కళ తప్పిన 'టి' టౌన్!
తెలంగాణ ఉద్యమ ప్రభావంతో షూటింగ్ లు నిలిచిపోయి, కొత్త రిలీజ్ లు వాయిదా పడుతూ కొద్దికాలంగా టి-టౌన్ (టాలీవుడ్) పై తీవ్ర ప్రభావం పడింది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే తొలి చేదు అనుభవం సైతం తప్పలేదు. సింగరేణి కాలరీస్ లో తెలంగాణ ఉద్యమకారులు 'లీడర్' చిత్రాన్ని అడ్డుకోవడంతో పెద్ద చిత్రాల నిర్మాణ సంస్థలు కూడా తమ షూటింగ్ లను నిలిపివేస్తూ...ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే పనిలో పడ్డాయి. అంతకుముందు ఎన్టీఆర్ జూనియర్ 'బృందావనం', అల్లు అర్జున్ 'వరుడు', మహేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం, మంచు మనోజ్ చిత్రం షూటింగ్ లు కూడా ఇలాంటి ఆవాంతరాలనే ఎదుర్కొని మధ్యలోనే షూటింగ్ ఆపేసుకున్నాయి. ఈ పరిమాణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ టూరిజం డవలప్ మెంట్ చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనకు కూడా బ్రేక్ పడింది.
సంక్రాంతి పండుగకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమం ఇంకా చల్లారక పోవడంతో దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన పలు చిత్రాలు స్పష్టమైన విడుదల తేదీతో ముందుకు రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. వీటిలో 'అదుర్స్', 'నమో వెంకటేశ', 'శంభో శివ శంభో', 'లీడర్' వంటి చిత్రాలు ఉన్నాయి. ఎన్టీఆర్-వి.వినాయక్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య రూపొందిన 'అదుర్స్' చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సి ఉండగా అనివార్యంగా వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. అధికారికంగా ఈ తేదీని నిర్మాతలు ఇంకా ప్రకటించనప్పటికీ సంక్రాంతికే తమ చిత్రం థియేటర్ల ముందుకు వస్తుందని నిర్మాత వంశీ మోహన్ ధ్రువీకరించారు. 'నమో వెంకటేశ', 'శంభో శివ శంభో', 'కేడీ', 'లీడర్' వంటి పెద్ద సినిమాలు సైతం పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే రాబోయే వారాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఆదిత్యబాబుకు ఎదురైన చేదు అనుభవం తమ విషయంలోనూ పునరావృతం కారాదని ఫిల్మ్ మేకర్స్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. 'ఆర్య-2' చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లపై తెలంగాణ మద్దతుదారులు జరిపిన దాడుల నేపథ్యంలో ఆ చిత్ర ప్రదర్శనను నైజాం ఏరియాలో ఆదిత్యబాబు నిలిపివేశారు. 'నైజాంలో సినిమా నిలిపివేయడం వల్ల 3 నుంచి 4 కోట్లు నష్టపోయాం. ఆంధ్రలోనూ తరచు బంద్ ల వల్ల కూడా చాలానే నష్టపోయాం' అని ఆదిత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|