తుషార్ తో 'మహాత్మ' ఆడియో
హీరో శ్రీకాంత్ 100వ చిత్రం 'మహాత్మ'. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో గోల్డెన్ లయన్ పతాకంపై సి.ఆర్.మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఆంధోని సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని నోవోటెల్ లో సోమవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. మహాత్మా గాంధీ ముని మనువడు తుషార్ గాంధీ ముఖ్య అతిథిగా వచ్చేసి ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి డాక్టర్ ఎం.మోహన్ బాబుకు తొలి ప్రతిని అందించారు. సుప్రీం మ్యూజిక్ కొత్త లోగోను మోహన్ బాబు ఆవిష్కరించారు. పరుచూరి సోదరులు, సిఆర్ మనోహర్, విజయ్ ఆంటోని, సిరివెన్నెల, సుద్దాల అశోక్ తేజ, కృష్ణవంశీ, నాగార్జున, వెంకటేష్, నాగబాబు, రవితేజ, అల్లు అర్జున్, తరుణ్, వడ్డే నవీన్, బ్రహ్మాజీ అల్లు అరవింద్, బ్రహ్మానందం, అచ్చిరెడ్డి, రాజమౌళి, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ, కృష్ణవంశీ మొదట్నించీ సమాజానికి ఏదైనా చెప్పాలనే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తుంటారనీ, ఈ చిత్రంలో మహాత్మాగాంధీని కొత్త కోణంలో ఆవిష్కరించారనీ అన్నారు. విజయ్ ఆంధోని సంగీత దర్శకుడు కాకముందే సౌండ్ ఇంజనీర్, సౌండ్ మిక్సింగ్ స్పెషలిస్ట్ అనీ, ఇందులో సాహిత్యం స్పష్టంగా వినిపించేలా ఆయన సంగీతం అందించడం ముదావహమనీ అన్నారు. ఇందులో గాంధీపై తాను రాసిని 3 నిమిషాల పాటకు బాలు నేపథ్యగానం అందించారనీ, అలాగే కథానాయకుడు శ్రీకాంత్ మంచి నటన ప్రదర్శించారనీ అన్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ, శ్రీకాంత్ మంచి నటుడు, మంచి మనిషి, అజాత శత్రువని అభివర్ణించారు. తామిద్దరూ కలిసి 'తప్పు చేసి పప్పుకూడు' సినిమాలో నటించామని అన్నారు. అతని నూరవ సినిమా ఫంక్షన్ లో పాల్గొనడం ఆనందంగా ఉందనీ, అందుకు తగ్గట్టే సినిమా 100 రోజులు ఆడాలని కోరుకుంటున్నానని అన్నారు. నాగార్జున మాట్లాడుతూ, తమకంటే ముందు 100 చిత్రాలు పూర్తి చేసిన శ్రీకాంత్ కు అభినందనలని అన్నారు. పరిశ్రమలో అందరికీ మిత్రుడైన ఏకైక హీరో శ్రీకాంత్ అని వెంకటేష్ పేర్కొన్నారు. శ్రీకాంత్ తో కలిసి 'కొండపల్లి రాజు', 'అబ్బాయిగారు', 'సంక్రాంతి' సినిమాలు చేశానని అన్నారు. ఈ చిత్రం మంచి పవర్ ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాననీ, చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. బాపు తర్వాత తెలుగుదనం ఉట్టిపడే చిత్రాలు తీయడంలో కృష్ణవంశీ స్పెషలిస్ట్ అని తమ్మారెడ్డి భరద్వాజ అభినందించారు. కృష్ణవంశీ 'ఖడ్గం' తనలో దేశభక్తి భావాలు పెంచిందనీ, శ్రీకాంత్ నటించిన చిత్రాల్లో 'ఆపరేషన్ దుర్యోధన' తన ఫేవరెటట్ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. శ్రీకాంత్ ను తాను అన్నయ్యా అని పిలుస్తుంటానని చెప్పారు. వంద సినిమాలు పూర్తి చేసుకున్న బావకు తన అభినందనలని రవితేజ అన్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2-
|