వైఎస్సార్ యువసేన నివాళి
వైఎస్సార్ యువసేన యుఎస్ఎ కమిటీ గౌరవ సలహాదారు మునగాల బ్రహ్మానందరెడ్డి నివాళులు అర్పిస్తూ, ఆంధ్రుల కలలు సాకారం చేసే మహోన్నతమైన లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి కారణజన్ముడుగా అవతరించారని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జ్ఞాపకాల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థ మీడియా సెక్రటరీ పాల భానోజీరెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం లాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు రూపొందించి, అమలు చేయడం ద్వారా వైఎస్ భారత రాజకీయాల్లో నూతన వరవడిని సృష్టించారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లోకి ఎంతగా చొచ్చుకుపోయారన్నదానికి అనేక తార్కాణాలున్నాయన్నారు. వైఎస్ లేని రాజకీయాలు దేవుడు లేని గుడి లాంటివని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి సోదరి జక్కిరెడ్డి సుబ్బాయమ్మ మాట్లాడుతూ, అఖిలాంధ్ర ఆడపడుచుల అన్న వైఎస్ అకాల మరణం తీరని లోటు అని సంతాపం ప్రకటించారు. మహిళకు హోంమంత్రి పదవీ బాధ్యతలు అప్పగించడం ద్వారా వైఎస్ సరికొత్త రికార్డు సృష్టించారని ప్రశంసించారు.
ప్రజల కోసమే బ్రతికి, ప్రజల కోసమే ప్రాణాలను సైతం అర్పించిన స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'భారత రత్న' అవార్డు ప్రదానం చేయాలని ఈ సంస్మరణ సభ సందర్భంగా వైఎస్సార్ యువసేన యుఎస్ఎ కమిటీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దివంగత వైఎస్ కలలను సాకారం చేసేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయాలని వైఎస్సార్ యువసేన యుఎస్ఎ కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
మన అభిమాన నాయకుడు, అందరి హృదయాలను దోచుకున్న జన నేత వైఎస్సార్ ఇక లేరన్న వార్తను జీర్ణించుకోవాలని, తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ యువసేన యుఎస్ఎ కమిటీ విజ్ఞప్తి చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఎవ్వరూ నిద్రించకూడదని, విశ్రమించకూడదని సంస్థ పిలుపునిచ్చింది.
Pages: -1- 2 News Posted: 8 September, 2009
|