భర్తలకూ వితంతు పింఛన్ అనంతపురం, July 19, 2025: భర్త చనిపోతే భార్యకు పింఛను ఇస్తే సరిపోదు, భార్య చనిపోయిన భర్తలకూ వితంతు పింఛన్ కావాలని ఓ బాధిత భర్త మొరపెట్టుకున్నాడు.
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తన నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఇటువంటి ప్రశ్న ఎదురవుతుందని ఆమె ఊహించి ఉండరు. భార్య చనిపోగా ఒంటరిగా మిగిలిన ఓ వితంతు భర్త ఎమ్మెల్యే వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకొచ్చిన కష్టం గురించి ఆమెతో చెప్పుకొని కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
భర్త చనిపోతే భార్యకు పింఛను ఇస్తున్న ప్రభుత్వానికి భార్య లేని భర్తల సమస్య పట్టదా అని ప్రశ్నించాడు. మేమేం పాపం చేసాం, మాకూ వితంతు పింఛన్ ఇప్పించి పుణ్యం కట్టుకోండమ్మయ్య అంటూ వేడుకున్నాడు.
నాలాంటి వారి సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లండి. మాకూ వితంతు పింఛను వచ్చేలా చూడండి, మీకు రుణపడి ఉంటాం తల్లీ అంటూ రెండు చేతులెత్తి వేడుకోవడం అందరినీ ఆలోచింపజేసింది.
News Posted: 19 July, 2025
|