చిరంజీవి అలియాస్ చిరంజీవులు (జగపతిబాబు) తూగోజి రాజోలులో ఓ వంద ఎకరాల ఆసామి. సిటీ లో ఉంటూ విలాసవంతమైన లైఫ్ కోరుకునే అమ్మాయి నీలిమ (నీలిమ). అలాంటి నీలిమకు చిరంజీవితో సంబంధం కుదురుతుంది. తన భావాలకు అతను సరిపోడని నీలిమ ఆ పెళ్లికి ఒప్పుకోదు. అయితే పెళ్లయ్యాక అతన్ని అనుకూలంగా మార్చుకోవచ్చని ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పి పెళ్లి చేస్తారు. నీలిమ క్రమంగా తన విశ్వరూపం చూపిస్తుంది. షేర్స్ లో 50 లక్షలు పెట్టుబడి పెట్టమని భర్తను శాసిస్తుంది. అయిష్టంగానే చిరంజీవి ఒప్పుకుంటాడు. స్టాక్ మార్కెట్ పతనంతో చిరంజీవి ఆ డబ్బు పోగొట్టుకుంటాడు. దీంతో సొంతిల్లు పోయి ఇద్దరూ అద్దె ఇంట్లో చేరుతారు. సాఫ్ట్ వేర్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టమని మరోసారి భర్తను ఆమె బలవంతం చేస్తోంది. అలా చేయకుంటే అబార్షన్ చేయించుకుంటానని బెదరిస్తుంది. పుట్టబోయే బిడ్డ మీద మమకారం, భార్యను కాదనుకోలేని మంచితనం చిరంజీవిని చేతులు కట్టిపడేస్తుంది. ఆర్థికమాంద్యంతో సాఫ్ట్ వేర్ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. చిరంజీవి దివాళా తీయడంతో నీలిమి అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. కొడుకు విశ్వనాథ్ (మాస్టర్ అతులిత్) విషయంలో కొంత ఘర్షణ జరుగుతుంది. విశ్వకు సరైన కాన్వెంట్ చదువు కూడా చిరంజీవి ఇవ్వలేడని నీలిమ ఎద్దేవా చేస్తుంది. విశ్వకు తండ్రి అంటే ప్రాణం కావడంతో అతని దగ్గరే ఉంటానని తేల్చిచెబుతాడు. బాగా బతికిన ఊరిలో ఇక మొహం చూపడం ఇష్టంలేని చిరంజీవి కట్టుబట్టలతో తన కొడుకును తీసుకుని హైదరాబాద్ వచ్చేస్తాడు. ఇక అక్కడ్నించి బతుకుపోరాటం మొదలవుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా తన కొడుకు ముఖంలో చిరునవ్వు చూడటం కోసం తపించిపోతుంటాడు. అతనికి మంచి కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ప్రయత్నంలో అతనికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించాడు? నీలిమలో ఎలాంటి పరివర్తన వచ్చింది? అనేది మిగతా కథ.