తానా టైమ్ మిషన్..!
హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో నాయకుల ఆధిపత్య పోరు సమసిపోయింది. ప్రభాకర చౌదరి కాకరాలను అధ్యక్ష పదవి నుంచి తొలగించినవారే మళ్లీ ఆ పదవిలో ప్రతిష్ఠించారు. కాకరాలను పదవీచ్యుతుడిని చేసి, జయరాం కోమటి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దరిమిలా గత సెప్టెంబర్ నుంచి జరిగిన పరిణామాలను పీడకలగా భావించి మరచిపోవాలని ఇరువర్గాలూ నిర్ణయించాయి. ప్రభాకర చౌదరికి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని తానా పాలకమండలి ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంస్థ కార్యదర్శి ప్రసాద్ తోటకూర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకం సత్వరం అమలులోకి వచ్చిందని చెప్పారు. ఇకపై పరస్పర గౌరవాభిమానాలతో అమెరికాలో తెలుగుజాతి ఉన్నతి కోసం సమష్టిగా కృషి చేయాలని నాయకులు నిర్ణయించారు.
తనకు మళ్లీ పదవిని అప్పగించినందుకు తానా పాలకమండలికి, జయరాం కోమటికి ప్రబాక చౌదరి ధన్యవాదాలు తెలిపారు. పరస్పర అంగీకారంతో వివాదాన్ని పరిష్కరించుకోవడం ఆనందంగా ఉందని కాకరాల అన్నారు. ఐక్యత, సమరసత, సేవాభావాల స్ఫూర్తితో పాలకమండలితో, షికాగో కాన్ఫరెన్స్ కమిటీతో, సంస్థ సభ్యులందరితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. ఇటీవలి విభేదాలను మరచిపోయి సేవాభావంతో తానా కార్యక్రమాలను నడిపిద్దామని పిలుపునిచ్చారు. షికాగోలో జూలై 2-4 తేదీలలో జరిగే తానా 17వ సదస్సును ఇదివరకెన్నడూ లేనంత ఘనంగా నిర్వహించుకునేందుకు అందరూ కృషిచేయాలని కోరారు.
అధ్యక్ష పదవిని చేపట్టిన సందర్భంగా ప్రభాకర చౌదరిని జయరాం అభినందించారు. ఈ పరిణామం తానా చరిత్రలో వైభవోపేతమైన నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా గత కొద్ది నెలలు సమర్థ నాయకత్వం అందించినందుకు జయరాంను పాలకమండలి అభినందించింది. ఇల్లినాయ్ లోని రోజ్ మాంట్ డోనాల్డ్ స్టీఫెన్స్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే తానా తదుపరి సదస్సుకు సభ్యులందరూ సకుటుంబంగా హాజరుకావాలని పాలకమండలి కోరింది. సదస్సు సమన్వయకర్త యుగంధర్ యడ్లపాటి సారధ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ప్రసాద్ వివరించారు.
News Posted: 9 March, 2009
|