|
|
Articles: TP Features | గుణపాఠం ఇంకెప్పుడు? - Prof. Sundaram RVS
| |
నేను, నాలాంటివారు కంటున్న కలలు ఫలించాలంటే చెయ్యాల్సిన కొన్ని పనుల్ని సూచిస్తున్నాను.
ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలనే విషయాల్ని మళ్ళీ మళ్లీ చెప్పనక్కరలేదు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు దీన్నే అనుసరిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ విషయాన్నే నొక్కి వక్కాణిస్తున్నాయి.
సాంకేతిక విద్యలతో సహా అన్నీ తెలుగులో నేర్చుకునే విధంగా అవకాశాలు కల్పించాలి. తెలుగువారైన ప్రొఫెసర్ బాలవీరారెడ్డి కర్నాటకలోని సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఉప కులపతులై ఇంజనీరింగులో కూడ కన్నడ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అందరి ప్రశంసకు పాత్రులయ్యారు. వైద్య విద్యను గాని, సాంకేతిక విద్యలను గాని నేర్చుకునేవారు తెలుగులో చక్కని ప్రవేశం పొంది ఉన్నప్పుడే వారి సేవలు తెలుగువారికి అందుతాయనే విషయాన్ని మన ఉన్నత విద్యామండలి గమనించాలి.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాలలో ఆంతరిక పరిపాలన అంతా తెలుగులోనే జరగాలి. ఈ విషయంలో కర్నాటక రాష్ట్రం నిదర్శనంగా ఉంది. అక్కడ వ్యవహారాలన్నీ కన్నడంలోనే జరుగుతాయి. బయటివారితో వ్యవహరించటం మాత్రమే ఇంగ్లీషులో జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ అనువాద అకాడెమీని స్థాపించాలి. ఈ విషయంలో కూడా కర్నాటక రాష్ట్రం మనకంటె ముందుంది. జాతీయ అనువాద సంస్థ ఏర్పాటై వందల కోట్లు ఖర్చు పెట్టటానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఆ నిధులను కూడా తెప్పించుకొని తెలుగులో అనువాద కార్యం సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా సాగాలి. ప్రపంచంలో వెలువడిన ఏ కొత్త సిద్ధాంతమైనా వెంటనే తెలుగులోకి రావాలి. తెలుగు సిద్ధాంత నిర్మాణం జరిగి, తెలుగులో ఆలోచించే విధానానికి ఇది నాంది అవుతుంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|