మళ్లీ ఈస్టిండియా కంపెనీ!
లండన్, 16 February, 2010: ఇండియాను ఒకప్పుడు పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీని తిరిగి ప్రారంభించాలని ముంబైకి చెందిన ఒక వాణిజ్యవేత్త యోచిస్తున్నారు. ఇందుకు సన్నాహకంగా ఆయన ఎంతో కష్టపడి వాటాలు కొనుగోలు చేస్తున్నారు. 15 మిలియన్ డాలర్ల పెట్టుబడి, డిజైనర్లు, బ్రాండ్ రీసర్చర్ల నుంచి చారిత్రకవేత్తల వరకు వివిధ నిపుణుల సలహాలతో సంజీవ్ మెహతా లండన్ నడిబొడ్డున ప్రధానమైన రిజెంట్ స్ట్రీట్ కు ఆనుకుని ఉన్న కాండ్యూయిట్ స్ట్రీట్ లో కంపెనీ స్టోర్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
దీనిని ఒక విజయంగా మెహతా అభివర్ణిస్తూ, 'మనపై ఒకప్పుడు ఆధిపత్యం వహించిన కంపెనీని సొంతం చేసుకుంటున్నానన్న అనిర్వచనీయమైన భావన నాకు కలుగుతోంది' అని చెప్పారు. తాను ప్రపంచం అంతా తిరిగానని, ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక కేంద్రాలు, మ్యూజియంలు సందర్శించానని, రికార్డులు అధ్యయనం చేశాని, ఆ సమయంలో వాణిజ్యంపై అవగాహన ఉన్న వ్యక్తులను కలుసుకున్నానని మెహతా తెలియజేశారు. 'ఇది ఒక బృహత్ బాధ్యత అనే భావనతో ఉన్నాను. నేను ఈ బ్రాండ్ ను సృష్టించలేదు. కాని దీనిని సృష్టించిన వర్తకుల వలె మార్గదర్శిని కావాలని అభిలషించాను' అని మెహతా తెలిపారు.
ఈస్ట్ ఇండీస్ దేశాలతో వర్తకం సాగించడం కోసం ముందుగా ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన జరిగింది. కాని అది ఆతరువాత ప్రధానంగా భారత ఉపఖండంతోను, చైనాతోను వర్తకం సాగించింది. ఇదేవిధంగా యూరప్ లో ఏర్పాటైన ఈస్ట్ ఇండియా కంపెనీలు పెక్కింటిలో పురాతనమైనదైన ఈ సంస్థకు 1600 డిసెంబర్ నెలలో మొదటి ఎలిజబెత్ రాణి ఈస్ట్ ఇండీస్ లో 'గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్' పేరిట ఇంగ్లీష్ రాయల్ చార్టర్ ను మంజూరు చేశారు.
News Posted: 16 February, 2010
|