శ్రీవారికి పరదాలిచ్చే మణి
తిరుమల, 17 September, 2009: 'టైలర్ మణి' పరమ బిజీ అయిపోయారు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా? అనేక సంవత్సరాలుగా శ్రీవారి సేవలో తరిస్తున్న దర్జీ.
తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతుని దగ్గర నుంచి సామాన్యుని వరకు అనునిత్యం మణి పనితనాన్ని చూస్తున్నవారే. అదుగో ఆ టైలర్ మణి ఇప్పుడు శ్రీవారి సేవలో నిమగ్నమై ఉన్నారు. బ్రహ్మోత్సవాలు దగ్గిర పడుతుండడంతో ఆయన, ఆయన బృందం హైరానా పడుతోంది.
ప్రతి ఏటా ఆయన స్వామి వారికి సమర్పించే కళాత్మక పరదాలు ప్రత్యేక ఆకర్షణలు. ఆయన అనేక సంవత్సరాలుగా ఈ పరదాలను స్వామి వారికి బహూకరించి తరిస్తున్నారు. సంవత్సరంలో నాలుగుసార్లు టైలర్ మణి ఈ కమనీయ, రమణీయ పరదాలను స్వామి వారికి అందజేస్తూ ఉంటారు. ఉగాది, అణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు అతి భారీగా ఉండే మూడు పరదాలను ఆయన ఇస్తుంటారు. ఎంబ్రాయిడరీ, కళ్ళు జిగేల్మనే రంగురంగుల పూసలు, రాళ్ళతో అలంకరించే ఈ పరదాలను దేవస్థానంలో మూడు పవిత్ర ప్రదేశాలలో వేలాడ దీస్తారు.
కులశేఖర పడి, రాములవారి మేడ, బంగారు వాకిలిలో ఈ పరదాలు కనువిందు చేస్తాయి. తిరుపతిలో చాలా రద్దీగా ఉండే మార్కెట్ లో మణి టైలరింగ్ దుకాణం నడుపుతున్నారు. ఉత్సవాలకు బహూకరించే పరదాలే కాకుండా మణి కురళంలను కూడా స్వామివారికి సమర్పించుకుంటారు. కురళం అంటే శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహానికి ముందు వేలాడ దీసే పరదా. తెర తీయరా తిరుపతీ దేవరా అని వేడుకోవడానికి ఈ పరదాయే భక్తునికీ, స్వామివారికి మధ్య అడ్డుగా ఉంటుంది. ఏకాంత సేవ అనంతరం శ్రీవారు నిదురించే శయన మందిరంలో కూడా మణి ఇచ్చిన కురళంనే తెరగా వాడతారు. ఇవి కాకుండా కల్యాణోత్సవ మండపంలో మనం చూసే పదకొండు అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పున ఉండే భారీ పరదా కూడా టైలర్ మణి రూపొందించిందే కావడం విశేషం.
వీటిని తయారు చేయడానికి ప్రతీసారీ రెండు నెలల సమయం పడుతుంది. అంటే టైలర్ మణి సంవత్సరం పొడవునా పరదాలను రూపొందించే పనిలోనే నిమగ్నమై ఉంటారు. అతి పెద్ద శాటిన్ బట్టతో తయారైయ్యే ఈ పరదాలు పూసలు, తళుకులు, సిల్కు, ఉలెన్ లేసులతో అలంకరించి ఉంటాయి. వీటిని రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి టైలర్ మణి సేకరిస్తూ ఉంటారు. ఈ పరదాల తయారీ కోసం తన దుకాణంలో ప్రత్యేక విభాగాన్నే మణి ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది కులశేఖర పడిలో వేలాడ దీసే పరదాను చాలా ప్రత్యేకంగా రూపొందించారు. శ్రీవారి నేత్ర దర్శన రూపాన్ని దీనిపై ఎంబ్రాయిడరీతో చిత్రీకరించారు. దేవాలయం అధికారులు టైలర్ మణిని సముచితంగానే గౌరవిస్తారు. మణికి దేవాలయంలో మహాద్వార ప్రవేశం కల్పించారు. పరదాలు తీసుకుని వాటిని ఆయా పవిత్ర ప్రదేశాలలో అలంకరిస్తారు.
News Posted: 17 September, 2009
|