|
|
Articles: TP Features | తెలుగు వారంతా ఒక్కటే - Mr. Tirumalarao Jayadheer
| |
భాషాభిమానులు పెట్టుబడిదారీ సంస్కృతి వైపు ఉండి ఆ భావజాలం సృష్టించిన ఆలోచనల వైపు ఉంటారా? ప్రజా సంస్కృతికి విఘాతం కలిగించే ప్రాంతీయ దురభిమానం వైపే నిలుస్తారా? లేదా ప్రజాస్వామ్య దృక్పథంతో అడుగు వర్గాల ప్రజల భాషా సాంస్కృతిక రంగాలవైపా. క్షీణ సంస్కృతి దాడిని ఎదిరించి సమాజాన్ని రక్షించే వారిగా ఉంటారా?
ఆధిపత్య వర్గం సృష్టించిన మాయా భాషా సాహిత్య చరిత్ర, సాంస్కృతిక రంగాల్ని ప్రశ్నించి తృణీకరించడం ఈ కాలంలో అంత సులభసాధ్యం కాదు చాల మందికి. కాని మేధావులు అలా కాదు. వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించాలి కూడా. అందుకే వారిని ఆలోచించాల్సిందిగా కోరక తప్పదు.
తెలంగాణ ప్రజలు ఎప్పుడూ రాజ్యాలు నిర్మించారు కాబట్టే రాజ ధిక్కారం వారి సొంతం. కాకతీయల కాలంలోనే సమ్మక్క సారమ్మల పోరాటం జరిగింది. సముద్రాల వంటి వందలాది చెరువులు తవ్వి పంటపొలాలకు పచ్చ దుప్పట్లు కప్పారు. అందుకే అక్కడే భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమాలు వచ్చాయి. అక్కడే ఆస్థాన సంస్కృతి కన్నా జన సంస్కృతీ సాహిత్యాల చరిత్రే ఎక్కువ. రాజభాషలు ఎన్ని ఉన్నా చక్కని ప్రజల తెలుగుభాష ఈనాటికీ జీవధాతువులలో కళకళలాడుతున్నది.
ప్రధాన స్రవంతి చరిత్ర, సాహిత్య చరిత్రకారుల పాక్షిక ధోరణికి తెలంగాణ బలైందని రుజువైంది. ఇప్పుడు అలాంటి అలనాటి చరిత్ర, భాషా సాహిత్యాలతో తెలుగువారి ప్రాచీనతా మూలలను, విశిష్ట కోణాలనూ కలిపి సాంస్కృతిక చరిత్రని సమగ్రం చేసి జాతిని పరిపుష్టం చేయవలసిన అవసరం ఉంది.
అందుకే భౌగోళిక గీతలు చెరిగి మనసులో కల్పించబడిన సంకుచిత పరిధులు తొలగాలి. అపోహలు సమూలంగా నశించాలి. అప్పుడే రాష్ట్ర సరిహద్దుల గురించి కాకుండా విశాలమైన చిత్రపటం కోసం కృషి చేయాలి. ఆ చిత్రపటంలో జీవించే మనుషుల గురించి ఆలోచించాలి. మనం ఇప్పుడు ప్రపంచపటంలో ఎక్కడున్నా భాషా సంస్కృతుల చిత్రపటంలో భాగం కావాలి.
మనుషులు ఎక్కడున్నా ఒక్కటే అయినట్లు, మనుషుల్లో కష్టజీవులంతా ఒకటే అయినట్లు, మనుషుల్లో వివక్షకు గురైన మానవులంతా ఒకటే అయినట్లు, మనుషుల్లో ప్రత్యేకంగా స్త్రీల బాధలు ఒకటైనట్లు, తెలుగువారు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నా ఒకటి కావాలి. రాష్ట్ర భావన కన్నా భాషా భావన మానవుల్ని ఆలోచనాపరుల్ని చేస్తుంది. జాతి భావన శక్తిమంతులుగా తీర్చిదిద్దడానికి పనికొస్తుంది. సాంస్కృతిక భావన జాతిని ఐకమత్యంగా ఉంచుతుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|