'పిఆర్పీ డబ్బు పార్టీ కాదు'
వాషింగ్టన్ : ప్రజారాజ్యం పార్టీ డబ్బుల కోసం పనిచేస్తున్న పార్టీ ఎంతమాత్రమూ కాదని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్, ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ టిక్కెట్ అడిగిన తనను పిఆర్పీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ పది కోట్ల రూపాయలు అడిగారంటూ ప్రజారాజ్యం పార్టీ గుంటూరు జిల్లా కో కన్వీనర్, ప్రవాసాంధ్రుడు సత్య వాసంశెట్టి మీడియా ద్వారా చేసిన ఆరోపణలలో అణువంతైనా నిజం లేదని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్, ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిజానికి అతి తక్కువ సమయంలోనే సత్య వాసంశెట్టికి ప్రజారాజ్యం పార్టీలో ఎంతో ప్రాధాన్యం కల్పించి గుంటూరు జిల్లా కో కన్వీనర్ గా నియమించినట్లు ఆయన తెలిపారు. సొంత ఎజెండాతో పార్టీలో చేరిన సత్య తన స్వార్ధం కోసమే పార్టీని దెబ్బతీసేందుకు సిద్ధపడ్డారని ఆయన ఆరోపించారు. సమాజంలో మార్పుకోసం, రాష్ట్రం అభివృద్ధి కోసమే చిరంజీవి కోట్లాది రాష్ట్ర ప్రజల ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చిన నిస్వార్ధపరుడైన చిరంజీవిపైన, ఆయన నాయకత్వంలో నడుస్తున్న ప్రజారాజ్యం పార్టీ పైన ఆరోపణలు చేయడానికి కొంచెమైనా సిగ్గు పడి ఉండాలని శ్రీనివాస మానాప్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసత్యాలు చెప్పి పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని, పార్టీ క్యాడర్ లో అయోమయం సృష్టించాలని చూస్తున్న సత్య వాసంశెట్టి మాటలను పరిగణనలోకి తీసుకోవద్దని, ఆయన చెప్పే అసత్య వార్తలను ప్రచురించవద్దని మీడియాకు శ్రీనివాస మానాప్రగడ తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ముందుకు నడిచే ప్రజల బాగు కోసమే పనిచేసే ప్రజారాజ్యం అనే విషయం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి మారుమూలకూ చేరిందని, ఈ విషయం పిఆర్పీ ప్యానెల్ సభ్యులు నిర్వహించిన సర్వేలో కూడా తేలిందని శ్రీనివాస మానాప్రగడ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడిగా (ముఖ్యమంత్రి) ఎవరిని ఎన్నుకోవాలన్న అంశాన్ని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున బరిలో నిలబెట్టే అభ్యర్థులపై పార్టీ నిర్వహించిన సర్వేలో ప్రజల అభీష్టం ఇప్పటికే తెలిసిందని, మరి కొద్ది రోజుల్లోనే పిఆర్పీ అభ్యర్ధుల జాబితాతో ముందుకు వస్తోందన్నారు.
ప్రజారాజ్యం పార్టీ నాయకత్వం నమ్మి పదవులు కట్టబెట్టినప్పటికీ మొన్న కేసినేని నాని, ఇప్పుడు సత్య వాసంశెట్టి పార్టీకి ద్రోహం చేశారని దుయ్యబట్టారు. వారిద్దరూ టిడిపికి కోవర్టులుగా వారు వ్యవహరించిన విషయం ఇప్పుడిప్పుడే వెల్లడవుతోందని శ్రీనివాస మానాప్రగడ తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ దక్కలేదనో, పార్టీలో ప్రముఖ స్థానం కల్పించలేదన్న అక్కసుతో పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వారు దయచేసి పార్టీపై నిందలు వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైనవారని, ఎవరేమి చెప్పినా నమ్మే స్థితిలో వారు లేరన్నది ముందుగా ఆరోపణలు చేసే వారు గుర్తుంచుకోవాలని సూచించారు. పార్టీపైన ఆరోపణలు మానుకొని ప్రజల కోసం పనిచేసేందుకు ముందుకు రావాలని శ్రీనివాస మానాప్రగడ కోరారు. ముందుగా మీరు ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్చుకుంటే, మిమ్మల్ని అందరూ గౌరవిస్తారన్నది మరచిపోకూడదన్నారు. ఇదే విషయం అన్ని పార్టీలు, టిక్కెట్లు, పదవులు ఆశించే వారందరికీ ఈ అంశం వర్తిస్తుందని శ్రీనివాస మానాప్రగడ తన ప్రకటనలో స్పష్టం చేశారు.
News Posted: 7 March, 2009
|