చిరు ఒక్కరే హేపీ : గంటా
సామాజిక న్యాయం కోసం, సంపూర్ణ మార్పుకోసం రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో వెనుకపడ్డారని ఆయన విశ్లేషించారు. అధికారం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తే దారుణమైన ఫలితాలు వచ్చాయని, అయినా చిరంజీవి ఎక్కడా కుంగిపోకుండా ఓటమిని హుందాగా స్వీకరించారని ఆయన చెప్పారు. ఫలితాల శైలి తెలిసిన రెండు గంటల్లో మీడియా ముందుకు వచ్చిన చిరంజీవి తనకు అధికారం రాకపోయినా ప్రజలు ఆశీర్వదించారని చెప్పి, ఇది తమకు ప్రారంభం అని, వచ్చే ఐదేళ్లూ సేవ చేసి ప్రజల మన్నన పొందుతామని చిరంజీవి ప్రకటించడం తమందరికీ ఉత్తేజం ఇచ్చిందని శ్రీనివాసరావు పేర్కోన్నారు. తాను చంద్రబాబును చాలా సన్నిహితంగా గమనించానని, ఏడాదిగా చిరంజీవిని చూస్తున్నానని, అందరిలోకి సంతోషంగా ఉన్న రాజకీయ నాయకుడు చిరంజీవి ఒక్కరేనని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా చిరంజీవి ప్రతీ రోజూ జిల్లాల నాయకులతో సమావేశమై పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేస్తూనే ఉన్నారని అన్నారు. జరిగిన పొరబాట్లను చక్కదిద్దుకుని పార్టీని అట్టడుగు స్థాయి నుంచీ నిర్మించే పనిలో ఉన్నామని ఆయన వివరించారు.
ఆహ్లాదకరమైన రాజకీయాల కోసం వ్యాపారరంగంలో ఉన్న తాను తెలుగుదేశం పార్టీలోకి వచ్చానని, కాని కాలక్రమేణా ఆ వాతావరణం తెలుగుదేశంలో పోయిందని ఆయన చెప్పారు. కుళ్ళు, కుతంత్రాలు లేని రాజకీయాలు, ప్రజలకు ఎంతో కొంత సేవచేసే రాజకీయాలను తాను ఆశించానని, కాని విశాఖ జిల్లా తెలుగుదేశంలో ఆ వాతావరణం కనిపించలేదని చెప్పారు. విశాఖ నగర మేయర్ ఎన్నికల అనంతరం తాను తెలుగుదేశంలో క్రియాశీలక పాత్ర నుంచి తప్పుకున్నానని, చిరంజీవి పార్టీ పెట్టకపోతే తాను మొత్తంగా రాజకీయాల నుంచి వైదొలగే వాడినని వివరించారు. చంద్రబాబు మీద కోపంతో తాను తెలుగుదేశం పార్టీని వదలలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ మంచి ఫలితాలనే సాధించిందని వివరించారు. ప్రజారాజ్యంలో ప్రవాసాంధ్రులకు ప్రాముఖ్యత ఉంటుందని, పార్టీలో వారిని భాగస్వాములను చేసేందుకు తీసుకోవలసిన చర్యలను గురించి తాను తిరగి వెళ్ళిన తరువాత చిరంజీవితో చర్చిస్తానని తెలిపారు.
Pages: -1- 2 News Posted: 3 July, 2009
|