వైఎస్ కు అభినందనలు
వాషింగ్టన్ : సిఎన్ ఎన్ ఐబిఎన్ సంస్థ నిర్వహించిన సర్వే ముఖ్యమంత్రి వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తున్నట్లు తేలడంతో 'వైఎస్ ఆర్ యువసేన అమెరికా కమిటీ' హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ముందస్తుగా తాము అభినందనలు తెలుపుతున్నామని వైఎస్ ఆర్ యువసేన అమెరికా కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించేందుకు వైఎస్, పార్టీ నాయకులు రాష్ట్రంలో చేస్తున్న అవిశ్రాంత కృషే కారణమని నాగిరెడ్డి ప్రశంసించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన పట్ల ఆంధ్రప్రదేశ్ లోని 73 శాతం మంది ప్రజలు సానుకూలత వ్యక్తం చేయడం నిజంగా గొప్ప అంశమని నాగిరెడ్డి పేర్కొన్నారు. సిఎన్ ఎన్ సర్వేలో మహాకూటమికి 30 శాతం, మెగాకూటమికి కేవలం 7 శాతం మంది మాత్రమే సానుకూలత వ్యక్తం చేసినట్లు తేలింది. సహజ నాయకుడు, సినిమా నటుడు, వెన్నుపోటుదారుల మధ్య జరిగే సమరంలో వైఎస్ కు అనుకూలంగా తమ అభిమతాన్ని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారని ఈ సర్వే ద్వారా మరోసారి రుజువైందని నాగిరెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రూపొందించి, అమలు చేస్తున్న పలు పథకాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమైందన్నారు. అలాగే తెలంగాణ సెంటిమెంట్ తో ఆటలాడుతున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పట్ల ప్రజల్లో ఏహ్యభావం బాగా ఎక్కువగా ఉన్నట్లు కూడా ఈ సర్వే ద్వారా తేటతెల్లం అయిందన్నారు.
మూడు దశాబ్దాల పాటు సినిమారంగంలో ఉండి కోట్లాది రూపాయలు కూడబెట్టి, ఇప్పుడు మార్పు అంటూ రాజకీయాల్లోకివచ్చిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి సిఎన్ ఎన్ సర్వే కళ్ళు తెరిపించగలదని నాగిరెడ్డి తన ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఎంత సంపాదించినా సినీ పరిశ్రమలో, స్నేహితులలో కనీసం ఒక్కరికైనా తన జీవితకాలంలో సహాయం చేయని, ఒక్క రూపాయి కూడా తాను పుట్టిన ఊరికి గాని మరెక్కడా గాని ఖర్చు చేయని చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ప్రజలను బాగుచేస్తానంటే నమ్మేదెలా అన్నారు. వేదికల మీద మదర్ థెరెస్సా, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, గాంధీ మహాత్ముని చిత్రపటాలు పెట్టుకొన్న చిరంజీవి 'సామాజిక న్యాయం' ముసుగులో తన కుటుంబ సభ్యులను ప్రమోట్ చేసుకుంటున్నారని నాగిరెడ్డి విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 225 అసెంబ్లీ స్థానాల్లోను, 35 లోక్ సభా స్థానాల్లోనూ జయకేతనం ఎగరేయడం ఖాయమన్న విశ్వాసాన్ని నాగిరెడ్డి తన ప్రకటనలో వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ ను మళ్ళీ ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్ర ప్రజలకు వైఎస్ ఆర్ యువసేన, అమెరికా కమిటీ తరఫున నాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
News Posted: 3 March, 2009
|