చెన్నైకి షూటింగ్ లు ఛలో!
25 శాతం తరలి రావచ్చు...
ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లకు ఏర్పడుతున్న అవాంతరాల నేపథ్యంలో తెలుగు సినిమాల నిర్మాణం (షూటింగ్) కనీసం 25 శాతం వరకూ చెన్నైలో జరిగే అవకాశం ఉందని సౌత్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వి.సి.గుహనాథన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రొడక్షన్ మేనేజర్లు కొందరు చెన్నైలోని తమవారితో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని షూటింగ్ లు జరపాలని కోరుకుంటున్న వారు విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాల్లో తమ షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారని అన్నారు.
హైదరాబాద్ లో తెలుగు సినిమాలే కాకుండా ఇటీవల కాలంలో పలు తమిళ చిత్రాలు కూడా షూటింగ్ జరుపుకొంటున్నాయి. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ ల జోరు ఎక్కువగా ఉంటోంది. తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్ 'శివాజీ', కమల్ హాసన్ 'ఈనాడు' చిత్రాలు ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకొన్నాయి. రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న 'రోబో'లోని కొన్ని సన్నివేశాలు కూడా ఇక్కడే చిత్రీకరించారు.
చెన్నైలో మళ్లీ తెలుగు సినిమా షూటింగ్ ల జోరు పెరగనుందనే విషయంపై తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు డి.రామనాయణను సంప్రదించినప్పుడు ఆయన ఆచితూచి స్పందించారు. నిర్మాత ఒకసారి షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఎలాంటి అవాంతరం ఎదురైనా చాలా పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందనీ, షూటింగ్ ప్రాపర్టీ నష్టపోవడమే గాకుండా అగ్ర నటీనటుల కాల్షీట్లు మళ్లీ సంపాదించడం కష్టమవుతుందనీ ఆయన అన్నారు. ఈ పరిస్థితులు ప్రత్నామ్నాయ మార్గాల అన్వేషణకు దారితీస్తాయని విశ్లేషించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|