|
|
Articles: TP Features | సుప్రీంకోర్టు గొప్ప తీర్పు - Site Administrator
| |
(యద్దనపూడి హనుమంతరావు)
మాతృభాషా మాధ్యమంలో విద్యాబోధన విషయమై సుప్రీంకోర్టు వెలువరించిన సంచలనాత్మక తీర్పు, దానిని 'సుప్రీం చెప్పిన గొప్ప తీర్పు'గా అభివర్ణించిన కంచె ఐలయ్య వ్యాఖ్యానం నాలో తీవ్ర అలజడిని కలిగించాయి. రెండు మూడు రోజులు నిద్ర పట్టలేదు. అదే పనిగా దానిని తలపోస్తూ ఉంటే, నాకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి. నేను విద్యావేత్తను కాను. కాని సాధారణ పౌరునిగా నా భావాలను పంచుకోవాలన్నదే నా తాపత్రయం.
సుప్రీంకోర్టు తీర్పు దేశ భాషలను, ఆ భాషలు మాట్లాడే ప్రజల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందులోని మంచి చెడులను, ముఖ్యంగా అందులోని కొన్ని లొసుగులను రాగల ప్రమాదాలను 'సంపాదక హృదయం' పట్టి చూపింది. ప్రజాసాహిత సంపాదకీయం 'మౌఢ్యానికి రాజముద్ర వేసిన సుప్రీం' ఆ నిర్ణయానికి వెనుక గల కారణాలను ఎత్తి చూపింది. అందుకే నేను ఈ స్పందనను ఐలయ్య వాదనలకు మాత్రమే పరిమితం చేయదలచాను.
సత్యానికి వలె న్యాయానికి కూడా అనేక పార్శ్వాలు ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పు పాక్షిక న్యాయం కావచ్చునేమో గాని సంపూర్ణ న్యాయం కాదు. కాబోదు. ఐలయ్య అభిప్రాయాలూ అంతే. వారు తమ అభిప్రాయాలను విషయాన్ని ఆమూలాగ్రంగా అన్ని కోణాల నుంచి కూలంకషంగా పరిశీలించి ఏర్పరచుకున్నట్లుగా తోచదు. ఆ అభిప్రాయాలు గానీ, వాటి వెనుక ఉన్న కారణాలు గానీ తర్కానికి నిలిచేవి కావు. పరిమిత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని వాస్తవాలను విస్మరించి, కొన్ని నిర్ధారణ కాని అంశాలను ఆధారంగా చేసుకొని వారు ఈ తీర్మానాలకు వచ్చినట్లుగా అనిపిస్తుంది.
ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషు ప్రవేశపెడితే మాతృభాష. సంస్కృతి చచ్చిపోతాయని చాలామంది వాదిస్తున్నారని, అసలు భాషకు సంస్కృతికి సంబంధంలేని తాను చాలాకాలంగా వాదిస్తున్నానని ఐలయ్య అన్నారు. ఈ తీర్మానానికి ప్రాతిపదిక ఏదీ? దానికి ఉదాహరణగా శ్రమ జీవితం నుండి ఇంగ్లీషు భాషలో ఆలోచించి రాసే తన జీవితంలోనే సంస్కృతి పూర్తిగా మారిన పరిస్థితి లేదని చెప్పారు. వారు ఏ స్థాయి వరకు గ్రామంలో తల్లి భాషలో విద్యనభ్యసించారో, ఏ స్థాయి నుండి ఇంగ్లీషులో కొనసాగించారో చెప్పలేదు. తమ సంస్కృతి కొంతవరకు మారినట్లు అంగీకరించారు. సంస్కృతి వంటలు, తిండి, బట్ట, మతం మొదలైన అంశాలతో ముడిపడి ఉందని, ఒక్క భాషతోనే కాదని అన్నారు. ఇక్కడ సహజంగానే సంస్కృతి అంటే ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|