'మామ'కు స్వరాంజలి

సిలికాన్ వ్యాలీ లో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ సియారా అట్లాంటిక్ సి.ఇ.ఓ. రాజురెడ్డి జ్యోతి ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో ముందుగా చిమట మ్యూజిక్.కాం అధినేత శ్రీవాసరావు చిమట, కౌముది.నెట్ ఎడిటర్ కిరణ్ ప్రభ ప్రారంభోపన్యాసం చేశారు. స్వరబ్రహ్మ గొప్పతనాన్ని వారిద్దరూ తమ ఉపన్యాసంలో బహుదా కొనియాడారు. తెలుగు పాత పాటలకు అమెరికా సముచిత ప్రాచుర్యం కల్పించాలనే సత్సంకల్పంతో ఈ కాన్సర్ట్ సీరీస్ ప్రారంభించినట్టు శ్రీనివాస్ వెల్లడించారు. అలనాటి సంగీత దర్శకుడు సత్యం పాటలతో జూన్ 2009లో తొలిసారిగా ఈ సీరీస్ ప్రారంభించినట్లు చెప్పారు. మహదేవన్ పాటల కచేరి ఈ సీరీస్ లో రెండోది.
గాయనీ గాయకులందరూ 'ఝుమ్మంది నాదం', 'శంకరా.. నాద శరీరాపరా', 'చిటపట చినుకు పడుతూ ఉంటే', 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను', 'కలువకు చంద్రుడు ఎంతో దూరం', 'నెమలికి నేర్పిన నడకలివి', 'నేనొక ప్రేమ పిపాసిని', 'ప్రతీరాత్రి వసంతరాత్రి', 'ధాత తలపున', 'చెంగావి రంగు చీర', 'మొక్కజొన్న తోటలో', 'ఇన్నిరాసుల యునికి', 'చిటపట చినుకులు పడుతూ ఉంటే', 'మావ మావ మావ' లాంటి ఆణిముత్యాలతో ప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించారు.
గత పాతికేళ్ళుగా అమెరికాలో ఉన్న తెలుగువారిని మంచి పాటలతో అలరిస్తున్న రాజు ఈడూరికి, మణిశాస్త్రికి కార్యక్రమం మధ్యలో డాక్టర్ బులుసు నారాయణ చేతుల మీదగా సన్మానం జరిగింది. స్థానిక పీకాక్ ఇండియన్ రెస్టారెంట్ ఈ విభావరికి గ్రాండ్ స్పాన్సర్ గా, రవి ట్యాక్సెస్, చానెల్ రియల ఎస్టేట్, శ్రీ ట్రావెల్స్, సిటీబ్యాంక్, ఓం ఇన్సూరెన్స్ సర్వీసెస్, కౌముది.నెట్ తదితర సంస్థలు కో-స్పాన్సర్లుగా వ్యవహరించాయి. బే ఏరియాలో అత్యంత వేగంగా ప్రసిద్ధి పొందుతున్న మొట్టమొదటి తెలుగు రేడియో స్టేషన్ ప్రవాసవాణి (1170 ఎ.ఎం.) మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

ఈ ఝుమ్మంది నాదం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ తెలుగు పాత పాటలకు చిమట మ్యూజిక్.కాం చేస్తున్న సేవలను కొనియాడారు. చివరిగా ఈ కార్యక్రమం విజయానికి కృషిచేసిన వలంటీర్లను ప్రశంసిస్తూ, మరో ఆరు నెలల్లో సీరీస్ లోని మూడవ కాన్సర్ట్ గా ఇళయరాజా పాటలతో ముందుకు వస్తామని కార్యక్రమం సమన్వయకర్తలు శ్రీనివాస్ చిమట, వంశీకృష్ణ నాదెళ్ళ, సురేష్ మంత్రాల, రమణ ఈడూరి ప్రకటించారు. కార్యక్రమం చివరిలో కె.వి.మహాదేవన్ పాటల పోటీలో విజేతలుగా నిలిచిన విశాఖ్ సుబ్రమణి, రామకృష్ణ వెంగళసెట్టి, హిమజ మొవ్వ, పూజిత దసిక, విద్య చిమట, సింధూజ బొక్కిసంలకు మెమొంటోలు ప్రదానం చేశారు.
Pages: -1- 2 News Posted: 18 November, 2009
|