శివ (నితిన్) ఓ అనాథ. భయమంటే తెలియని యువకుడు. తనలాంటి అనాథల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఒకటే దారి ఎంచుకుంటాడు. అది దొంగతనాలు చేయడం. అయితే దొంగల్లో ఇతనో మంచిదొంగ. ఉన్నోళ్లను దోచుకుని లేనోళ్లకు పంచిపెడుతుంటాడు. మాఫియా సొమ్ము వసూలు కోసం దుబాయ్ కి చెందిన అండర్ వరల్డ్ డాన్ సుక్కూర్ అహ్మద్ (షావర్ అలీ) అనుచరుడు మక్సద్ హైద్రాబాద్ వచ్చి పోలీసులకు చిక్కిపోతాడు. క్రికెట్ బెట్టింగ్ సొమ్ము 500 కోట్లు దుబాయ్ అకౌంట్ కు చేర్చేందుకే వచ్చినట్టు ఇంటరాగేషన్ లో అతను ఒప్పుకుంటాడు. వాటర్ ట్యాంక్ లో ఉంచిన ఆ సొమ్మును హోం మంత్రి (ఆహుతి ప్రసాద్) తెలివిగా కొట్టేస్తాడు. దానిపై శివ కన్నేస్తాడు. తన తెలివితేటలతో హోం మంత్రి నుంచి ఆ సొమ్ము కాజేసి పోలీసులను తప్పించుకునే క్రమంలో రంగమ్మత్త (రమాప్రభ) అనే పెద్దావిడికి దగ్గరై ఆమెతో కలిసి ఓ మ్యారేజ్ కి హాజరవుతాడు. దారి మధ్యలో తారసపడిన కృష్ణవేణి అలియాస్ కృష్ణ (ఇలియానా) కూడా అదే పెళ్లికి వస్తుంది. తమాషాలతో మొదలై ఇద్దరూ ఒకరి మనసు మరొకరు తెలుసుకునే పనిలో పడాతారు. కృష్ణ మరెవరో కాదు. హోం మంత్రి కూతురు. హోం మంత్రి తన దగ్గరున్న సొమ్ము కాజేసింది శివేనని తెలుసుకుని పెళ్లి పందిట్లో అతను ఓ దొంగంటూ గొడవ చేస్తాడు. శివ కటకటలాలు వెనక్కి వెళ్తాడు. అతని జ్ఞాపకాలు మరిచిపోయేందుకు దుబాయ్ వెళ్లిన కృష్ణను సుక్కూర్ కిడ్నాప్ చేస్తాడు.తనకు రావాల్సిన 500 కోట్లతో పాటు పట్టుబడిన తన అనుచరులను వదిలిపెట్టమని షరతులు పెడతాడు. కృష్ణను విడిపించ గలిగే గట్స్, అందుకు తగిన ఎనర్జీ ఒక్క శివకే ఉన్నాయని గ్రహించిన హోం మంత్రి కొద్దిగా మెత్తబడి తన కూతుర్ని రక్షించమని అతన్ని కోరుతాడు. శివ మాఫియా డాన్ ను ఎదిరించి కృష్ణను రక్షించాడా? ఆ 500 కోట్ల వ్యవహారం ఏమైంది? దానిని తిరిగి ఇచ్చేందుకు శివ ఒప్పుకున్నాడా అనేది మిగతా కథ.