సంక్రాంతి రిలీజ్ లు ఇవే...
నెలరోజులకు పైగా రాష్ట్రంలో నెలకొన్ని అనిశ్చితి కారణంగా కొత్త రిలీజ్ లు లేక అనువాద చిత్రాలతోనే సరిపుచ్చుకుంటున్న సినీగోయెర్స్ కు సంక్రాంతి సీజన్ సరైన ఊరట కలిగించనుంది. సహజంగా ఈ సీజన్ లో పెద్ద హీరోల సినిమాలు మాత్రమే థియేటర్ల ముందుకు వస్తుంటాయి. థియేటర్ల కొరత కారణంగా చిన్న సినిమాలకు ఎదురుతెన్నులు తప్పవు. అయితే ఈసారి కొంత భిన్నమైన పరిస్థితి నెలకొంది. డిసెంబర్ మాసంలో అననుకూల పరిస్థితుల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడిన పలు చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు కూడా సంక్రాంతి సీజన్ పై కన్నేశాయి. పండక్కి మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో ఇంతవరకూ రిలీజ్ తేదీలు ప్రకటించిన పలు చిత్రాలు ఇప్పుడు తేదీలు డిక్లేర్ చేస్తుండటంతో సంక్రాంతి కౌంట్ డౌన్ మొదలైంది.
వెంకటేష్ కథానాయకుడుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన 'నమో వెంకటేశ' చిత్రం ఈనెల 14న విడుదలవుతోంది. పండుగకు మొదటిగా రిలీజ్ తేదీని ప్రకటించిన చిత్రం ఇదేనని చెప్పొచ్చు. నితిన్ సైతం ఈసారి 'సీతారాముల కళ్యాణం' చిత్రంతో పండుగ బరిలో నిలువనున్నారు. ఈనెల 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత మళ్ల విజయప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బింధుమాధవి, అదితిశర్మ ప్రధాన పాత్రల్లో శేషు ప్రియాంక నిర్మించిన 'ఓం శాంతి' చిత్రం సైతం 13న విడుదల తేదీని ఖరారు చేసుకుంది. కొద్దికాలంగా భారీ అంచనాలను సృష్టిస్తున్న ఎన్టీఆర్-వినాయక్ ల 'అదుర్స్' సైతం సంక్రాంతి సీజన్ ను వదులుకోరాదనే పట్టుదలతో ఉంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల కావలసి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో సంక్రాంతి సీజన్ ను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలరాదని పలు ఏరియాల డిస్ట్రిబ్యూటర్ల కోరిక పట్ల నిర్మాత వంశీ మోహన్
సుముఖంగా ఉన్నారు. ఈనెల 13న 'అదుర్స్' విడుదలయ్యే అవకాశం ఉంది. 14న రవితేజ 'శంభో శివ శంభో' రిలీజ్ కు కూడా ప్లానింగ్ జరుగుతోంది. వీటికి భిన్నంగా సంక్రాంతి బరిలో దిగాలనుకున్న నాగార్జున 'కేడీ' కేవలం ఈ నెలలో ఆడియో రీలీజ్ తో సరిపుచ్చుకుని ఫ్రిబ్రవరి రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓవరాల్ గా...13, 14 తేదీల్లో కనీసం 3 కొత్త రిలీజ్ లకు మాత్రం ఢోకాలేదు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|