'చిరు' యజ్ఞానికి మద్దతు
లాస్ ఏంజిల్స్ : చిరంజీవి రాజకీయరంగ ప్రవేశంతో 'మార్పు', 'సామాజిక న్యాయం' అనే నినాదాలు ప్రపంచంలోని ప్రతి మారుమూలలోనూ ప్రతిధ్వనిస్తున్నాయని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి శేఖర్ సీరా పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి రూపొందించిన సామాజిక న్యాయం అంశానికి తనవంతు ప్రచారాన్ని కల్పించిన ఘనత చిరంజీవికి దక్కిందని ఆయన అన్నారు. ఫిబ్రవరి 22న లాస్ ఏంజిల్స్ నగరంలో 'ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం' సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసలే కాని దాని కన్నా ఆలశ్యంగా అయినా సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఐక్యరాజ్యం సమితి గుర్తించడం ముదావహం అన్నారు. ఈ కార్యక్రమానికి పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ అమెరికాలో స్థిరపడిన ప్రముఖ న్యాయవాదులు, వైద్యులు, ఆర్కిటెక్ట్ లు, సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో తమతమ పుట్టిన ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, సంపూర్ణ ఉపాధి కల్పన, లింగ సమానత్వం పాటించడం, సామాజిక న్యాయ సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై సవివరమైన చర్చ జరిగింది.
తమ తమ పుట్టిన ప్రాంతాల్లో సామాజిక న్యాయం తదితర కార్యక్రమాలను అమలు చేసేందుకు గాను విరాళాలు సేకరించేందుకు ప్రతి నెలా 20న గాని ప్రతి నెలాఖరున వచ్చే శని, ఆదివారాల్లో గాని అమెరికా, కెనడా, యుకె, ఐర్లండ్, మస్కట్, దుబాయి, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియాలలోని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తామని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలోను రానున్న చారిత్రక ఎన్నికల్లో మంచి ప్రజా ప్రతినిధులను మన స్నేహితులు, కుటుంబాలు ఎన్నుకోవడానికి ఎన్నారై మిత్రుల సహకారం బాగా ఉపయోగపడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ కోరుకుంటోందన్నారు. మార్పు, సామాజికన్యాయాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయగలరన్న పూర్తి విశ్వాసాన్ని శ్రీనివాస మానాప్రగడ వ్యక్తం చేశారు.
మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం చిరంజీవి చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ ప్రెసిడెంట్ నర్సయ్య వడ్రాణం, వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ, ప్రధాన కార్యదర్శి శేఖర్ సీరా, ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్లు కల్యాణ్ పల్లా, రఘువీర్ బండి, ప్రజాసంబంధాల ఇన్ చార్జి శ్రీకాంత్ పలివెల, జాతీయ మహిళా సమన్వయకర్త రజని ఆకురాతి, దినేష్, సలహాదారు కృష్ణమూర్తి పొడిపిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
News Posted: 24 February, 2009
|