జనం గుండె 'గుమ్మడి'
ఒక 'మహామంత్రి తిమ్మరుసు'
మరొక 'బలరాముడు'
ఇంకొక 'విశ్వామిత్రుడు'
చివరిగా...'కాశినాయన'
ఇంకా...భక్తపోతన, దశరథుడు, భీష్ముడు, ధర్మరాజు, కర్ణుడు, సత్రాజిత్తు, భృగుమహర్షి...వంటి ఎన్నో అద్భుత పాత్రలకు జీవం పోసిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఉమ్మడి కుటుంబంలో పెద్దన్నగా, ఎఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి ఎందరో హీరోలకు తండ్రిగా, తాతగా, చెప్పులు కుట్టే సగటు మనిషిగా, సాఫ్ట్ విలన్ గా, నిరుపేదగా...వాచకం-అభినయం సమపాళ్లలో రంగరించి ఆరు దశాబ్దాల నట జీవితంలో సుమారు 500 చిత్రాల్లో నటించిన సమున్నత కళాకారుడు గుమ్మడి.
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లూరు మండలం రావికంపాడులో బసవయ్య, బుచ్చమ్మ దంపతులకు 1927 జూలై 9న ఆయన గుమ్మడి వెంకటేశ్వరరావు జన్మించారు. ఎస్.ఎస్.ఎల్.సి. వరకూ చదివారు. విద్యార్థి దశలో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. 1942లో తొలిసారిగా ఒక నాటకం కోసం ముఖానికి రంగు వేసుకున్నారు. అందులో ఆయన వృద్ధుడుగా నటించారు. కాలక్రమంలో సినీ నటుడు అయినా తన సమకాలికులైన ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్.లకు తండ్రిగా, మామగా నటించిన సందర్భాలు ఎన్నో. అయితే గుమ్మడి తొలుత కథానాయకుడుగా 1950లో 'అదృష్ట దీపుడు' అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన కథానాయకుడుగా నటించిన 'జై వీర భేతాళ' కారణాంతరాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అనంతరం ఎన్టీఆర్ సొంత సినిమా 'తోడు దొంగలు'లో ఆయనతో సమానమైన పాత్ర పోషించారు. చిన్నవయసులోనే క్యారెక్టర్ నటుడుగా మారారు. 'అల్లూరు సీతారామరాజు' చిత్రంలో మల్లుదొర, 'మాయాబజార్'లో బలరాముడు పాత్రలు మరిచిపోలేం. గుమ్మడి అంటే వెంటనే గుర్తుకు వచ్చే పాత్ర 'మహామంత్రి తిమ్మరసు' సినిమాలోని తిమ్మరసు పాత్రే. ఎంతో గంభీరంగా ఆయన ఆ పాత్ర పోషించారు. చివర్లో కృష్ణదేవరాయలు కళ్లు పొడిపించమని ఆదేశించినప్పుడు నవ్వుతూ ఆ శిక్షను స్వీకరించి ఆ తర్వాత అసలు దోషి ఎవరో తేలిన తర్వాత కృష్ణదేవరాయలు వలవలా విలపిస్తుంటే 'రాయా' అంటూ కౌగిలించుకునే ఘట్టం ఎలా మరిచిపోగలం?. 'మహామంత్రి' తిమ్మరసు చిత్రానికి ఆయన జాతీయ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం అందుకున్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|