దాసు (శ్రీకాంత్) గాంధీనగర్ బస్తీలో ఉండే ఓ రౌడి. చిన్న చిన్న తగాదాలకు సెటిల్ మెంట్స్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఒక సెటిల్ మెంట్ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేయడంతో లాయర్ కృష్ణవేణి (భావన) అతనికి బెయిల్ ఇస్తుంది. క్రమంగా ఇద్దరి మధ్యా పరిచయం పెరుగుతుంది. మరోవైపు ఆ బస్తీపై కళారాణి (జ్యోతి) అనే అధికార పార్టీ పొలిటీషియన్ కన్నేస్తుంది. అక్కడ 'ఫ్యాబ్ సిటీ' ఏర్పాటు ప్రయత్నం చేస్తుండగా బస్తీ వాసులు అడ్డుకుంటారు. వారికి స్థానిక రాజకీయ నాయకుడు దాదా (జయప్రకాష్ రెడ్డి) అండగా నిలిచి కళారాణిని ఎదిరించి ఆ ప్రయత్నాన్ని అప్పటికి ఆపిస్తాడు. అయితే దాదా ఓ మేకవన్నె పులి. అక్కడ ఫ్యాబ్ సిటీ కట్టాలంటే తనకు 200 కోట్లు ఇవ్వమని కళారాణితో బేరసారాలు మొదలుపెడతాడు. అందుకు ఆమె ఒప్పుకోదు. దాదా నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడని నమ్మిన దాసు అతని దగ్గరకు చేరతాడు. ఓ దశలో అతని మాయమాటలు నమ్మిన దాసు అదే బస్తీ వాసులకు నాయకత్వం వహిస్తున్న ఠాగూర్ (శేఖర్ )పై దాడి చేస్తాడు. దాసుని కార్పొరేటర్ ను చేస్తానని నమ్మించిన దాదా ఎన్నికల సమయం వచ్చేసరికి తన నిజస్వరూపం ఏమిటో బయటపెడతాడు. దాంతో దాదాకు దాసు ఎదురుతిరుగుతాడు. అతని మీదే పోటీ చేసేందుకు 'మహాత్మ' అనే సొంత పార్టీని ప్రారంభిస్తాడు. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా దాసులో మార్పు తెచ్చేందుకు కృష్ణవేణి ప్రయత్నిస్తుంది. మహాత్ముని ఆశయాల పట్ల దాసు ఏవిధంగా ప్రభావితుడయ్యాడు...సత్యం, అహింసలతో అతను మహాత్ముడి గౌరవాన్ని ఏ విధంగా నిలబెట్టాడు? కాలనీ వాసులకు ఎలాంటి న్యాయం చేశాడు? అనేది మిగతా కథ.