ఏట అక్కినేని ఫ్యామిలీ మూడోతరం వారసుడు నాగచైతన్య హీరో కావడం, చైతన్య తొలి చిత్రం విడుదలకు ముందే ద్వితీయ చిత్రం ప్రారంభం కావడం నాగార్జున జోష్ ను పెంచుతోంది. పాతికేళ్ల సినీ కెరీర్ లో నాగార్జున చేసిన ప్రయోగాలు, ప్రత్యేకతలు ఎన్నెన్నో. ఎందరో కొత్త దర్శకులతో సినిమాలు చేయడం, పరభాషా దర్శకులను ప్రోత్సహించడం, భక్తిరస చిత్రాలు చెల్లని కాణీలనే అభిప్రాయం తప్పని నిరూపిస్తూ ఇంటింటా అన్నమయ్య, భక్త రామదాసు స్మృతులను తట్టిలేపడం వంటివి ఆయన కెరీర్ లో గుర్తిండిపోతాయి. రామ్ గోపాల్ వర్మను 'శివ' ద్వారా పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ నాగార్జునదే. తెలుగు సినిమా నడకను పూర్తిగా మార్చేసిన సినిమాగా 'శివ' చరిత్ర సృష్టించింది. మణిరత్నంతో చేసిన 'గీతాంజలి' ఇప్పటికే నాగార్జున టాప్-10లో నిలిచి ఉంటుంది. నృత్య దర్శకుడు లారెన్స్ ను 'మాస్'తో దర్శకుడిగా చేశారు. ప్రియదర్శన్, ఫాజల్, ప్రతాప్ పోతన్, రవిచంద్రన్, రాజేంద్రసింగ్ బాబు వంటి పరభాషా దర్శకులతో సినిమాలు చేశారు. విక్టరీ మధుసూధనరావుతో మొదలుపెట్టి ఎ.కోదండరామిరెడ్డి, కె.రాఘువేంద్రరావు, బి.గోపాల్ వంటి దిగ్దర్శకులతో పనిచేశారు. కృష్ణవంశీ, దశరథ్, వి.ఎన్.ఆదిత్య వంటి, వై.వి.ఎస్.చౌదరి వంటి యువ ప్రతిభావంతుల చిత్రాల్లోనూ నటించి పలు హిట్లు అందించారు. ఐశ్వర్యారాయ్, సోనాలి బింద్రే, జుహిచావ్లా, మనీషా, శిల్పాశెట్టి, సోనాలి బింద్రే వంటి ఎందరో బాలీవుడ్ హీరోయిన్లు నాగ్ సరసన నటించారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|