కాన్సస్: నవంబర్ 18: అమెరికాలో తెలుగు వారి మేలుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా దాంపత్య జీవితం దృఢం చేసుకునేలా వెబినార్ నిర్వహించింది. దాంపత్య జీవితాన్ని విజయవంతంగా నడిపించేందుకు, వివాహబంధాన్ని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన కీలక మార్గాలపై నాట్స్ కాన్సస్ చాప్టర్ నుండి వెంకట్ మంత్రి, ప్రసాద్ ఇసుకపల్లి తాజాగా 'మ్యారేజ్ మెయింటెనెన్స్ కిట్' పేరుతో ఈ వెబినార్ నిర్వహించింది.
వివాహ బంధాలపై 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిలేషన్‌షిప్ సైకాలజీ నిపుణుడు ఛార్లెస్ రివర్స్ ఈ వెబినార్‌లో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. వివాహ బంధం బలహీనపడటానికి ప్రధాన కారణాన్ని ఛార్లెస్ వెల్లడించారు. 'జీవిత భాగస్వామి మీకు ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన మిత్రులైతే, మీరు ఇప్పుడు వారితో వ్యవహరిస్తున్న తీరులోనే వ్యవహరించగలుగుతారా? లేదా మార్చుకోవాల్సి వస్తుందా?" అనే కీలకమైన ప్రశ్నను దంపతులు తమకు తాము వేసుకోవాలని ఆయన సూచించారు.
దాంపత్యంలో పురుషులు తమ భార్యల నుండి గౌరవాన్ని ఆశిస్తే, మహిళలు తమ భర్తల నుండి ప్రేమ, శృంగారం, సంభాషణను కోరుకుంటారని తెలిపారు. ఈ అవసరాలను గుర్తించి తీర్చడమే వైవాహిక జీవిత నిర్వహణకు ముఖ్యమని ఛార్లెస్ రివర్స్ వివరించారు. అలాగే, వాదనలు పెరిగిపోయి గొడవలకు దారితీయడానికి ప్రధాన కారణం ఒకరి మాట ఒకరు వినకపోవడమే అని, స్నేహితుల్లా వ్యవహరించడం ద్వారా వీటిని నివారించవచ్చని ఛార్లెస్ తెలిపారు. దాంపత్యంలో పిల్లల కంటే, భార్యాభర్తల బంధానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే పిల్లలకు ప్రేమను పంచుకోవడంపై సరైన అవగాహన వస్తుందని ఆయన సలహా ఇచ్చారు.
వివాహంలో అనేక సమస్యలకు మూలం, ప్రస్తుత దాంపత్యం కంటే, పరిష్కారం కాని బాల్య సమస్యలే అని వివరించారు. మనల్ని మనం మార్చుకోవడం ద్వారా మాత్రమే బంధాన్ని కాపాడుకోగలమని చార్లెస్ సూచించారు. ప్రతి కుటుంబానికి ఉపయోగపడే ఉత్తమ వెబినార్ నిర్వహించినందుకు కాన్సస్ చాప్టర్ కాన్సస్ చాప్టర్‌కు చెందిన మదన సానే, రాధిక మంత్రి, విజయ్ రంగిని, శ్రీవిద్య ఇసుకపల్లి, రమణ కరే, సుష్మా గంప, నేహా పరిపాటి, వినీత్ చోపడే ఈ సమావేశంలో పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపినందుకు నాట్స్ విభాగ నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.