పదవులు పెరగలేదు
(వేముల సదానందం)
వరంగల్ : ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన మంత్రి వర్గంలో జిల్లా నుండి ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించడం పాత సంప్రదాయంగానే చెప్పుకుంటున్నారు. జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య, డిఎస్ రెడ్యనాయక్ లు గత మంత్రి వర్గంలో క్యాబినెట్ హోదాలో కొనసాగారు. 2004 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని రెండు లోక్ సభ, 13 అసెంబ్లీ సెగ్మెంట్ లలో కేవలం ఐదింటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలోనే జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. 2009 సాదారణ ఎన్నికల్లో జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనలో 2 లోక్ సభ, 12 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అంతే కాకుండా 2 లోక్ సభ సీట్లు కైవసం చేసుకుని విజయభేరి మోగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైతం పాత సంప్రదాయమే కొనసాగించడం పట్ల కాంగ్రెస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.
జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పొన్నాల లక్ష్మయ్యకు గతంలో నిర్వహించిన భారీ నీటి పారుదల శాఖను కేటాయించగా డోర్నకల్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రెడ్యానాయక్ ఈ సారి ఓటమి పాలు కావడంతో ఆ స్థానంలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచిన కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కేటాయించారు. కాగా లక్ష్మయ్య మంత్రి పదవి ఊహించిందే అయినప్పటికీ 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన బసవరాజు సారయ్య, సురేఖ, 8 సంవత్సరాల పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన గండ్ర వెంకట రమణారెడ్డి మంత్రి పదవుల కోసం తలపడ్డారు. కాగా సురేఖకు అవకాశం కల్పించి మంత్రుల సంఖ్యను పెంచకపోవడం పట్ల కాంగ్రెస్ వర్గాలు నిరుత్సాహంగా ఉన్నాయి.
జిల్లాకు మరో మంత్రి పదవిని పెంచి గండ్ర వెంకట రమణారెడ్డికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు చేసిన అనేక అవినీతి ఆరోపణలు శాసనసభలో, వెలుపల ఎంతో సమర్థవంతంగా తిప్పికొట్టిన దిట్టగా ముద్ర వేసుకున్న మంత్రి లక్ష్మయ్యను తిరిగి భారీ నీటి పారుదల శాఖ వరించింది. వైఎస్ కు అత్యంత సన్నిహితుడు కొండా మురళీధర్ రావు సతీమణి కొండా సురేఖకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కట్టబెట్టడం అనుయాయులకే మంత్రి పదవులు ఇచ్చినట్లు స్పష్ఠం అవుతుంది. మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన రజక సామాజిక వర్గానికి చెందిన సారయ్యకు మంత్రి పదవి కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
News Posted: 26 May, 2009
|