అలరించిన తెలుగు వెన్నెల
డల్లాస్ : తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థ తెలుగు సాహితి వేదిక నిర్వహించిన 20 వ 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం స్థానిక కోకిల ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది సాహితీ ప్రియులు హాజరయ్యారు. సమావేశానికి పద్మశ్రీ ఎస్.వి. రామారావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
మొదట నందివాడ ఉదయ భాస్కర్ స్వీయ కవిత చదివి వినిపించారు. తరువాత చంద్ర కన్నెగంటి తెలుగులో కవిత్వంలోని కొన్ని విశేషాలను సభికులకు వివరించారు. తదుపరి సురేష్ మండువ కొత్త గాలి కవితా సంపుటి సభికులను ఆకట్టుకుంది. తరువాత లక్ష్మినాగ్ సూరిబొట్ల ఉగాది కవిత వినిపించారు. తోటకూర ప్రసాద్ ముఖ్యఅతిథి ఎస్.వి. రామారావును సభకు పరిచయం చేశారు.
మొదట రామారావు స్వీయ కవితలు చదివి వినిపించారు. తదుపరి ప్రముఖ వ్యక్తులు నార్ల వెంకటేశ్వరరావ్, ఆచార్య సంజీవ్ దేవ్, మాదవపెద్ది గోఖలె, కొడవటిగంటి కుటుంబరావుతో తనకున్న అనుబంధాన్ని ఆహూతులతో పంచుకున్నారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంత్ మల్లవరపు తెలుగు భాషలో ఈ తరం పిల్లలతో మాట్లాడవలసిన ఆవశ్యకతను తెలియచేశారు. ముఖ్యఅతిథిని శ్యామల రుమాల్ల, శాంత పులిగండ్ల , పూర్ణ నెహ్రూ శాలువతో సత్కరించగా, టాంటెక్స్ ఉపాధ్యక్షుడు ఎన్.ఎం.ఎస్. రెడ్డి పుష్పగుచ్ఛంతో, సాహితీ వేదిక కార్యవర్గం జ్ఞాపికతో సత్కరించారు. ఎం.వి.ఎల్. ప్రసాద్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
News Posted: 19 March, 2009
|