విభజనకు ఎన్నారైల విముఖత
ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల గుర్తింపు సమస్య, రాజకీయ సంక్షోభం, ప్రభుత్వ ఆస్తుల నష్టం, విద్యార్థుల్లో అసంతృప్తి, ఆదాయం తగ్గిపోవడం, సామాన్యుల జీవనం దుర్భరం కావడం లాంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఎన్నారైలు ఆందోళన వెలిబుచ్చారు. వీటి కారణంగా రాష్ట్రాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. విభజించు పాలించు అనే బ్రిటిష్ వారి విధానాన్ని ఈ సందర్భంలో స్వార్థ రాజకీయ వేర్పాటువాదులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నారు. ఆంధ్రరాష్ట్రంలోని తెలంగాణ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఈ ఎన్నారైలంతా సమైక్యాంధ్రకు మద్దతుగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. తీర్మానంలో ప్రధానమైన అంశాలివి :
1) ఆంధ్ర రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించాలి.
2) రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన అత్యవసర చర్యలు తీసుకోవాలి.
3) రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య ఏర్పడిన ఆర్థిక అసమానత్వాన్ని తొలగించేందుకు అవసరమైన సూచనలు, సూత్రాలు, సలహాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సలహా కమిటీలను ఏర్పాటు చేయాలి.
4) ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం ఎంపిలు, ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్లు ఆమోదించాలి.
5) విభజన సమస్యపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ప్రజలు, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కలిసి చర్చించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వేదికను ఏర్పాటు చేయాలి.
ఈ సమావేశంలో చర్చ మరీ ముఖ్యంగా హైదరాబాద్ అంశంపైన కొనసాగింది. గత పదేళ్ళ కాలంలో హైదరాబాద్ లో ఐటి, ఇతర పరిశ్రమలు అనూహ్యంగా అభివృద్ధి చెందిన విషయాన్ని వక్తలు ఉటంకించారు. హైదరాబాద్ నగరం ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాలకూ చెందినదని రాష్ట్రాన్ని, నగరాన్ని విభజించాలనే డిమాండ్ సమంజసం కాదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. హైదరాబాద్ లోను, దాని చుట్టుపక్కల త్వరలోనే ఐఐటి, ఎన్ఐటి, బిట్స్, ఐఎస్ బి, ట్రిపుల్ ఐటి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనేక కేంద్రప్రభుత్వ ఆధీనంలో నడిచే రీసెర్చ్ సంస్థలు ఏర్పాటు కానున్నాయని, ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయని వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధిలో కోస్తా ఆంధ్ర వాసులు ప్రముఖమైన పాత్ర వహించారన్న అంశాన్ని వక్తలు ప్రస్తావించారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగస్వాములైన ఏ ఒక్కరూ నగరం ఇతరుల పరం అవుతుందంటే కలలో కూడా అంగీకరించబోరన్నారు. సోదరభావంతో, ఒకే కుటుంబం అన్న భావనతోనే హైదరాబాద్ లో కలిసి మెలిసి ఉండేందుకే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారన్నారు.
ఈ సమావేశం అతి తక్కువ సమయంలోనే విజయవంతం కావడానికి పలువురు వలంటీర్లు స్వచ్ఛందంగా కృషి చేశారు. ప్రసాద్ కావూరు, శ్రీనివాస్ పెన్మెత్స, రామానాయుడు కంటుబుక్త, ప్రవీణ్ పెన్మెత్స, పొన్నాల జాన్, ప్రసాద్ మన్నె, కిరణ్ పాటిబండ్ల, శైలజ అడ్లూరు, సత్య నేమన, దాము గేదల, సాయి చేకూరి తదితరులు ఈ సమావేశం నిర్వహణలో విశేషంగా కృషి చేశారు. మ్యూజిక్ సిస్టాన్ని సమకూర్చిన సాలు జేమ్స్, సమావేశానికి అవసరమైన సౌకర్యాలు కల్పించిన రాడిసన్ హొటల్ యాజమాన్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
సమైక్యాంధ్రకు అనుకూలంగా మద్దకు ఇచ్చేవారు తమ తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో పాల్గొనాలనుకుంటే alltelugus@googlegroups.comలో సైన్ అప్ కావచ్చు.
Pages: -1- 2 News Posted: 23 December, 2009
|