స్ఫూర్తిదాయకం చిరు ప్రసంగం
తెలంగాణ సమస్యలపైన, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పై సభలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యాఖ్యలు, తెలంగాణకు ప్రజారాజ్యం పార్టీ వ్యతిరేకం అంటూ తెరాస నాయకులు హరీష్ రావు, యాదగిరి చేసిన విమర్శలపై శ్రీనివాస మానాప్రగడ తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ తమ వ్యక్తిగత వివాదాల్లోకి ప్రజారాజ్యం పార్టీని లాగవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో హరీష్ రావు, యాదగిరి చేసిన ఆరోపణలు వాస్తవ విరుద్ధాలని ఆయన ఖండించారు. ప్రజారాజ్యం పార్టీ వల్లే తెలంగాణలో తెరాస సీట్లు కోల్పోయిందంటూ హరీష్ రావు, యాదగిరి చేసిన ఆరోపణలను శ్రీనివాస మానాప్రగడ కొట్టిపారేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా చిరంజీవి గాని, ప్రజారాజ్యం పార్టీ గాని ఎప్పుడు మాట్లాడారని, అలా మాట్లాడినట్లు చేసిన ఆరోపణలకు తెరాస నాయకుల వద్ద ఆధారాలుంటే చూపించాలని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలతో ఎన్నికల్లో కలిసి నడిచినందుకు తెరాస నాయకులు తలదించుకోవాలని శ్రీనివాస సలహా ఇచ్చారు. తప్పులు మీరు చేసి, ఇతర పార్టీలపైన రాళ్ళు వేసే కార్యక్రమాన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
అత్యంత విలువైన శాసనసభా సమయాన్ని, ప్రజల సొమ్మును అనవసర వ్యాఖ్యలు, రాద్దాంతాలు, వ్యక్తిగత విమర్శలు, ఒకరిపై ఒకరు బురద చల్లుకొనే కార్యక్రమాలతో వృథా చేయవద్దని ప్రభుత్వానికి, శాసనసభ్యులకు ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్, ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ సమావేశాలను విదేశాల్లో కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేస్తున్న టివి9, టివి5, సాక్షి టివి, ఆన్ లైన్ వెబ్ మీడియా సంస్థలకు ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు శ్రీనివాస మానాప్రగడ పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 11 June, 2009
|