రిలీజ్ కు ముందే పైరసీ సీడీ
చెన్నై: తమిళ నటుడు శరత్ కుమార్ కథానాయకుడుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'జగ్గూభాయ్' చిత్రం అనూహ్యంగా పైరేటెడ్ సీడీ ద్వారా నెట్ లో ప్రత్యక్షం కావడంపై చిత్ర యూనిట్ తో పాటు, పరిశ్రమను చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పైరసీకారుల చర్యలను తీవ్రంగా ఖండించారు. బుధవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్, సహనిర్మాత రాధికా శరత్ కుమార్ కంటతడిపెట్టారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, చరణ్, ఆర్.బి.చౌదరి, రామనారాయణ, వి.సి.గుహనాథన్ సైతం పైరసీకి వ్యతిరేకంగా చిత్రయూనిట్ కు తమ సంఘీభావం తెలిపారు.
టెక్నాలజీపై మంచి పట్టు ఉన్న కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు కనిపిస్తోందనీ, సినిమా రిలీజ్ కు ముందే ల్యాబ్ నుంచి ప్రింట్ బయటకు రావడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందనీ చిత్ర దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన ప్రింటుపై తన పేరు వాటర్ మార్క్ తో ఉంటుందనీ, వైనల్ వెర్షన్ నుంచి వేరుచేసేందుకే ఈ వాటర్ మార్క్ ఉపయోగించామనీ చెప్పారు. ఈ పైరసీ మహమ్మారి ఎప్పటికైనా అదుపులోనికి వస్తుందా అనే భయాందోళనలు తనను వెంటాడుతున్నాయని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా లీక్ అయిన విషయాన్ని తనకు ఫ్యాన్స్ చెప్పినప్పుడు షాక్ తిన్నానని రాధికా శరత్ కుమార్ పేర్కొన్నారు. జీ మోషన్ పిక్చర్స్ తో కలిసి 'జగ్గూభాయ్' చిత్రాన్ని ఆమె నిర్మించారు. తాను ఫిర్యాదు చేసిన పది గంటల్లోనే నిందితులను అదుపులోనికి తీసుకున్నారనీ, తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి కరుణానిధికి తన కృతజ్ఞతలని ఆమె పేర్కొన్నారు. పైరసీదారులపై జరిపిన రైడ్ లో తన భర్త శరత్ కుమార్ గాయపడ్డారంటూ ఆమె కంటతడిపెట్టారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|