మట్టిలో పుట్టిన 'నవోదయం'
హైదరాబాద్ : పశువులను కాసిన ఆ పసివాడే సమాజ సేవలో ముందు వరుసలో నిలిచాడు. 'మట్టిలో పుట్టిన మాణిక్యం' అయిన ఆ బాలుడు తన ఇంటి పేరునే 'నవోదయ'గా మార్చుకున్నాడు.నలుగురు నడిచే దారిలో కాకుండా సమాజానికి పనికివచ్చే మంచి వ్యక్తిగా మారిపోయాడు. సమాజంలో నలుగురికీ ఉపయోగపడే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఏసీ గదుల్లో కూర్చొని హాయిగా జీవితాన్ని అనుభవించాల్సిన ఆ యువకుడు ఇప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కన్నభూమి సేవలో పునీతుడవుతున్నాడు. గ్రామస్థులకు పలు కార్యక్రమాలపై అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకువస్తున్నాడు.
'నవోదయ మురళి'గా ప్రసిద్ధుడైన గంగాధర్ మురళి హైదరాబాద్ నగరానికి 120 కిలోమీటర్ల దూరంలోని రామతీర్థం అనే గ్రామంలో జన్మించాడు. మురళి పుట్టిన ఊరు నుంచి బస్సు ఎక్కాలంటే మైళ్ళ దూరం నడవాల్సి ఉండేది. రాష్ట్రంలోని అత్యం మారుమూలన రామతీర్థం గ్రామం ఉంది. పరిమిత అవకాశాలే ఉన్న ఆ గ్రామంలో పుట్టిన మురళి కలలు మాత్రం అపరిమితంగానే ఉండేవి. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నవోదయ రెసిడెన్షియల్ విద్యా సంస్థలో ప్రవేశం కోసం 1990లో జాతీయ స్ర్కీనింగ్ పరీక్ష రాసి పాసవడంతో మురళి కలల సాకారానికి శ్రీకారం చుట్టినట్లైంది. 1999 వరకూ మురళి నవోదయ విద్యా సంస్థలోని విద్యాభ్యాసం చేశాడు.
2006 నాటికి మురళి ఎం.బి.ఎ, ఎం.సి.ఎ. పట్టాలు తీసుకున్న మురళి విప్రో ఐటి సంస్థలో టెక్నికల్ మేనేజర్ ఉద్యోగంలో చేరాడు. సాఫీగా ఉద్యోగం చేసుకుంటున్న మురళి ఒకసారి చిరంజీవి నటించిన 'ఠాగూర్' సినిమాను చూశాడు. ఆ సినిమాలో చిరంజీవి అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా నిజాయితీపరులతో నిర్వహించిన నెట్ వర్క్ మురళిని బాగా ఆకట్టుకుంది. దీనితో మురళి ఠాగూర్ సినిమాను 80 సార్లు సినిమాను చూశాడు. సమాజం కోసం తనదైన శైలిలో సేవ చేయాలని నిర్ణయించుకున్న మురళి విప్రో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ముందుగా తాను విద్యాభ్యాసం చేసిన నవోదయ విద్యా సంస్థలోని 'పూర్వ విద్యార్థుల నెట్ వర్క్'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతవరకూ తాను పొదుపు చేసుకున్న సొమ్మును ఖర్చుచేసి భారతదేశ వ్యాప్తంగా పర్యటించాడు. ప్రస్తుతం 'నవోదయ నెట్ వర్క్'లో ఐఏఎస్, ఐపీఎస్ లు, న్యాయవాదులు, ఇంజనీర్లు, వైద్యులు 20 వేల మందికి పైగా సభ్యులుగా ఉన్నారు. సమాజ సేవకు నవోదయ నెట్ వర్క్ లోని సభ్యులంతా ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉంటారు.
నవోదయ నెట్ వర్క్ ద్వారా మురళి నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల అతని ఇంటి పేరు మారిపోయింది. గంగాధర్ మురళి ఇప్పుడు 'నవోదయ మురళి'గా మారిపోయాడు. మురళి స్వగ్రామంలోను, చుట్టుపక్కల గ్రామస్థుల్లోనూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ, ఆరోగ్య కార్యక్రమాల పట్ల మురళి చక్కని అవగాహన కల్పించి వాటిని చక్కగా వినియోగించుకునేలా చేస్తున్నాడు. నవోదయ మురళి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అశోక్ తన్వర్ ద్వారా కాంగ్రెస్ యువజన నాయకుడు, ఎం.పి. రాహుల్ గాంధీని కలిసి వివరించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్న నవోదయ మురళి రోజుకు తాను తన కోసం 8 గంటలు, సమాజం కోసం మరో 8 గంటలు పనిచేస్తున్నట్లు చెప్పాడు.
News Posted: 20 February, 2009
|