సిలికానాంధ్ర' సంగీత శిబిరం
అతిధి ఉపన్యాసంతో సభా ప్రారంభం చేస్తూ, తన తొలిపలుకులతో సిలికానాంధ్ర కార్యవర్గాన్నీ, అతిధి ఉపన్యాసకులైన కీరవాణి, గజల్ శ్రీనివాసులను పరిచయం చేస్తూ తల్లాప్రగడ రావు ప్రసంగించారు. కీరవాణిగారు మాట్లాడుతూ, క్లాసులో లలిత సంగీతం ఎందుకు నేర్చుకోవాలి, తెలుగు ఎందుకు నేర్చుకోవాలి అన్న ప్రశ్నలను సంధించి వాటికి ఆయనే సొదాహరణంగా వివరణ ఇచ్చారు. 'తెలుగు వైవిధ్యమున్న కఠినమైన భాషే కానీ ఎంతో తీయని భాష. భావ వ్యక్తీకరణకు తెలుగును మించిన భాష లేదు. భావం అర్థం చేసుకుని తెలుగు పాట పాడితే ఆ పాట మరింత మధురంగావుంటుంది' అన్నారు. ఆ భావాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్పడానికి రామాచారి వంటి సరైన గురువునే ఎన్నుకున్నారని కీరవాణి విద్యార్థులను అభినందించారు. 'ఒక్క పాటపాడరా' అని సభికులు అడిగిందే తడవుగా కీరవాణి అక్కడవున్న హార్మోనీయాన్ని అందుకుని ఎంతో వుత్సాహంగా పాడి వింపించి అందరినీ రంజింపజేసారు. వాయిద్య సహకారలు లేకపోతే పాశ్చాత్య సంగీతంలో మజాలేదనీ, కానీ భారతియ సంగీతం అలాకాదనీ అన్నారు.
తరువాత గజల్ శ్రీనివాస్ ఉపన్యసిస్తూ, సిలికానాంధ్ర ఒక సంఘం కాదు. ఇది తెలుగు తల్లికి ఒక గుడిలాంటిది అని వర్ణించారు. తెలుగు తల్లికి మీరు చేసిన పూజలు మరెవరూ చేయరు. అందుకే నాకు సిలికానాంధ్ర అంటే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది అని ప్రశంసలందించారు. అలగే రామాచారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన రాళ్లతోకూడా పాడించగల సత్తావున్నవారు. తనకు గురుతుల్యులు అంటూ తన భక్తిభావాన్ని ప్రకటించారు. గజల్ శ్రీనివాస్ తాను 100 భాషలలో పాడి గిన్నిస్ బుక్ రికార్డును గెలుచుకున్న తన గేయాలను అనేక భాషలలో పాడి వినిపించారు. అన్ని భాషల్లో పాడగల రహస్యం, తాను తెలుగువాడిని కావడమే అని ఛలోక్తి విసిరారు. తాను శాంతి కాముకుడననీ, గాంధేయ మార్గాన్ని నమ్ముతాననీ అంటూ, మన జాతి గౌరవం నిలపమని అభ్యర్ధించారు. ఆ తరువాత అందరి కోరికపై ఒక చిన్న పాపాయిపైన, ఒక అమ్మపైన, తన వూరుపైన గళ్ళను పాడి వినిపించారు.
ఇలా రసరంజకంగా అమృతతుల్యంగా సాగిన లలిత సంగీత విద్యాభోధన ఒక వైవిధ్యమైన తరగతిగా రూపుదిద్దుకుంది. సిలికానాంధ్ర అధ్యక్షులు చమర్తి రాజు మాట్లాడుతూ, రామాచారి వంటి గురువును ఇక్కడే వుంచేసుకుంటే బాగుంటుదన్న ఆశాభావన్ని వ్యక్తం చేశారు. రామాచారి ప్రసంగిస్తూ, కీరవాణి కొత్త కళాకారులకు అవకాశం కల్పిస్తారనీ, వారికి ఆయన ఒక వెలుగనీ కొనియాడారు. అలాగే గజల్ శ్రీనివాస్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, కోమాలో వున్న వారిని కూడా నిద్ర లేపగల శక్తి ఆయన పాటకు ఉందని మెచ్చుకున్నారు. అలాగే పాడే ప్రతి పాటకూ ఒక ప్రయోజనం వుండాలనీ అన్నారు. పాటకు ప్రయోజనం ప్రేక్షకుల సంపూర్ణ స్పందన మాత్రమేననీ అన్నారు. పాట గొంతుకతోకాదు ఆత్మతో పాడండి అని తన సందేశాన్ని అందజేశారు. కూచిభట్ల ఆనంద్ మాట్లాడుతూ, మాటల మద్య పాడుతూ సజావుగా సాగిపోగలిగితేగానీ భావం పలకదని, భావం కోసం వాయుద్య సహాయంపై అధారపడకూడదనీ అన్నారు.
బాలాంతరపు రజనీకాంత రావు, పాలగుమ్మి, చిత్తరంజన్‌గార్ల చేత ప్రాచుర్యంలోకి వచ్చిన లలితసంగీతం సిలికానాంధ్రలో పలువురు ప్రముఖగురువుల నేత్రుత్వంలో ఒక కొత్త యుగాన్ని సృష్ఠించనున్నది. ఆగస్టు 8వ తారీఖున ఈ శిక్షణా శిభిరంలో తర్ఫీదు పొందుతున్న విద్యార్థులు తమ గళంవిప్పి తమ సామర్ధ్యాన్ని ప్రదర్శించనున్నారు.
Pages: -1- 2 News Posted: 24 July, 2009
|